క్వారంటైన్ కేంద్రాల్లో 303 మంది
ABN , First Publish Date - 2020-04-01T10:30:53+05:30 IST
జిల్లాలో మంగళవారం సాయంత్రానికి 303 మందిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు.

మంగళవారం ఒక్కరోజే 140 మంది తరలింపు
86 మంది అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు
30 మంది రిజల్ట్ కోసం వెయిటింగ్
చిత్తూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం సాయంత్రానికి 303 మందిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. మంగళవారం ఒక్కరోజే 140 మందిని ఈ కేంద్రాలకు తరలించారు. వీరిలో 28మంది ఢిల్లీ నుంచి వచ్చినవారుండగా.. హైదరాబాద్, బెంగళూరు కార్యక్రమాల్లో పాల్గొన్నవారు 112 మంది ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 86 మంది అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మరో 30 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
1,472 మందికి హోమ్ అబ్జర్వేషన్ పూర్తి
విదేశాల నుంచి వచ్చిన 1,816 మందిలో 1,472 మంది హోమ్ అబ్జర్వేషన్‌ను పూర్తి చేసుకోగా.. మిగిలిన 344 మంది ఇంకా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 86 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 55 మందికి నెగెటివ్ వచ్చింది. శ్రీకాళహస్తికి చెందిన ఒకరికి పాజిటివ్ రాగా.. తిరుపతిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 30 మంది నివేదికలు రావాల్సి ఉందని జిల్లా అధికారులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. కానీ.. మంగళవారం ఒక్కరోజే ఢిల్లీ లింకులున్న వారందరికీ సుమారు 50 మందికి పరీక్షలు చేసినట్లు సమాచారం.
నిజాముద్దీన్ సదస్సుకు 46 మంది
అధికారుల లెక్కల ప్రకారం జిల్లా నుంచి 46 మంది ఢిల్లీ నిజాముద్దీన్ సదస్సుకు వెళ్లగా.. ఇప్పటివరకు 28 మందిని గుర్తించారు. వీరిని శ్రీకాళహస్తి, పీలేరు, పుంగనూరు, చిత్తూరు, కురబలకోట, పద్మావతి నిలయంలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలను తీసుకెళ్లారు. మిగిలిన 18 మందిలో 15 మంది జిల్లాకు రాకుండా ఢిల్లీ ప్రాంతంలోనే ఉండిపోయినట్లు ఇంటెలిజెన్సు బ్యూరో రిపోర్టులో తేలినట్లు సమాచారం. ఇద్దరి వివరాలు తేలలేదు. మరొకరు జిల్లావాసి కాదని అధికారులు చెబుతున్నారు.
మళ్లీ ఇంటింటి సర్వే: కలెక్టర్
నిజాముద్దీన్ సదస్సులో జిల్లా వాసులు 46 మంది పాల్గొన్నారని కలెక్టర్ భరత్‌గుప్తా చెప్పారు. వీరిలో 28 మందిని ఇప్పటికే గుర్తించి దగ్గర్లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించగా.. మిగిలిన 18 మంది వివరాల కోసం మళ్లీ ఇంటింటి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వీరంతా ఢిల్లీ నుంచి జిల్లాకు వచ్చాక మంగళవారం వరకు ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరిని కలిశారన్న వివరాలను సేకరించాలని చెప్పారు. అలాగే వారి కుటుంబీకుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. విదేశాలతోపాటు నిజాముద్దీన్ సదస్సు నుంచి వచ్చినవారు కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు హోమ్ అబ్జర్వేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు.