బాలుడిపై కాల్పుల కేసులో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2020-12-29T05:14:17+05:30 IST

బాలుడిపై నాటు తుపాకీ పేలిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

బాలుడిపై కాల్పుల కేసులో నిందితుల అరెస్టు
స్వాధీనం చేసుకున్న నాటుతుపాకీ, నల్లమందు, నిందితులతో పోలీసులు

శాంతిపురం, డిసెంబరు 28: బాలుడిపై నాటు తుపాకీ పేలిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కుప్పం గ్రామీణ సీఐ యతీంద్ర, రాళ్లబూదగూరు ఎస్‌ఐ మురళీమోహన్‌ల కథనం మేరకు.. శాంతిపురం మండలంలోని జోగిండ్లు గ్రామానికి చెందిన అంజి పెంపుడు పంది తప్పించుకు తిరుగుతుండగా ఈ నెల 24న సోలిశెట్టిపల్లెకు చెందిన శివ అనేవ్యక్తితో దానిని చంపేందుకు పురమాయించాడు. అతడు గ్రామ సమీపంలోని తైలం తోపులో పంది అలికిడి విని నాటుతుపాకీతో  కాల్పులు జరిపాడు. అతనికి సాయంగా నవీన్‌, శరవణ, అంజి వెళ్లారు. శివ తుపాకీ పేల్చడంతో అక్కడ ఆడుకుంటున్న సుభాష్‌(14) కడుపులోకి తూటాలు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. సుభాష్‌ తల్లి ఫిర్యాదు మేరకు రాళ్లబూదగూరు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో  సోమవారం సాయంత్రం కుప్పం -కేజీఎఫ్‌ రహదారిలో గెసికపల్లె నాలుగు రోడ్ల కూడలి వద్ద శివ, నవీన్‌, అంజి, శరవణలను అరెస్టు చేశారు. వారి నుంచి నాటుతుపాకీ, గుండ్లు, నల్లమందు స్వాధీనం చేసుకున్నారు. శివకు నాటు తుపాకీ విక్రయించిన కర్ణాటక రాష్ట్రం విరూపాక్షపురానికి చెందిన రమేష్‌ను సైతం అరె స్టు చేశారు.

Updated Date - 2020-12-29T05:14:17+05:30 IST