ఎక్కడ చూసినా.. కిటకిట
ABN , First Publish Date - 2020-03-27T09:46:04+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సామాజిక దూరం నిబంధన జిల్లాలో పెద్దగా అమలు కావడం లేదు.
ప్రమాదం పొంచి ఉన్నా.. కన్పించని స్వీయ నియంత్రణ
సామాజిక దూరం పాటించడంలో విఫలం
అనంతపురం ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్, మార్చి 26: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సామాజిక దూరం నిబంధన జిల్లాలో పెద్దగా అమలు కావడం లేదు. అనంతపురం, హిందూపురం, రాయదుర్గం, గుత్తి తదితర చోట్ల నిత్యావసరాల కొనుగోలు కోసం జనం గుంపులు గుంపులుగా గుమికూడారు. ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు తప్ప బయటికి రాకూడదని, అలా వాటి కోసం వచ్చినప్పుడు కూడా మనిషికి, మనిషికి మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేలా చూసుకోవాలని ఆదేశించాయి. అయితే దుకాణాలన్నింటినీ మూసివేయించిన అధికారులు కేవలం నిత్యావసర సరుకుల దుకాణాలకు మాత్రమే ఉద యం 6 నుంచి 9 గంటల వరకు తెరిచి ఉంచేలా అనుమతులిచ్చారు. ఆ తరు వాత గురువారం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు దుకాణాలు తెరిచి ఉంచేలా సమయం పెంచారు. అయితే దుకాణాలకు వచ్చే ప్రజలు మాత్రం సామాజిక దూరం పాటించడం లేదు. మందులు, నిత్యావసర సరుకుల దుకాణాల వద్ద ప్రజలు గురువారం గుంపులు గుంపులుగా కనిపించారు. ప్రజలు సామాజిక దూ రం పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశముంది. మెడికల్ షాపులకు జనసందడి సాగింది.
గురువారం ఉదయం నుంచే అనంతపురంలోని టవర్‌క్లాక్ సమీపంలో గల మెడికల్‌షాపులకు వివిధ ప్రాంతాలకు చెందిన వారు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పోలీసులు వారిని నియంత్రించడానికి చర్యలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలని కరోనా నేపథ్యంలో ఒకరికి ఒకరు దూరంగా ఉండే విధంగా క్యూ ఏర్పాటు చేసి జనాలను నిలబెట్టారు. పోలీసులు వెళ్లిన వెంటనే బారికేడ్లను పీకేశారు. గుంపులుగుంపులుగా షాపుల ముందుకెళ్లి మందుల కోసం పోటీపడుతూ కని పించారు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకూ మెడికల్ షాపుల వద్ద సందడి సాగింది. కరోనా కర్ఫ్యూ ఉన్నా మెడికల్ షాపులు 24 గంటల పాటు అందుబాటులో ఉంచుతున్నారు. కానీ ఎప్పుడు ఏమి జరుగుతుందోనని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు టెన్షన్ పడుతున్నారు. దీంతో కొద్దిరోజుల పాటు సంబంధిత మందులను అందుబాటులో ఉంచుకునేందుకు తాప త్రాయ పడుతున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున మందుల కోసం జనం తరలివచ్చారు. మెడికల్ షాపు యాజమాన్యాలు సైతం ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది.