మళ్లీ తిరగదోడిన శ్రీకాళహస్తి

ABN , First Publish Date - 2020-05-13T10:36:55+05:30 IST

శ్రీకాళహస్తిలో మళ్లీ కరోనా కల్లోలం రేపుతోంది. జిల్లాలో మంగళవారం రాత్రి మరో 11 పాజిటివ్‌ కేసులు

మళ్లీ తిరగదోడిన శ్రీకాళహస్తి

జిల్లాలో కొత్తగా 11పాజిటివ్‌ కేసులు!

వీటిలో ఏడు ముక్కంటి క్షేత్రంలోనే 

ఒకే ఇంట్లో ఐదుగురు..

గుంటూరు కాంటాక్ట్సే కారణం  

నేడు అధికారికంగా 

ప్రకటించే అవకాశం 


తిరుపతి, మే 12 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తిలో మళ్లీ కరోనా కల్లోలం రేపుతోంది. జిల్లాలో మంగళవారం రాత్రి మరో 11 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు తెలిసింది. వీటిలో శ్రీకాళహస్తి పట్టణంలోనివే ఏడు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసుల వివరాలను బుధవారం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. శ్రీకాళహస్తి పట్టణంలో 7 (బహదూర్‌పేట 6, సంతమైదానం 1), తొట్టంబేడు మండలం ఈదులగుంట 1, వరదయ్యపాళెం 2, మదనపల్లె 1 చొప్పున 11 కేసులు ఉన్నట్లు సమాచారం. కాగా, గుంటూరులో సీఏ చదువుతూ, ఇటీవల ఇంటికి వచ్చిన శ్రీకాళహస్తి యువకుడు జ్వరంతో బాధపడ్డారు.


ఇతడికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు పదో తేది నిర్ధారణ అయింది. ఇతడి కాంటాక్ట్స్‌ను అధికారులు గుర్తించి క్వారంటైన్‌ చేసి, పరీక్షలకు పంపారు. వీరిలో ఆ యువకుడి కుటుంబంలోని ఐదుగురు, స్నేహితుడికి మంగళవారం పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. మిగిలిన వారిలో కోయంబేడు కాంటాక్ట్సు ఉన్నట్లు తెలుస్తోంది. మదనపల్లెలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుమార్తె వివాహం బుధవారం జరగనుండగా, ఆయన ఆహ్వాన పత్రికలు అందించినవారిని కూడా క్వారంటైన్‌కు పంపనున్నట్లు తెలిసింది. పాజిటివ్‌ వచ్చినవారిని వికృతమాల, కల్కి ఆశ్రమంలోని క్వారంటైన్‌ నుంచి స్విమ్స్‌ ఐసొలేషన్‌కు పంపనున్నారు. 

Read more