అంతర పంటల విత్తనాలేవీ ?
ABN , First Publish Date - 2020-06-11T09:43:43+05:30 IST
జిల్లాలో అంతర పంటల విత్తనాల పంపిణీపై తీవ్ర జాప్యం జరుగుతోంది. ఖరీఫ్ సీజన్ ఆరంభమై పది రోజులు ..

సీజన్ ఆరంభమైనా పంపిణీలో తీవ్ర జాప్యం
తక్కువ మోతాదైనా అందుబాటులో ఉంచని దుస్థితి
కందుల కోసం పేర్ల నమోదుతో సరిపెట్టిన వైనం
ఒకేసారి ఇవ్వకుండా సతాయింపు
ఎన్ని సార్లు తిరగాలంటూ రైతుల నిట్టూర్పు
అనంతపురం వ్యవసాయం, జూన్ 10 : జిల్లాలో అంతర పంటల విత్తనాల పంపిణీపై తీవ్ర జాప్యం జరుగుతోంది. ఖరీఫ్ సీజన్ ఆరంభమై పది రోజులు గడుస్తున్నా అంతర పంటల విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో విత్తన వేరుశనగతోపాటు అంతర పంటల విత్తనాలు పంపిణీ చేసేవారు. ఈ సారి ఆ విధానానికి స్వస్తి పలికారు. గురువారంతో విత్తన వేరుశనగ పంపిణీ కూడా ముగియనుంది. ఈ ఏడాది జిల్లాకు అంతర పంటల విత్తనాల కేటాయింపును తగ్గించారు. ఈనెలారంభంలో ఎట్టకేలకు కంది 6 వేల క్వింటాళ్లు, రాగి 185, కొర్ర 225, ఊదలు, సామలు, అరికలు, అండుకొర్రలు 188 క్వింటాళ్లు కేటాయించారు. ఆయా విత్తనాలు కేటాయించిన మేరకు రైతు భరోసా కేంద్రాలకు పంపడంలో విత్తన సరఫరా ఏజెన్సీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటి దాకా ఒక్క క్వింటా కూడా విత్తనాలు క్షేత్ర స్థాయికి పంపలేదు.
గత కొన్ని రోజులుగా కందుల కోసం రైతులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటి దాకా 5539 మంది రైతులు పేర్లు నమోదు చేసుకు న్నారు. అలాగే 2174 మంది డబ్బులు చెల్లించారు. వీరిలో ఇప్పటి దాకా 875 మందికి 95 క్వింటాళ్ల కంది విత్తనాలు పంపిణీ చేశారు. మిగిలిన అంతర పంటల విత్తనాలకు రైతుల పేర్ల నమోదు జరగ లేదు. ఖరీఫ్ సీజన్‌లో పలు మండలాల్లో పదును వర్షం పడటంతో సేద్యాలు చేసుకున్నారు. మరో మారు వర్షం పడితే విత్తనం వేయనున్నారు. ఈ పరిస్థితుల్లో అంతర పంటల విత్తనాల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది.
ఒకేసారి ఇవ్వకుండా తాత్సారం
తక్కువ మోతాదులో అందించే అంతర పంటల విత్తనాలు ఒకేసారి ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కంది విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అయితే పేరు నమోదుకు ఒకసారి, డబ్బులు చెల్లించేందుకు మరోసారి, ఆ తర్వాత విత్తనాలు తీసుకునేందుకు ఇంకోసారి మూడు సార్లు రై తు భరోసా కేంద్రాలకు వెళ్లాల్సిన దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. గతంలో అన్నీ ఒకేసారి చేసి విత్తనాలు అందించేవారు. ఈ ఏడాది గ్రామ పంచాయతీ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల్లో విత్తన పంపిణీ చేస్తున్నారన్న మాటే తప్పా విత్తనాల కోసం అనేక సార్లు క్యూలైన్లల్లో నిల్చోవాల్సి వస్తోందంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అంతర పంటల విత్తనాల కోసం కూడా రైతులను అధికారులు సతాయిస్తున్నారు. విత్తన వేరుశనగ పంపిణీ తరహాలోనే ముందుగా పేరు నమోదుతోపాటు డబ్బులు కట్టిన తర్వాతనే విత్తనాలు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. తక్కువ మోతాదులో అందించే అంతర పంటల విత్తనాల పంపిణీలోనూ కొత్త నిబంధనలు అమలు చేయడం ఏమిటని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.