లంబోదరుడి పూజకు వేళాయె

ABN , First Publish Date - 2020-08-22T09:58:06+05:30 IST

ఆదిదేవుడు లంబోదరుడిని పూజించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. శనివారం వినాయక చవితి పర్వదినాన్ని ఇళ్లలోనే చేసుకోనున్నారు. అందుకు సంబంధిం

లంబోదరుడి పూజకు వేళాయె

 షాపింగ్‌తో సందడిగా మారిన మార్కెట్లు

  నేడు వినాయక చవితి

  వీధుల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేని వైనం

  ఇళ్లలోనే కొలువుదీరనున్న గణపయ్యలు

  ఒక్కరోజులోనే ముగియనున్న వేడుకలు


అనంతపురం టౌన్‌, ఆగస్టు 21: ఆదిదేవుడు లంబోదరుడిని పూజించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. శనివారం వినాయక చవితి పర్వదినాన్ని ఇళ్లలోనే చేసుకోనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ప్రజలు శుక్రవారం బిజీబిజీగా కనిపించారు. చవితికి ముందు వారం రోజులు ఆతర్వాత ఐదు రోజుల  నుంచే వాడవాడలా కనిపించే వినాయక మండపాల సందడి కరోనా కారణంగా ఈ ఏడాది కనుమరుగైంది. వైరస్‌ నివారణ దృష్ట్యా వీధుల్లో మండపాలు ఏర్పాటు చేయకుండా ఇళ్లలోనే చేసుకునేందుకు ప్రజలు ప్రణాళిక రూపొందించుకున్నారు.


ఈ ఏడాది ఉత్సవాలను మూడు, ఐదు రోజులు కాకుండా ఒక్కరోజులోనే ముగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఏటా వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలు సైతం ప్రణాళికలు మార్చుకున్నాయి. ఆలయాలు, కల్యాణమండపాల్లో చిన్నపాటి విగ్రహాలు ఏర్పాటు చేసి, ఒక్కరోజులోనే వేడుకను ముగించేందుకు సన్నద్దమయ్యాయి.


జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఏటా భారీ సెట్టింగ్‌లతో ప్రతిష్టాత్మకంగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేయటం ఆనవాయితీ. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. హంగు, ఆర్భాటాల్లేకుండా గీతామందిరం సమీపంలోని సాయికృష్ణ ఫంక్షన్‌హాల్‌లో చవితి నిర్వహించనున్నారు.


గణనాథుడి చతుర్థి వేడుకలు చేసుకునేందుకు ప్రజల షాపింగ్‌లతో మార్కెట్లు సందడిగా మారాయి. శుక్రవారం చెరువుకట్టపై గల కూరగాయల మార్కెట్‌ పరిసరాలతోపాటు క్లాక్‌టవర్‌, నడిమివంక తదితర ప్రాంతాలు జనాలతో సందడిగా కనిపించాయి. పూజా సామగ్రి, పండుగరోజున వంటల నిమిత్తం కూరగాయలు ఇతరత్రా కొనుగోళ్లతో ప్రజలు బిజీబిజీగా కనిపించారు.

Updated Date - 2020-08-22T09:58:06+05:30 IST