వైసీపీ నాయకుడి దారుణం..

ABN , First Publish Date - 2020-03-16T10:28:28+05:30 IST

చెరువులో మట్టిని తోలుకోనివ్వలేదని..

వైసీపీ నాయకుడి దారుణం..

చెరువులో మట్టిని తోలుకోనివ్వలేదని గ్రామస్థులపై ఆగ్రహం 

గ్రామానికి వెళ్లే రోడ్డును తవ్వేసి రాకపోకలను స్తంభింపజేసిన వైనం..

పోలీసులకు ఫిర్యాదు చేసిన మల్కాపురం గ్రామస్థులు 


ధర్మవరం(అనంతపురం): చెరువులో మట్టిని తోలుకోనివ్వలేదని అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు గ్రామానికి వెళ్లే రహదారిని ధ్వంసం చేశాడు. గ్రామస్థులు తెలిపిన మేరకు మండలంలోని మల్కాపురం గ్రామ చెరువులో నుంచి ఎవరైనా మట్టితోలుకుంటే గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయానికి ఎంతో కొంత విరాళం ఇస్తుంటారు. ఆ విరాళాన్ని దేవాలయం అభివృద్ధికే ఖర్చు పెడతారు. ఇది పురాతన కాలం నుంచి గ్రామస్థులు పెట్టుకున్న నియమం. ఆదివారం గొట్లూరుకు చెందిన వైసీపీ నేత పిట్టా నరసింహులు కుమారుడు పిట్టా రాజు ట్రాక్టర్లతో పాటు జేసీబీలతో మట్టిని తోలుకుంటూ నియమం అతిక్రమించడంతో పార్టీలకతీతంగా గ్రామస్థులంతా ఏకమై చెరువులో మట్టిని తోలకూడదని అడ్డుకున్నారు. దీంతో ఆ నాయకుడు గ్రామస్థులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.


అంతటితో ఆగకుండా మా గ్రామానికి ఎలా వస్తారో చూస్తానంటూ హెచ్చరించాడు. అలాగే మల్కాపురం గ్రామస్థులు గొట్లూరు మీదుగా ధర్మవరం రాకుండా మల్కాపురం గొట్లూరు మధ్యలో రోడ్డును అడ్డంగా 3మీటర్ల పొడవు, 1మీటర్‌ లోతుగా గుంత తీయించి గ్రామానికి వెళ్లే దారిని పూర్తిగా ధ్వంసం చేశాడు. దీంతో ఆ గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. గ్రామస్థులు మూకుమ్మడిగా ధర్మవరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఆ వ్యక్తితో పాటు పలువురిపై ఫిర్యాదు చేశారు.  రూరల్‌ ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు ధ్వంసమైన రోడ్డును పరిశీలించారు. చెరువుల్లో మట్టి తోలుకోవాలంటే సంబంధిత అధికారులతో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మట్టిని తోలుకోవడానికి ఎవరూ అనుమతి ఇచ్చారని, ఇంతదౌర్జన్యంగా మట్టిని తీసుకెళ్లడానికి వచ్చాడంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు. 

Updated Date - 2020-03-16T10:28:28+05:30 IST