బాలాజీ ఆటోమొబైల్స్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-11-27T05:57:43+05:30 IST

మదనపల్లె బాలాజీ ఆటోమొబైల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం జరిగింది.

బాలాజీ ఆటోమొబైల్స్‌లో అగ్నిప్రమాదం
ఆటోమొబైల్స్‌ దుకాణం నిర్వహిస్తున్న భవనాన్ని కమ్ముకున్న పొగ

రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం


మదనపల్లె రూరల్‌, నవంబరు 26: పట్టణ పరిధిలోని ఓ ఆటోమొబైల్స్‌లో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటలో రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం జరిగినట్లు దుకాణ నిర్వాహకులు పేర్కొన్నారు. వివరాలివీ... భారీ వర్షాలకు గురువారం ఉదయం నుంచి మదనపల్లెలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో మదనపల్లె ఆర్టీసీబస్టాండ్‌ సమీపంలోని బాలాజీ ఆటోమొబైల్స్‌ దుకాణ నిర్వాహకులు జనరేటర్‌ ఆన్‌ చేశారు. కాగా, సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో జనరేటర్‌ నుంచి ఆయిల్‌ లీకవడం ఒక్కరూ గుర్తించలేదు. దీంతో ఒక్కసారిగా మంటలు రేగి ఎగసిపడ్డాయి. అక్కడున్న సిబ్బంది అప్రమత్తమయ్యేలోగా దుకాణ రెండో అంతస్తును తాకాయి. ఇటీవల టన్నుల కొద్దీ నిల్వచేసిన ఇంజన్‌ఆయిల్‌, టైర్లు ఇతర ఫైబర్‌ సామగ్రి అంటుకోవడంతో భవనం నుంచి మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రాత్రి పదిగంటలైనా మంటలను అదుపు చేయలేక పోయారు. అగ్నిప్రమాదంలో రూ.50లక్షలకుపైగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ పోలీసులు పేర్కొన్నారు. 

Read more