గ్రామ వలంటీర్ల వికృత చేష్టలు..!

ABN , First Publish Date - 2020-06-23T09:51:27+05:30 IST

‘ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా..

గ్రామ వలంటీర్ల వికృత చేష్టలు..!

జిల్లాలో పెట్రేగిపోతున్న కొందరు గ్రామ వలంటీర్లు

దాడులు, దౌర్జన్యాలతో వ్యవస్థకే చేటు

సీఎం జగన్‌ నమ్మకానికి బీటలు

అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం

అధికార పార్టీ నేతల అండదండలతో ఇష్టారాజ్యం

నిందితులుగా మారుతున్న దుస్థితి


అనంతపురం(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేందుకే వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. పార్టీలకతీతంగా ఈ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరాలి. మనకు ఓటు వేయని వారికి కూడా అందజేయాలి. వచ్చే ఎన్నికల్లో మనకు ఓటేయాలనే విధంగా వారి మనసును కరిగించాలి. వలంటీర్ల ద్వారా ఈ వ్యవస్థ బాగుపడుతుందని నమ్ముతున్నా. పూర్వం డాక్టర్లను చూస్తే చేతులెత్తి, నమస్కారం పెట్టేవారు. ఈ వ్యవస్థ ద్వారా గ్రామ వలంటీర్‌ వచ్చాడని చేతులెత్తి నమస్కారం పెట్టే రోజులు రావాలి. ఆ విధంగా సేవ చేయాలి. ఈ కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే లీడర్లుగా చేస్తానని చెబుతున్నా. ఆ నమ్మకం నాకుంది.’’ వలంటీర్‌ వ్యవస్థను ప్రారంభించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్న మాటలివి.


జిల్లాలో ముఖ్యమంత్రి మాటలకు భిన్నంగా ఈ వ్యవస్థలోని కొందరు వలంటీర్లు వ్యవహరిస్తున్నారు. వామ్మో వలంటీర్లా.. అని భయాందోళన చెందే పరిస్థితులున్నాయి. క్షేత్రస్థాయిలో ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కొందరి వల్ల వలంటీర్ల వ్యవస్థకే మరక అంటుతోందనటంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి నమ్మకానికి బీటలు వారుతున్నాయి. లీడర్లుగా చేస్తానన్న సీఎం మాటలకు భిన్నంగా.. కొందరు నిందితులుగా మారుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు వలంటీర్లు పేట్రేగిపోతున్నారు. దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోతున్నారు. వికృతచేష్టలతో ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. అత్యాచారాలకూ యత్నిస్తున్నారు.


ప్రశ్నించిన వారెవరైనా.. మహిళలు, రైతులు తేడా లేకుండా దాడులకు తెగబడుతున్నారు. వ్యక్తిగత సమస్యల విషయంలోనూ అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. వలంటీర్లమనే బిరుసుతో కరోనా నిబంధనలను సైతం తుంగలో తొక్కి, వైభోగాలు అనుభవిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మద్యం అక్రమ విక్రయాల్లోనూ భాగస్వాములవుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎదురిస్తే.. దాడులతోనే సమాధానాలు చెబుతామన్న రీతిలో కొందరు వలంటీర్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి నమ్మకాన్ని కొందరి వ్యవహారం నీరుగారుస్తోంది.


దురాగతాల్లో కొన్ని..

శింగనమల మండలంలోని చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన వలంటీర్‌ సంతోష్‌ అదే ఊరికి చెందిన ఓ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఆ మేరకు పోలీసులకు బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వలంటీర్‌ వంకతో ఆ బాలిక ఇంటికి వెళ్లి, తల్లిదండ్రులు ఉన్నారా.. లేరా.. అని వాకబు చేశాడు. లేరని బాలిక ద్వారా తెలుసుకున్న వలంటీర్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయటంతో చుట్టుపక్కల ఉంటున్న ఇళ్లలోని వారు అక్కడికి చేరుకున్నారు. దీనిని గమనించిన వలంటీర్‌ అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటనపై శింగనమల పోలీసులు వలంటీర్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.


కుందుర్పి మండలం ఎస్‌.మల్లాపురం గ్రామంలో పెన్షన్‌ డబ్బులో కోత విధిస్తున్నారని స్థానికులు ప్రశ్నించినందుకు ఆ గ్రామ వలంటీర్లు జగన్‌, గురుమూర్తి దాడిచేశారు. 


వజ్రకరూరు మండలంలోని కడమలకుంట గ్రామంలో స్థానిక వైసీపీ నాయకులతో కలిసి వలంటీర్లు మద్యం మత్తులో మహిళలపై దాడులు చేశారు. ఆ గ్రామానికి చెందిన నాగలక్ష్మి, సుమలత, సుకన్య, లక్ష్మి ఆటోలో వస్తుండగా.. దారికాచి మరీ దాడికి పాల్పడ్డారు. గ్రామ వలంటీర్‌ మహేంద్ర, స్థానిక వైసీపీ నాయకులు సునీల్‌, బాలకృష్ణ, సురేష్‌, విశాల్‌ ఈ దాడుల్లో పాల్గొన్నారు. వీరిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కొళాయి వద్ద తలెత్తిన చిన్నపాటి ఘర్షణను సాకుగా తీసుకుని, మహిళలని కూడా చూడకుండా దాడులకు తెగబడ్డారు.


వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామంలో సంక్షేమ పథకాల గురించి అడిగినందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రామాంజనేయులుపై వలంటీర్‌ ప్రదీప్ కుమార్‌, మరో మహిళా వలంటీర్‌ భర్త ప్రకాష్‌ దాడి చేశారు. జగనన్న చేయూత, ఇంటిపట్టాల విషయంగా రామాంజనేయులు కుమారుడు అనిల్‌కుమార్‌ భాస్కర్‌ అనే వ్యక్తితో కలిసి మహిళా వలంటీర్‌ శ్రీలేఖను అడిగాడు. ఆమె దురుసుగా సమాధానమివ్వటంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడమే వారు చేసిన పాపం. తమపైనే ఫిర్యాదు చేస్తారా అని ఆ మహిళా వలంటీర్‌ భర్త మరో వలంటీర్‌తో  కలిసి దాడి చేశారు. వారిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.


గ్రామ వలంటీర్ల అలసత్వంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడన్న కోపంతో బెలుగుప్ప పరిధిలోని శీర్పి పంచాయతీకి చెందిన ఇబ్రహీంపై ఆ వలంటీర్‌ను వెనకేసుకొస్తున్న స్థానిక వైసీపీ నాయకులు వకాల్తా పుచ్చుకుని, దాడులు చేశారు. వలంటీర్లు స్థానికంగా లేరని ఫిర్యాదు చేయటమే ఇబ్రహీం చేసిన నేరంగా దాడులకు దిగారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


అధికార పార్టీ నేతల అండదండలతో వలంటీర్లుగా ఉద్యోగం పొందిన కొందరు కరోనా నిబంధనలను తుంగలో తొక్కి, విందులు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా అవగాహన కల్పించాల్సిన వలంటీర్లు మహమ్మద్‌, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, నరేష్ కుమార్‌రెడ్డి స్థానిక యువకులతో కలిసి దావత్‌ చేసుకున్నారు. వలంటీర్లమనే బిరుసును అక్కడ ప్రదర్శించారు. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది.


హిందూపురం మండలం వీవర్స్‌ కాలనీకి చెందిన శివానందప్ప రేషన్‌కార్డు అడిగేందుకని వలంటీర్‌ రమేష్‌ ఇంటికెళ్లాడు. రేషన్‌కార్డు ఇప్పించాలని కోరాడు. ఈ నేపథ్యంలో అతడిపై వలంటీర్‌ దాడి చేశాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా కౌన్సెలింగ్‌తో రాజీ చేశారు.


పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండలం గసికవారిపల్లి గ్రామ వలంటీర్‌ భాస్కర్‌, అదే గ్రామానికి చెందిన రాజేశ్‌లు కర్ణాటక మద్యం తరలిస్తుండగా.. స్థానిక పోలీసులు పట్టుకున్నారు. వలంటీర్‌ నుంచి 147 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.


రొద్దం మండలం చెరకూరు గ్రామానికి చెందిన వలంటీర్లు, స్నేహితులు కలిసి కర్ణాటక రాష్ట్రంలోని పావగడ తాలూకాలోని వెంకటాపురం గ్రామంలో ఉన్న మాజీ ఎంపీ ఉగ్రప్ప తోటలో మద్యం సేవిస్తుండగా అడ్డుచెప్పినందుకు యజమానిపై దురుసుగా ప్రవర్తించి దాడి చేశారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆతర్వాత మాజీ ఎంపీ కేసులు వద్దని చెప్పడంతో వారిని వదిలిపెట్టారు.

Read more