సబ్సిడీ 60 శాతానికి పెంచాలి

ABN , First Publish Date - 2020-05-17T09:13:17+05:30 IST

జిల్లాలో వేరుశనగ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతుకూ ఐదెకరాలకు

సబ్సిడీ 60 శాతానికి పెంచాలి

రూ.967.47 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయి చెల్లించాలి

టీడీపీ, సీపీఐముఖ్య నేతల డిమాండ్‌

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత


అనంతపురం, మే 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేరుశనగ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతుకూ ఐదెకరాలకు సరిపడా విత్తనకాయలు పంపిణీ చేయాలని టీడీపీ, సీపీఐ ముఖ్య నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ తదితరులు కలెక్టర్‌ గంధం చంద్రుడును కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కరువు జిల్లాను దృష్టిలో పెట్టుకుని విత్తన సబ్సిడీని 60 శాతానికి పెంచాలన్నారు. ప్రస్తుతం 50 రోజులుగా విధించిన కరోనా లాక్‌డౌన్‌ కరువు రైతులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టిందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం లేక, సరైన ధరలు రాక అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌ సాగుకు ప్రతి రైతుకు ఐదెకరాలకు సరిపడా నాణ్యమైన సబ్సిడీ విత్తనాన్ని అందించాలని వారు కలెక్టర్‌ను కోరారు.


గత ఏడాది ప్రతి రైతుకూ నాలుగు బస్తాలు ఇచ్చారన్నారు. ఈ ఏడాది రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని సాయం పెంచాల్సిందిపోయి.. కుదించటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జిల్లాలో 2018 ఖరీ్‌ఫలో 6,95,403 మంది రైతులు పంటనష్టపోయారన్నారు. వారికి రావాల్సిన ఇన్‌ఫుట్‌ సబ్సిడీ బకాయి రూ.967.47 కోట్లు ఇంతవరకు అందించలేదన్నారు. వెంటనే నిధులు విడుదల చేస్తే సాగు పెట్టుబడికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రైతు రుణ పరపతిని పెంచాలని కోరారు. పాత అప్పులు, వడ్డీ కలిపి రెన్యువల్‌ చేసుకోవడంతో పాటు మరింత ఆర్థికసాయాన్ని రుణంగా అందించి ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-05-17T09:13:17+05:30 IST