తుఫానుతో నష్టపోయిన రైతుకు.. మరో ఎదురు దెబ్బ!

ABN , First Publish Date - 2020-12-11T05:49:02+05:30 IST

వరిరైతుకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి దారుణంగా పడిపోయింది.

తుఫానుతో నష్టపోయిన రైతుకు.. మరో ఎదురు దెబ్బ!
విక్రయానికి సిద్ధంగా వున్న వరి ధాన్యం

కొనేవారు కరువు

హెచ్చెల్సీ ఆయకట్టులో వరి కోతలు ప్రారంభం

పడిపోయిన ధాన్యం ధర

అమ్ముకోలేని దుస్థితి..

ముందుకురాని  మిల్లర్లు, వ్యాపారులు

కల్లాల్లోనే ధాన్యం కుప్పలు

కొనుగోలు కేంద్రాల వైపు అన్నదాత చూపు


రాయదుర్గం, డిసెంబరు 10:  వరిరైతుకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి దారుణంగా పడిపోయింది. చివర్లో నివర్‌ తుఫాను పంటను మరింత దెబ్బతీసింది. అంతో.. ఇంతో.. పండిన ధాన్యాన్ని అమ్ముకుందామన్నా.. కొనేవారు కరువయ్యారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఉండిపోయారు. దళారులు, వ్యాపారులు, అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తామంటున్నారు. ఆ ధరకు అమ్మితే పెట్టుబడి కూడా దక్కదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి, ఆదుకోవాలని వేడుకుంటున్నా రు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవటంతో నిరాశతో నిట్టూరుస్తున్నారు. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టులో సాగు చేసిన వరి కోతలు ప్రారంభమయ్యాయి. కణేకల్లు, బొమ్మనహాళ్‌ మండలాల్లో సుమారు 40 వేల ఎకరాల్లో వరి పరిపూర్ణంగా కోత దశకు చేరింది. ఈ నేపథ్యంలో కణేకల్లు చెరువు కింద కోతలు పది రోజులుగా చేపడుతున్నారు. కోతలు ప్రారంభించి, దిగుబడులపై రైతులు అంచనాలు వేస్తున్నారు.


పండించిన ధాన్యానికి ధర ఎంతమేరకు అనే విషయంపై స్పష్టత లేదు. బహిరంగ మార్కెట్‌లో ధర పాతాళానికి పడిపోయింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఖరీ్‌ఫలో సాగు చేసిన వరి దిగుబడిపై ఈ ఏడాది తెగుళ్లు తీవ్ర ప్రభావం చూపాయి. దీనికి తోడు నివర్‌ తుఫాను కూడా వెంటాడింది. వీటన్నింటికీ ఎదురొడ్డి అన్నదాత చివరకు ధాన్యాన్ని ఒడ్డుకు తీసుకువచ్చే సమయానికి మార్కెట్లో ధర లేదు. సకాలంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కొంత ఊరట కలుగుతుందని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు పొలాల్లోనే ధాన్యాన్ని నిల్వ చేసుకుని, విక్రయించేందుకు పోరాడుతున్నారు.


దిగుబడిపై తెగుళ్లు, తుఫాన్ల ప్రభావం

ఆయకట్టులో సాగు చేసిన వరి దిగుబడిపై తెగుళ్లతోపాటు నివర్‌ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా ఖరీ్‌ఫలో ఎకరాకు వరిధాన్యం దిగుబడి 40 నుంచి 50 బస్తాల దాకా వస్తుందని అంచనా. ప్రస్తుతం కోతలు చేసిన పొలాల్లో 35 బస్తాలే వచ్చింది. పంటను దోమపోటుతోపాటు అగ్గితెగులు తీవ్రస్థాయిలో ఆశించటంతో దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావటంతో తెగుళ్లు విజృంభించాయంటున్నారు. పంట కోత దశలో ఉన్నపుడు నివర్‌ తుఫాను రావటంతో పూర్తిగా దెబ్బతిని, దిగుబడి తగ్గిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. ఎకరాలో రూ.25 వేల దాకా పెట్టుబడి పెట్టి, పంట సాగు చేశారు. కౌలు రైతులకు రూ.20 వేల దాకా కౌలుతోపాటు పెట్టుబడి కూడా రూ.25 వేలు వెచ్చించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కనీసం 50 బస్తాల దిగుబడి వస్తే తప్పా.. మిగులుబాటు కాని పరిస్థితి. కణేకల్లు చెరువు కింద ఇప్పుడిప్పుడే ప్రారంభమైన వరి కోతల్లో 40 బస్తాల వరకు దిగుబడులు వస్తున్నట్లు రైతులు స్పష్టం చేస్తున్నారు. 15 రోజుల్లో కోతలు తీవ్రస్థాయిలో ఉంటాయనీ, భారీగా ధాన్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంటున్నారు.


గిట్టుబాటు ధర లేక విలవిల 

ఆయకట్టులో పండిన వరి ధాన్యానికి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు విలవిల్లాడుతున్నారు. కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని పొలాల్లో ఆరబెట్టి, విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావట్లేదు. ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏ గ్రేడ్‌ వరికి క్వింటాలుపై  రూ.1888, బి గ్రేడ్‌కు రూ.1838 ప్రకారం మద్ధతు ధర నిర్ణయించింది. ప్రస్తుతం వ్యాపారులు ధరలు నిర్ణయించలేదు. గతేడాది మాత్రం ప్రభుత్వం వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ఆలస్యంగా ప్రారంభించటంతో ఖాళీ సంచుల సాకును చూపి, కొనుగోలు చేయకుండా చేతులెత్తేసింది. రబీలో మాత్రం కొనుగోలు చేసింది. ప్రస్తుతం వరి కోతలు ఒక్కసారిగా అన్ని చోట్లా ప్రారంభమవుతున్న నేపథ్యంలో నెల అప్పుతో రూ.1650కి కొనడానికి కొందరు వ్యాపారులు ముందుకొస్తున్నట్లు కనిపిస్తున్నా.. గిట్టుబాటు కాదని రైతులు వెనుకంజ వేస్తున్నారు. మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


రూ.200 కోట్లకుపైగా టర్నోవర్‌

40 వేల ఎకరాల్లో సాగు చేసిన వరి పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో డిసెంబరు, జనవరి నెలల్లో రూ.200 కోట్లకుపైగా టర్నోవర్‌ అయ్యే అవకాశం ఉంది. 16 లక్షల బస్తాల దాకా దిగుబడి వస్తుందని అంచనా. కనీస మద్దతు ధర రూ.1838 ప్రకారం లెక్కించినా.. రూ.200 కోట్ల దాకా టర్నోవర్‌ అవుతుంది. అందుబాటులో ఉండే రైస్‌మిల్లర్లు, బయటి వ్యాపారులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈసారి సరిహద్దులోని కర్ణాటక, కర్నూలులో కూడా ఒకేసారి పంట చేతికి రావటంతో ప్రాంతీయ మార్కెటింగ్‌ అగమ్యగోచరంగా మారింది.




దళారులే దిక్కు

ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు దళారులు ఉపక్రమించారు. తక్కువ ధరలో వ్యవధి కోరుతూ కొనుగోలు చేస్తామంటున్నారు. మార్కెట్‌ మద్దతు ధర రూ.1,838 ఉంటే రూ.1,650కి కొంటామంటున్నారు. ఆ ధరకు అమ్మితే రైతులకు గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. దీంతో రైతులు వ్యవధి పెంచుకుని, దళారులకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు దళారులు ఐపీలు పెట్టి, రైతుల నోట్లో మట్టి కొట్టిన ఘటనలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ గత్యంతరం లేక దళారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.



Updated Date - 2020-12-11T05:49:02+05:30 IST