లోక రక్షకి.. అమ్మ!

ABN , First Publish Date - 2020-05-10T10:56:10+05:30 IST

లాక్‌డౌన్‌లో మహిళా వైద్యులు, సిబ్బంది, అధికారులు, ఉద్యోగులు, పోలీసులు చేస్తున్న సేవలు అమోఘం. పగలంతా విధుల్లో బిజీగా ఉండి..

లోక రక్షకి.. అమ్మ!

అమ్మ.. పొలం పనికెళ్లినా..

కలెక్టర్‌ ఉద్యోగానికెళ్లినా..

ఇల్లు చేరగానే.. బిడ్డను హత్తుకోకుండా..

దగ్గరకు తీసుకోకుండా..

ఒక్క క్షణం ఆగలేదు..

పగలంతా తాను పడిన కష్టాన్ని..

ఆ క్షణం మరచిపోతుంది..

పిల్లల లాలనలో సేద తీరుతుంది..

అలాంటి అమ్మ..

ప్రపంచానికొచ్చిన కరోనా విపత్తుపై

ముందుండి పోరాడుతోంది..

కన్న బిడ్డలకు దూరంగా..

వారిని కనీసం చూడకుండా రోజులుగా..

ప్రాణాలను ఫణంగా పెట్టి..

అందరికీ కవచంగా నిలుస్తోంది..

అందరూ తన బిడ్డలే అనుకుని..

లోక రక్షణకు యుద్ధం చేస్తోంది..

అమ్మా! నీకు వందనం..



పెనుకొండ టౌన్‌/అనంతపురం వైద్యం, మే9: లాక్‌డౌన్‌లో మహిళా వైద్యులు, సిబ్బంది, అధికారులు, ఉద్యోగులు, పోలీసులు చేస్తున్న సేవలు అమోఘం. పగలంతా విధుల్లో బిజీగా ఉండి.. సాయంత్రం ఇళ్లకు చేరుతున్నారు. కరోనాతో పోరాడుతున్న తమను మహమ్మారి ఎక్కడ అంటుకుందోనన్న అనుమానంతో కుటుంబికులకు కూడా దూరంగా ఉంటున్నారు. కనీసం కన్న బిడ్డలను కూడా దగ్గరకు తీసుకోలేకపోతున్నారు. చిన్న పిల్లల తల్లులు సైతం పిల్లలకు దూరంగా ఉంటున్నారు. పగలు పడిన కష్టానికి ఎన్నో రెట్లు ఇబ్బంది పడుతున్నారు. కుటుంబానికి దూరంగా ఉండాలంటే. అయినా వెరవట్లేదు. వెనకడుగు వేయట్లేదు. కరోనాపై పోరాటానికి రెట్టించిన ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. ప్రాణాలను ఫణంగా పెడుతున్నామని తెలిసినా వెనక్కి తగ్గట్లేదు. కరోనాపై పోరాడుతున్నందుకు గర్వంగా ఉందని చెబుతున్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా జిల్లాలో లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న అలాంటి తల్లుల త్యాగాలను తెలుసుకుందాం..


పాపకు దూరమయ్యానన్న బాధ ఉన్నా..: నిషాంతి, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌

నా కూతురికి 11 నెలలు. కరోనాతో పాపకు దూరమయ్యానన్న బాధ ఉన్నా.. బాధ్యతలు అలాంటివి. హిందూపురంలో కరోనా పాజిటివ్‌ కేసు వెలుగు చూసిన రోజున ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అధికారిగా అక్కడ బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. కనిపించని వైర్‌సతో పోరాడుతున్నా కనుక ఆ రోజు నుంచే పాపకు దూరమయ్యా. నా తల్లే నా పాపను సంరక్షిస్తోంది. దూరం నుంచే పాపను చూడటంతో సరిపెట్టుకుంటున్నా. రెండున్నర నెలలుగా పాపను ఒక్కరోజు కూడా దగ్గరకు తీసుకోలేదు. పాప ఏడ్చినపుడల్లా బాధ తన్నుకొస్తోంది. అయినా దిగమింగుకుంటున్నా. సాధారణ రోజుల్లో ఎంత పని ఒత్తిడి ఉన్నా.. పాపను చూసేసరికి అదంతా దూరమయ్యేది. రోజూ రెడ్‌జోన్‌లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రాత్రికి ఇంటికెళ్లగానే.. కుటుంబానికి దూరంగా ప్రత్యేక గదిలో ఉంటున్నా. పాప నిద్ర లేవకముందే విధులకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి పాపను చూడలేకపోతున్నా. కరోనా నియంత్రణలోకి వచ్చే వరకూ పాపకు దూరంగానే ఉంటా. నాలాంటి పరిస్థితి ఎందరో తల్లులు ఎదుర్కొంటుండటం బాధేస్తోంది.


ఇంట్లో ఉన్నా ఐసోలేషన్‌లో ఉన్నట్లే:డాక్టర్‌ వాణిశ్రీ, సైంటిస్ట్‌

జిల్లా వద్యై కళాశాల మైక్రోబయాలజీ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నా. ఈ పరీక్షలే వైరస్‌ నిర్ధారణకు కీలకం. ఎంతో బాధ్యతగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు చేసినా సమస్య ఏర్పడుతుంది. ఏమాత్రం అజాగ్రత్త వహించినా వైరస్‌ బారిన పడాల్సి వస్తుంది. ల్యాబ్‌లోనే కాదు.. ఇంటికి వెళ్లినా.. ఐసోలేషన్‌ తరహాలోనే ఉంటున్నాం. నాకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. బాబు బాగోగులు మా ఆయనే చూసుకుంటున్నారు. నేను ఆ ఇద్దరికీ దూరంగా ఉంటున్నా. ఇది చాలా ఇబ్బందిగా, బాధగా ఉన్నా.. కరోనాపై పోరాటంలో భాగస్వాములవటం సంతోషం కలిగిస్తోంది. 


బాధ.. గర్వం: అలివేలమ్మ, స్టాఫ్‌నర్స్‌, జిల్లా సర్వజనాస్పత్రి, అనంతపురం

కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నందుకు తొలుత కుటుంబికులు, బంధువులు నన్ను చూసి భయపడేవారు. దీంతో కాస్త బాధేసేది. ప్రస్తుతం వారు ధైర్యంగా నా దగ్గరకు వస్తున్నారు. నేను పీపీఈ కిట్‌ వేసుకుని, వైద్యసేవలు అందించే ఫొటోను సెల్‌ఫోన్‌లో చూపితే ‘నీవు దేవతవు.. చేతులెత్తి మొక్కుతామం’టూ కొనియాడుతున్నారు. ఇది ఎంతో ఆనందం కలిగిస్తోంది. కరోనా విపత్తులో సేవలందించటం గర్వంగా ఉంది. నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నా. ఏమాత్రం అలసత్వం వహించట్లేదు.


మొదట్లో ఏడ్చారు: ప్రశాంతి, కమిషనర్‌, అనంతపురం నగరపాలక సంస్థ

విధి నిర్వహణలో భాగంగా పిల్లలకు దూరంగా ఉండక తప్పట్లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నా.. నేను, నా భర్త (జీసీ ఢిల్లీరావు) వేర్వేరుగా ఉంటున్నాం. ఆయన విధులకు హిందూపురం వెళ్తున్నప్పట్నుంచీ పిల్లలకు దూరంగా ఉంటున్నాం. కరోనా వ్యాప్తికి ముందు సెలవులో ఉన్నపుడు పిల్లలతో చాలా సన్నిహితంగా ఉండేదాన్ని. మా ఆయన విధి నిర్వహణలో బిజీగా ఉండటంతో అన్నీ నేనే చూసుకునేదాన్ని. కరోనా నేపథ్యంలో విధులకు హాజరుకావాల్సి వచ్చింది. దీంతో మాకు దూరంగా ఉండాల్సి వస్తోందని మొదట్లో పిల్లలు ఏడ్చారు. తర్వాత అలవాటుపడ్డారు. విధుల్లో ఉన్న ప్రతి తల్లికీ ఇలాంటి అనుభవం తప్పదేమో.

Updated Date - 2020-05-10T10:56:10+05:30 IST