రేషన్‌ కార్డులేవీ తొలగించలేదు

ABN , First Publish Date - 2020-02-05T23:04:45+05:30 IST

రేషన్‌ కార్డుదారులెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని జాయింట్‌ కలెక్టర్‌ డి. మార్కొండేయులు తెలిపారు.

రేషన్‌ కార్డులేవీ తొలగించలేదు

అనర్హుల పరిశీలన జరుగుతోంది : జేసీ
 
చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 4: రేషన్‌ కార్డుదారులెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని జాయింట్‌ కలెక్టర్‌ డి. మార్కొండేయులు తెలిపారు. ఇటీవల చేపట్టిన నవశకం సర్వే ఆధారంగా అర్హులైన బియ్యం కార్డు లబ్ధిదారుల వివరాలు సేకరణ చేస్తున్నామన్నారు. ఇంతవరకు ఎవరి రేషన్‌ కార్డూ తొలగించలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేర గత నెల చివర్లో రేషన్‌ కార్డుల జాబితాలను ప్రదర్శించామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 11.33 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శక సూత్రాల మేర అర్హులు, అనర్హుల జాబితాలు సిద్ధం చేసి సచివాలయాల్లో ప్రదర్శించామని చెప్పారు.
 
ఇంకా తాత్కాలిక, శాశ్వత వలసదారులు, 300 యూనిట్లకు మించి విద్యుత్తువాడకందారులు, ఆదాయపన్ను, అధికంగా ఇంటి స్థలం ఉన్నవారి వివరాలు ప్రదర్శించినట్లు తెలిపారు. ఇంతవరకు 10 వేల మంది తమ అభ్యంతరాలు అందజేశారన్నారు. వాటిని పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. 300 యూనిట్లకు మించి విద్యుత్తు వాడకం చేశారని వచ్చిన అభ్యంతరాల పరిశీలన విద్యుత్తుశాఖ ద్వారా చేయిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్తు వాడకం రశీదులను కూడా పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం మ్యాపింగ్‌లు గ్రామ సచివాలయ వాలంటీర్లు చేస్తున్నారన్నారు. అర్హులకు ఈనెల 15-22 తేదీల మధ్య బియ్యం కార్డులు ముద్రించి పంపిణీ చేస్తామన్నారు. బియ్యం కార్డులు రేషన్‌ కొనుగోలుకు మాత్రమే ఉపయోగపడతాయని, మరే ఇతర పథకాలకు ఉపయోగపవదని స్పష్టం చేశారు.

Updated Date - 2020-02-05T23:04:45+05:30 IST