ఎట్టకేలకు బీటీపీకి లైన్ క్లియర్
ABN , First Publish Date - 2020-02-08T11:17:38+05:30 IST
భైౖరవాని తిప్ప ప్రాజెక్టు(బీటీపీ)కు ఎట్టకేలకు లైన్ క్లియరైంది. ఏడు నెలల క్రితం రాష్ట్రంలో ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం..

ఏడు నెలల తరువాత మళ్లీ ప్రారంభం కానున్న పనులు
రివర్స్ టెండర్‌నుంచి విముక్తి
అనంతపురం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భైౖరవాని తిప్ప ప్రాజెక్టు(బీటీపీ)కు ఎట్టకేలకు లైన్ క్లియరైంది. ఏడు నెలల క్రితం రాష్ట్రంలో ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బీటీపీ కాలువ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో రాష్ట్రంలో పురోగమనంలో ఉన్న అభివృద్ధి పనులపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి టెంటర్లు పూర్తయినా ప్రారంభం కాని పనులతోపాటు 25 శాతంకంటే తక్కువగా చేసిన పనులన్నింటినీ వెంటనే రద్దు చేయాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో జిల్లాలో పురోగమనంలో ఉన్న బీటీపీ, పేరూరు డ్యాంలకు సంబంధించిన పనులు రద్దయ్యాయి.
వాటి పనులు 25శాతంలోపే జరిగి ఉండడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాటిని రద్దు చేశారు. రివర్స్ టెండరింగ్ విధానంతో ఆ ప్రాజెక్టుల పనులకు మళ్లీ టెండర్లు ఆహ్వానించాలని ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో అభివృద్ధికి కీలకంగా ఉన్న ఆ రెండు ప్రాజెక్టుల పనులు తిరిగి ప్రారంభించాలంటూ సీఎం జగన్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా సుమారు నెల క్రితం సీఎం జగన్‌తో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి మాట్లాడి తిరిగి అనుమతులు తీసుకురావడంతో పేరూరు పనులకు అడ్డంకులు తొలగాయి. ఇదే పరిస్థితుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కూడా బీటీపీ కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. రెండు నియోజకవర్గాల్లోని ఏడు మండలాలు ఎడారిగా మారే అవకాశాలున్నట్టు నిపుణులు పేర్కొన్న అంశాలతోపాటు ఆ ప్రాంత దుస్థితిని, వలసలతో బెంగళూరులాంటి నగరాల్లో కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రజలు అనుభవిస్తున్న దీనాతి దీనమైన బతుకులను రెండుసార్ల్లు అసెంబ్లీలో మాట్లాడారు. ప్రత్యేకంగా కలిసి సీఎం జగన్‌కు వివరించారు. దీంతో ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం బీటీపీ పనులు పాత కాంట్రాక్టు సంస్థ ద్వారానే తిరిగి ప్రారంభించాలని సీఎం జగన్ సూచించడంతో లైన్ క్లియరైంది. ఈనెల 5న అధికారవర్గాలు తగిన ఆదేశాలిచ్చారు.
ఏడు నెలల క్రితం ఆగిన పనులు..
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీ వరకూ 93 కిలోమీటర్ల మేర కాలువ తవ్వడానికి రూ. 968.89 కోట్లు మంజూరు చేస్తూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో కాలువ తవ్వకాలకు గానూ రూ. 358.20 కోట్లతో జిల్లాకు చెందిన ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా కంపెనీ పనులు దక్కించుకుంది. 18 నెలల్లో పూర్తి చేసేలా అగ్రిమెంటు కుదుర్చుకుని పనులు ప్రారంభించిది. అయితే పనులు రద్దు చేస్తూ 2019 మే 29న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అవి ఆగిపోయాయి. అప్పటికే ఆ కంపెనీ రూ. 33.027 కోట్లతో 27 కి.మీ పనులు పూర్తి చేసింది. ఆ కంపెనీ పరిధిలో ఇంకా రూ. 325.17 కోట్ల విలువైన సుమారు 62 కి.మీ మేర కాలువ పనులు మిగిలిపోయాయి. అగ్రిమెంటు ప్రకారం బీటీపీకి సంబంధించి జీడిపల్లి నుంచి గరుడాపురం వరకూ 29 కి.మీ వరకూ కామన్ ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉంది. మిగిలిన భాగంలో గరుడాపురంనుంచి కుందుర్పి వరకూ 30 కి.మీ, గరుడాపురంనుంచి బీటీ రిజర్వాయర్ వరకూ 32.625 కి.మీ కాలువ తవ్వాల్సి ఉంది.
ఈ పరిధిలో గరుడాపురం నుంచి కుందుర్పి వరకూ తవ్వే కాలువ ద్వారా 114 చెరువులకు నీరందేలా ప్రణాళిక రూపొందించారు. దీనికోసం 1407 ఎకరాలు సేకరించడానికి రెవెన్యూ అధికారులు ప్రక్రియ పూర్తి చేశారు. కానీ, కేవలం 20 ఎకరాల లోపు మాత్రమే రైతులకు పరిహారం చెల్లించారు. ఈ పరిస్థితుల్లో తమ ప్రాంతానికి నీరు వస్తే చాలునని, ఆ తరువాత ఎప్పుడైనా పరిహారం ఇస్తారనే నమ్మకంతో సుమారు 600 ఎకరాలకు చెందిన రైతులు స్వచ్ఛందంగా భూములప్పగించడంతో పనులు ముందుకు సాగాయి. ప్రభుత్వ ఉత్తర్వులతో పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలుండడంతో కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వాస్తవానికి 2018 జూన్ 30న అగ్రిమెంటు కుదుర్చుకుని ప్రారంభించిన పనులు కుంటుపడకుండా సాగి ఉంటే 2019 డిసెంబర్ 30 నాటికి పూర్తి అయి ఉండేవి. మిగిలిన కాలువ పనులతోపాటు 215 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉంది. దీనికి ఇంజనీరింగ్ అధికారులు డిజైన్లను అనుమతించాల్సి ఉంది.
ఎడారి బారినుంచి ఆరు మండలాలకు విముక్తి..
బీటీపీకి కృష్ణా జలాలందించాలంటే దానివల్ల జరిగే ప్రయోజనం కన్నా ఎక్కువగా ఖర్చవుతుందని ఒక దశలో ప్రతిపాదనలు నిరాకరించారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి అప్పటి సీఎం చంద్రబాబుతో పదేపదే చర్చించి చివరికి జీవోలు సాధించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ విధానం కోసం బీటీపీ పనులు రద్దు చేసేలా ఉత్తర్వులిచ్చారు. దీంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కంబదూరుతో సహా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మఘట్ట మండలం పూర్తిగా ఎడారిగా మారుతాయని ప్రస్తుత ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ సీఎం జగన్‌కు సవివరంగా నివేదిక సమర్పించారు. సముద్ర మట్టానికి 550 మీటర్లనుంచి 630 మీటర్ల ఎత్తున ఉండే ఆ ప్రాంతానికి బీటీపీ తప్ప మరో మార్గం లేదని నివేదికలో పేర్కొన్నారు.
కళ్యాణదుర్గంలోని 114 చెరువులతోపాటు బీటీపీ కింద గల 12వేల ఎకరాలకు నీరివ్వడం దీని ప్రధాన లక్ష్యం. ఇందుకు గానూ 490 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రవహించేలా కాలువ నిర్మించాల్సి ఉంది. 14 పంపులు ఏర్పాటు చేసి 175 మీటర్ల ఎత్తుకు నీటిని తోడాల్సి ఉంది. ఈ పనులన్నీ పూర్తయితే రెండు నియోజకవర్గాల్లోని 1.2 లక్షల మందికి తాగునీటి సౌకర్యంతోపాటు సుమారు మరో 10,323 ఎకరాల ఆయకట్టుకు నీరిందించవచ్చునని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అనుమతులు జారీ చేశారు.
బీటీపీ అంటే రాజకీయ ప్రయోజనం కాదు.. ప్రజలు : ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్
బీటీపీ అంటే రాజకీయ ప్రయోజనం కాదని, ఆ ప్రాజెక్టును ప్రజలుగా తాను భావిస్తున్నానని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ఆంధ్రజ్యోతితో చెప్పారు. సీఎం జగన్ తనకు ఇచ్చిన మాట ప్రకారం బీటీపీ పనులు త్వరగా ప్రారంభించడానికి అనుమతులిచ్చారన్నారు. జగన్ ప్రభుత్వానికి రాజకీయాలు ముఖ్యం కాదన్నారు. టీడీపీ హయాంలో ప్రారంభించిన పనులు ఆగిపోయాయని, అది ప్రజలకు తీవ్ర నష్టంతోపాటు ఎడారి ప్రాంతాన్ని కాపాడే యత్నం కావడంతో తానూ తన శక్తిమేరకు కృషి చేసి అనుమతులు తీసుకొచ్చానని వివరించారు. తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఐదేళ్లపాటు ఎప్పుడూ ఇంటివద్ద కాకుండా నియోజకవర్గంలోని గ్రామాలన్నీ మూడుసార్లు కలియతిరిగానన్నారు. బెంగళూరు లాంటి నగరాలకు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు వలసలు వెళ్లి అనుభవిస్తున్న దుర్భర జీవితాలు కళ్లారా చూశానన్నారు. రైతులు కూడా వలసకూలీలుగా మారిన తరుణంలో తిరిగి వారిని పొలాల వైపు మళ్లించి రెండు పంటలు పండించుకుని మంచి జీవితం అనుభవించడానికి బీటీపీ తప్ప మరో మార్గం లేదని గ్రహించి గట్టిగా పోరాడానన్నారు.