యూనిఫారం కుట్టు కూలీకి రూ.2.02 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2020-02-05T23:04:46+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫారం కుట్టించే బాధ్యతను ప్రభుత్వం తల్లులకే వదిలేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడు జతల ..

యూనిఫారం కుట్టు కూలీకి రూ.2.02 కోట్లు విడుదల

కుట్టించాల్సిన బాధ్యత తల్లులదే
రెండు జతల కుట్టు కూలీ
రూ. 80 అమ్మఒడికి జమ
మరో రూ.100 చేతినుంచి చెల్లించాల్సిందే
 
కలికిరి, ఫిబ్రవరి 4: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫారం కుట్టించే బాధ్యతను ప్రభుత్వం తల్లులకే వదిలేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడు జతల యూనిఫారం బట్టలను అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ తాజాగా మంగళవారం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఒక జత మాత్రం కుట్టించిన యూనిఫారం ఇవ్వనుంది. మరో రెండు జతలకు అయ్యే వస్త్రాలను మాత్రం ఎంఈవోల ద్వారా అందజేయనున్నారు. ఈ రెండు జతలను విద్యార్థుల తల్లులే బాధ్యత తీసుకుని దర్జీల దగ్గర కుట్టించుకోవలసి వుంటుంది. ఈ రెండు జతల కోసం ఒక్కో విద్యార్థికి రూ.80 కుట్టు కూలీ కోసం ప్రభుత్వం అందజేస్తుంది. ఈ 80రూపాయలను అమ్మఒడి ఖాతాలకు జమ చేయనుంది. మరో జత బట్టలను మాత్రం ఆప్కో ద్వారానే కుట్టించి విద్యార్థులకు అందజేస్తారు.
 
అదే విధంగా తతిమ్మా రెండు జతలకయ్యే వస్త్రాన్ని ఆప్కోనే ఎంఈవోలకు సరఫరా చేస్తుంది. కాగా జిల్లాకు సంబంధించి ఒకటి నుంచి 8వ తరగతి వరకూ చదువుతున్న 2,52,600 మంది విద్యార్థులకు గానూ రూ.2,02,08,000 విడుదలయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని 2,38,114 మందికి, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 4,478 మందికి, మోడల్‌ స్కూళ్ళలోని 4,547 మందికి, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లోని 2,212 మందికి, వివిధ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు చెందిన 2,288 మందికి, మదర్సా సంస్థలకు చెందిన పాఠశాలల్లోని 931 మందికి రెండు జతల యూనిఫారంకు రూ. 80 వంతున ఈ కుట్టుకూలి ఖర్చులు అందనున్నాయి.
 
స్పష్టత లేని అమ్మఒడి లేనివారి పరిస్థితి
అమ్మఒడి ఖాతా ఒక విద్యార్థికి అందే లబ్ధి కోసం మాత్రమే ఏర్పాటయ్యింది. అంటే అమ్మఒడి లబ్ధిదారులందరికీ కుట్టుకూలీ ఖర్చులు రెండు జతలకు కలిపి రూ.80 వంతు అందనుంది. అయితే అమ్మఒడి లబ్ధ్ది చేకూరని ఒకే తల్లికి చెందిన మిగతా పిల్లలకు ఇది వర్తిస్తుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. ఇక అమ్మఒడి లబ్ధి పరిధిలోకి రాని వారు ప్రభుత్వ పాఠశాలల్లోనే దాదాపు పాతిక భాగం వున్నారు.వీరికి యూనిఫారం అందజేస్తారా లేదా అన్న విషయంపై కూడా స్పష్టత లేదు. మరో వైపు రెండు జతల యూనిఫారం కుట్టుకూలీ రూ.80 ఏమాత్రం సరిపోదని పలువురు పెదవి విరుస్తున్నారు.రెండు జతలకు మరో వంద రూపాయలు చేతి నుంచి వేసుకోవలసిందేనని చెబుతున్నారు.

Updated Date - 2020-02-05T23:04:46+05:30 IST