టీడీపీ ఇచ్చిన పట్టాలను వైసీపీ పంచుతోంది : జేసీ

ABN , First Publish Date - 2020-12-27T06:39:43+05:30 IST

టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలను ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పంచుతోందని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.

టీడీపీ ఇచ్చిన పట్టాలను వైసీపీ పంచుతోంది : జేసీ

తాడిపత్రి, డిసెంబరు 26: టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలను ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పంచుతోందని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ యాడికిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంపిణీ చేసిన ఇంటి పట్టాల పంపిణీలో.. ఓమహిళను ఎవరు పట్టా ఇచ్చారని అడిగితే, టక్కున  చంద్రన్న సార్‌ అనడం ఇందుకు ఉదాహరణ అన్నారు. టీడీపీ హయాంలో తాను యాడికి మండలకేంద్రంలో 18.66 ఎకరాల భూమిని 725 మందికి ఇంటిపట్టాలు ఇచ్చానన్నారు. ఎమ్మెల్యే చెప్పినట్లు ఇప్పటికి పెద్దకొడుకు ముఖ్యమంత్రి జగన కాదని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న భావన ప్రజల్లో ఉందన్నారు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. గతంలో యాడికిలోని పిన్నేపల్లి రోడ్డులో చేనేతలకు ప్రత్యేకంగా అప్పటి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి కాలనీ ఏర్పాటు చేసి, కుటుంబానికి రెండున్నర సెంట్ల భూమిని ఇచ్చారన్నారు. నేడు వైసీపీ ప్రభుత్యం సెంటున్నర స్థలం ఇస్తోందన్నారు. ఈ స్థలంలో చేనేతలు మగ్గాలు వేసుకునేందుకు పనికి రాదన్నారు. రెండున్నర సెంట్ల స్థలం ఇవ్వాలని అధికారుల దృష్టికి చేనేతలు తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిపారు.


Updated Date - 2020-12-27T06:39:43+05:30 IST