నేడే నీట్‌

ABN , First Publish Date - 2020-09-13T08:51:42+05:30 IST

నేషనల్‌ ఎలిజిబుల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)కు ఎన్టీఏ అధికారులు తిరుపతిలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నగరంలో మొత్తం 24కేంద్రాలు ఏర్పాటు చేయగా.. దాదాపు 10వేల

నేడే నీట్‌

 తిరుపతిలో 24 పరీక్ష కేంద్రాలు

 హాజరుకానున్న 10వేలమంది విద్యార్థులు


తిరుపతి(విద్య), సెప్టెంబరు 12: నేషనల్‌ ఎలిజిబుల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)కు ఎన్టీఏ అధికారులు తిరుపతిలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నగరంలో మొత్తం 24కేంద్రాలు ఏర్పాటు చేయగా.. దాదాపు 10వేలమంది విద్యార్థులు హాజరుకానున్నట్లు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం 2.00-5.00గంటల వరకు జరిగే ఈపరీక్షకు ఉదయం 11గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి అరగంట ముందుగా అంటే.. 1.30 గంటలకు ప్రవేశ ద్వారం మూసివేస్తారు.


ఆపై వచ్చినవారిని అనుమతించరు. ఆఫ్‌లైన్‌ విధానంలో జరిగే ఈపరీక్షకు కొవిడ్‌-19 మార్గదర్శకాలు పాటిస్తూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలతోపాటు విద్యార్థులకు డ్రెస్‌కోడ్‌ కూడా ఎన్టీఏ సూచించింది. ఫుల్‌హ్యాండ్‌ షర్టులు, జీన్స్‌, టీషర్టులు, బూట్లు వేసుకురాకూడదు, నార్మల్‌ దుస్తులే ధరించాలి. ఆభరణాలు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు, వాచ్‌, బ్యాగ్‌లను అనుమతించరు. కరోనా పాజిటివ్‌ ఉన్నవారికి కేంద్రాల్లో ఐసొలేషన్‌ గదిని కేటాయించి, ఇన్విజిలేటర్‌ విధులు నిర్వహించేవారికి పీపీఈ కిట్లు అందజేస్తారు.

 

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

తిరుపతి (రవాణా), సెప్టెంబరు 12: నీట్‌, ఐబీపీఎస్‌ పరీక్షలను పురస్కరించుకుని ఆదివారం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిప్యూటీ సీటీఎం మధుసూదన్‌ తెలిపారు. దాదాపు 12వేల మంది విద్యార్థులు రానుండటంతో వివిధ డిపోల నుంచి ఉదయం 6 నుంచి 11 గంటల వరకు 70 ప్రత్యేక బస్సులను తిరుపతికి నడపనున్నట్లు తెలియజేశారు. అలాగే తిరుపతిలోని పరీక్ష కేంద్రాలకు సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ నుంచి 30 బస్సులు నడపనున్నామని పేర్కొన్నారు.


ఇక.. ఐబీపీఎస్‌ అభ్యర్థుల తిరుగు ప్రయాణం కోసం అనంతపురం, విజయవాడ, కర్నూలు, కడప, నెల్లూరు, మదనపల్లె తదితర మార్గాల్లో వంద ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఏర్పాట్లపై అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌, పుష్పలత తదితరులతో సమీక్షించారు. 

Updated Date - 2020-09-13T08:51:42+05:30 IST