ఎస్టీ గురుకుల పాఠశాలలో అధ్వాన భోజనం

ABN , First Publish Date - 2020-02-05T23:04:45+05:30 IST

గిరిజన విద్యార్థుల కడుపుకొట్టేందుకు మనసెలా వచ్చింది. చికెన్‌ దాచిపెట్టి నాటకాలాడుతారా? అని ఎమ్మెల్యే నవాజ్‌బాషా పట్టణ ఎస్టీ గురుకుల..

ఎస్టీ గురుకుల పాఠశాలలో అధ్వాన భోజనం

ఎమ్మెల్యే తనిఖీల్లో బయటపడిన అక్రమాలు
 
మదనపల్లె టౌన్‌, ఫిబ్రవరి 4: గిరిజన విద్యార్థుల కడుపుకొట్టేందుకు మనసెలా వచ్చింది. చికెన్‌ దాచిపెట్టి నాటకాలాడుతారా? అని ఎమ్మెల్యే నవాజ్‌బాషా పట్టణ ఎస్టీ గురుకుల పాఠశాల హాస్టల్‌ వార్డెన్‌, వంట మనిషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాల హాస్టల్‌లో 234 మంది విద్యార్థులు ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం 200 మంది హాజరు కాగా, వీరందరికీ చికెన్‌ అందించాల్సి ఉంది. విద్యార్థికి వందగ్రాముల వంతున 40కిలోలు వండాలి. అయితే హాస్టల్‌ సిబ్బంది 17 కిలోల చికెన్‌ మాత్రమే తెచ్చి వండారు. అందులోనూ నాలుగు కిలోలు వంటగదిలో దాచిపెట్టారు. ఈ విషయం పీఎంసీ(పేరెంట్స్‌ మానిటరింగ్‌ కమిటీ) సభ్యుడు బీవీప్రసాద్‌ గుర్తించి ఎమ్మెల్యే నవాజ్‌బాషాకు ఫిర్యాదు చేశారు.
 
దీంతో ఆయన గురుకుల పాఠశాల చేరుకుని విచారించారు. మెనూ మేరకు భోజనం వడ్డించక పోవడంతో వార్డెన్‌ కన్నయ్య, వంట మనిషిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటగదిలో దాచిన చికెన్‌ను సిబ్బంది మాయం చేసేయత్నం చేయడంపై మండిపడ్డారు. కాగా, తమకు రెండు చికెన్‌ ముక్కలే ఇస్తున్నారనీ, ముద్దకట్టిన అన్నం వడ్డిస్తున్నారనీ విద్యార్థులు వాపోయారు. వంట మనిషి ఒక్కరే ఉండడంతో తామూ గరిట పడుతున్నామన్నారు. దీంతో హాస్టల్‌లో జరిగే అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదనపు సిబ్బంది ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు జింకా వెంకటాచలపతి, బాలగంగాధర్‌రెడ్డి, ఖాజా, ఉదయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-05T23:04:45+05:30 IST