బకాయిల లొల్లి..!

ABN , First Publish Date - 2020-11-21T06:16:37+05:30 IST

కరెంటు బిల్లు బకాయిలు విద్యుత్‌, పంచాయతీ శాఖల మధ్య వివాదానికి తెరతీస్తున్నాయి. బకాయిలు చెల్లించని పంచాయతీలకు విద్యుత్‌ అధికారులు కరెంటు సరఫరా ఆపేస్తున్నారు.

బకాయిల లొల్లి..!

విద్యుత్‌, పంచాయతీ శాఖల మధ్య వివాదం

పంచాయతీల్లో పేరుకుపోయిన 

విద్యుత్‌ బకాయిలు

బిల్లు చెల్లించకపోతే సరఫరా 

ఆపేస్తామంటున్న ట్రాన్స్‌కో అధికారులు

అనంతపురంరూరల్‌, నవంబరు 20: కరెంటు బిల్లు బకాయిలు విద్యుత్‌, పంచాయతీ శాఖల మధ్య వివాదానికి తెరతీస్తున్నాయి. బకాయిలు చెల్లించని పంచాయతీలకు విద్యుత్‌ అధికారులు కరెంటు సరఫరా ఆపేస్తున్నారు. ఇదే క్రమంలో పంచాయతీ అధికారులు విద్యుత్‌ కార్యాలయాలకు సంబంధించిన నీటి కనెక్షన్లు, ఇతరత్రా వాటిని తొలగిస్తున్నారు. ఇలా ఇరు శాఖల మధ్య వార్‌ నడుస్తోంది. ఇటీవల కణేకల్లు మండలంలో తలెత్తిన ఘటనలే ఇందుకు నిదర్శనం. బకాయిలు చెల్లించలేదని ఇటీవల ఆకుతోటపల్లిలో విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించేశారు. పంచాయతీల్లో విద్యుత్‌ బకాయిలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయాయి. బకాయిలు సకాలంలో వసూలు కాకపోవటంతో విద్యుత్‌ శాఖ ఆర్థికంగా కుదేలవుతోంది. నిత్యం ఆ శాఖ సమావేశాల్లో బకాయిల ప్రస్తావన ఉంటోంది. ఈ క్రమంలోనే సదరు అధికారులపై సంస్థ ఉన్నతాధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారు. అంతటితో ఆగకుండా ఓ స్థాయి అధికారులకు మెమోలు జారీ చేస్తున్నారు. దీంతో అధికారులు చేసేదేమీలేక బకాయిపడ్డ పంచాయతీ కార్యాలయాలకు కరెంట్‌ తీసేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని చాలా పంచాయతీలకు ట్రాన్స్‌కో అధికారులు.. విద్యుత్‌ కనెక్షన్లు తొలగించారు. కొంత మొత్తంలో బిల్లులు చెల్లించిన వాటికి తిరిగి సరఫరా చేస్తున్నారు.


రూ. 502.26 కోట్ల బకాయిలు

జిల్లావ్యాప్తంగా 1029 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 26 మేజర్‌, 1003 మైనర్‌ పంచాయతీలున్నాయి. వీటన్నింటి నుంచి విద్యుత్‌ శాఖకు రూ.502.26 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. మేజర్‌ పంచాయతీలు రూ.149.29 కోట్లు, మైనర్‌ పంచాయితీలు రూ.352.96 కోట్లు విద్యుత్‌ శాఖకు బకాయి పడ్డాయి. సాధారణంగా పంచాయతీలకు వచ్చే నిధుల నుంచి 10 శాతం కరెంటు బిల్లుకు చెల్లించాల్సి ఉంది. పంచాయతీ అధికారులు ఆ మేరకు చెల్లించట్లేదు. వచ్చిన నిధులను ఇతరాలకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏటా విద్యుత్‌ శాఖకు బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. అయినా సంబంధిత అధికారులు.. బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యుత్‌ శాఖాధికారులు బకాయిపడ్డ కార్యాలయాలకు విద్యుత్‌ కనెక్షన్ల తొలగింపు మొదలు పెట్టారు.


మేజర్‌ పంచాయతీల బకాయిల్లో కొన్ని..

జిల్లాలోని 26 మేజర్‌ పంచాయతీల నుంచి విద్యుత్‌ శాఖకు రూ.149.29 కోట్లు రావాల్సి ఉంది. బుక్కరాయసముద్రం రూ.6.17 కోట్లు, అనంతపురంరూరల్‌ రూ.11.20 కోట్లు, ప్రసన్నాయపల్లి రూ.76 లక్షలు, ఉరవకొండ రూ.13.35 కోట్లు, నార్పల రూ.6.03 కోట్లు, పెనుకొండ రూ.6.86 కోట్లు, తనకల్లు రూ.5.64 కోట్లు, గోరంట్ల రూ.5.79 కోట్లు, కొత్తచెరువు రూ.6.02 కోట్లు, అమరాపురం రూ.5.40 కోట్లు, కొడిగెనహళ్లి రూ.3.25 కోట్లు, గుడిబండ రూ.3.22 కోట్లు, బుక్కపట్నం రూ.2.60 కోట్లు, పరిగి రూ.3.40 కోట్లు, చిలమత్తూరు రూ.2.68 కోట్లు, ఎ.నారాయణపురం రూ8.45 కోట్లు, ముదిగుబ్బ రూ.4.07 కోట్లు, ఆత్మకూరు రూ.1.26 కోట్లు, ఆకుతోటపల్లి రూ.1.06 కోట్లు, సోమందేపల్లి రూ.5.59 కోట్ల బకాయిలున్నాయి.


మైనర్‌ పంచాయతీలకు సంబంధించి కొన్ని..

జిల్లావ్యాప్తంగా 1003 మైనర్‌ గ్రామ పంచాయతీలున్నాయి. వీటన్నింటి నుంచి విద్యుత్‌ శాఖకు రూ.352.96 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. కంబదూరు రూ.4.57కోట్లు, విడపనకల్లు రూ.4.38 కోట్లు, పెద్దపప్పూరు రూ.4.88 కోట్లు, లేపాక్షి రూ.3.30 కోట్లు, అగళి రూ.3.33 కోట్లు, బెళుగుప్ప రూ.3.26 కోట్లు, గార్లదిన్నె రూ.3.34 కోట్లు, రొళ్ల రూ.3.73 కోట్లు, నల్లచెరువు రూ.3.25 కోట్ల చొప్పున బకాయిపడ్డాయి.


చెల్లించకపోతే కోతలు తప్పవ్‌

పంచాయతీలకు ఇటీవల నిధులు మంజూరయ్యాయి. అయినా విద్యుత్‌ బకాయిలు చెల్లించట్లేదు. జిల్లావ్యాప్తంగా వందల కోట్లు పంచాయతీలకు సంబంధించిన బకాయిలున్నాయి. ఇప్పటికే వాటికి సంబంధించిన వివరాలను పంచాయతీల వారీగా ఇచ్చాం. ఆ మేరకు చెల్లించాలి. లేనిపక్షంలో కోతలు తప్పవ్‌.

- వరకుమార్‌, ఎస్‌ఈ, విద్యుత్‌ శాఖ

Read more