ఎకరాకు రూ.30వేలివ్వండి
ABN , First Publish Date - 2020-12-05T06:31:27+05:30 IST
నివర్‌తో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు.
తుఫాను పరిహారంపై జనసేన అధినేత డిమాండు
శ్రీకాళహస్తి, డిసెంబరు 4: నివర్ తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేలు వంతున పరిహారం చెల్లించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండు చేశారు. తుఫానుతో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి శుక్రవారం తిరుపతి నుంచి బయలుదేరిన ఆయన తొట్టంబేడు మండలంలోని పొయ్య గ్రామానికి చేరుకున్నారు.జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ... వాహనంపై నిలబడి... గొడుగు చేత పట్టుకుని... రైతులను, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. నివర్ తుఫానుతో నష్ట పోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.అయితే బాధిత రైతులు సమస్యలను తనతో చెప్పుకోవడానికి ముందుకు వస్తుంటే... వారిని కూడా వైసీపీ నేతలు బెదిరించారన్నారు.ఆ బెదిరింపులకు భయపడి... పొయ్య ప్రాంత రైతులు ఎవరూ ముందుకు రాలేదన్నారు. దీన్ని బట్టి వైసీపీ దౌర్జన్యం ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. బాధిత రైతులను పరామర్శించడానికి వచ్చిన జనసైనికులపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. జనసైనికులపై దౌర్జన్యం చేసినా... దాడులకు పాల్పడినా సహించేది లేదన్నారు. తాము కూడా రోడ్లపైకి రావాల్సి ఉంటుందని హెచ్చరించారు.రైతులు కూడా భయపడకుండా ముందుకు వచ్చి తమ సమస్యలను చెప్పాలని కోరారు.

