‘బీరుబుస’తో పశువుల ప్రాణాలకు ముప్పు

ABN , First Publish Date - 2020-02-05T23:04:45+05:30 IST

తక్కువ ధరకు దొరుకుతుందని, ఎక్కువ పాలదిగుబడి వస్తుందన్న ఆశతో రైతులు పశువులకు బీరుబుస (మొలాసిస్‌ పిప్పితో కూడిన ..

‘బీరుబుస’తో పశువుల ప్రాణాలకు ముప్పు

వెటర్నరీలో ఆవుకు శస్త్రచికిత్స.. అయినా మృతి
 
తిరుపతి(విద్య), ఫిబ్రవరి4: తక్కువ ధరకు దొరుకుతుందని, ఎక్కువ పాలదిగుబడి వస్తుందన్న ఆశతో రైతులు పశువులకు బీరుబుస (మొలాసిస్‌ పిప్పితో కూడిన వేస్ట్‌)ను దాణాగా పెట్టొద్దని వెటర్నరీ యూనివర్సిటీ వీసీసీ విభాగాధిపతి డాక్టర్‌ వైకుంఠరావు పేర్కొన్నారు. కలకడ మండలం కొత్తపల్లెలో ఆమ్లఅజీర్తితో బాధపడుతున్న ఆవును తిరుపతిలోని వీసీసీకు తీసుకొచ్చారు. ఆవుకు ప్రతిరోజూ నూకలతో కూడిన ఆహారం, బీరుబుస దాణాగా పెట్టడంతో 10 రోజులుగా కడుపుఉబ్బి అనారోగ్యం పాలైంది. ఆహారం తీసుకోవడం కష్టంగా ఉండడంతో తిరుపతికి తీసుకొచ్చారు. ప్రొఫెసర్‌ రఘునాఽథ్‌ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఆ ఆవుకు శస్త్రచికిత్సచేసి కడుపులోని వ్యర్థాలను బయటకు తీశారు.
 
అయితే అప్పటికే పరిస్థితి చేయిదాటడంతో ఆవు మృతిచెందింది. ఈ సందర్భంగా వైకుంఠరావు మాట్లాడుతూ పశువుకు బీరుబుస పెడితే తాత్కాలికంగా ఎక్కువపాలు ఇస్తాయని, అయితే ప్రాణానికి ప్రమాదకరమని వివరించారు. తక్కువధరకు లభిస్తుందన్న కారణంతో బీరుబుస ఆహారంగా పెట్టొద్దని కోరారు. మృతిచెందిన ఈ ఆవు ప్రతిరోజూ 30 లీటర్లపాలు ఇస్తుండేదని, గత 10 రోజులుగా పాలు ఇవ్వడం మానేసిందని రైతు వాపోయారు.

Updated Date - 2020-02-05T23:04:45+05:30 IST