తగ్గని జోరు!

ABN , First Publish Date - 2020-06-26T10:19:21+05:30 IST

జిల్లాలో కరోనా జోరు తగ్గలేదు. వారంలోనే దాదాపు 400 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే జిల్లాలో 1028 కేసులు

తగ్గని జోరు!

విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

కొత్తగా 52 మందికి పాజిటివ్‌

జిల్లాలో 1080కి చేరిన బాధితుల సంఖ్య

 

అనంతపురం వైద్యం, జూన్‌ 25: జిల్లాలో కరోనా జోరు తగ్గలేదు. వారంలోనే దాదాపు 400 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే జిల్లాలో 1028 కేసులు నమోదయ్యాయి. గురువారం మరో 52 మందికి కరోనా సోకింది. దీంతో బాధితుల సంఖ్య 1080కి చేరింది. ఇందులో 347 మంది ఆస్పత్రులలో చికిత్స పొంది డిశ్చార్‌ అయ్యారు. ఏడుగురు మృతిచెందారు. ఇంకా 726 మంది చికిత్స పొందుతున్నారు.  


నిర్లక్ష్యంగా అధికారులు

కరోనా నియంత్రణ విషయంలో అధికారులు ఆదిలో వ్యవహరించినట్లుగా ఇప్పుడు వ్యవహరించటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా బాధితులను  గుర్తించడం వారి ఇష్టప్రకారం ఉంచి వైద్యసేవలు అం దిస్తున్నారు.కొవిడ్‌-19 ఆస్పత్రులలో కూడా డాక్టర్లు, సిబ్బంది కొరత వల్ల పూర్తిస్థాయిలో బాధితులకు వైద్య చికిత్సలు అందడం లేదు. దీంతో కరోనా బాధితులు  తమ బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసి, వారి గోడు వెళ్లబోసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇతరులు కొవిడ్‌-19 విభాగాల్లోకి వెళ్లలేరు కాబట్టి ఇది అధికారులకు ఆటగా మారిపోయింది. 


నత్తనడకన పరీక్షలు

కరోనా పరీక్షల సమయంలో కూడా జిల్లాలో తీవ్ర గం దరగోళం సాగుతోంది. అనంతపురం, కదిరి, హిందూపు రం, బత్తలపల్లి ఆస్పత్రుల లో శాంపిళ్ల సేకరణతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు కేసులు పెరగడంతో అనుమానితులు అదేస్థాయిలో పెరుగుతున్నా రు. పలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఆరోగ్య ఉపకేంద్రాల లోనూ శాంపిళ్లు సేకరిస్తున్నారు. వాటిని ల్యాబ్‌కు పంపి స్తున్నా నిర్ధారణ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి.


ఒక్కొక్క రికి నిర్ధారణ ఫలితం రావాలంటే నాలుగైదు రోజులు పడు తోంది. ఇప్పటి వరకూ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 42,438 మందికి శాంపిళ్లు సేకరించారు. ఇందులో 10,663 శాంపిళ్లు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి, తిరుపతి నిమ్స్‌, ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పంపించారు. జిల్లాలో 28,328 మందికి నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశారు. మరో 287 అండర్‌ ప్రా సెస్‌లో ఉన్నాయి. ఇంకా 6,607 శాంపిల్స్‌కు నిర్ధారణ పరీ క్షలు చేయాల్సి ఉంది. దీన్నిబట్టే జిల్లాలో నిర్దారణ పరీక్షలు ఎంత ఆలస్యంగా కొనసాగుతున్నాయో తెలుస్తోంది. 


సమన్వయలోపం 

కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వీడియోకాన్ఫరెన్స్‌లో అధి కారులకు తెలిపారు. జిల్లాలో ఇందుకు విరుద్ధంగా  పరిస్థి తి ఉంది. అధికారుల మధ్య సమన్వయలోపం కొట్టొ చ్చిన ట్లు కనిపిస్తోంది. 60 ఏళ్లుపైబడిన వారికి మాత్రమే శాం పిళ్లు తీయాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వైద్యశా ఖ సైతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే శాంపిళ్ల సేకరణ చేపడుతోంది. దీంతో పూర్తిస్థాయిలో కరోనా శాంపిళ్లు సేకరించలేకపోతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుతో  ఇష్టారాజ్యంగా జనాలు రోడ్లపైకి వస్తున్నారు. కరోనా సామాజిక వ్యాప్తిచెందింది. ఎందరో తెలియకుండానే ఈ మహమ్మారి బారిన పడి విలవిలలాడుతున్నారు. ఇలాంటి సమయంలో అధికారులు సమన్వ యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. జిల్లాలో ఇందుకు విరుద్ధంగా కొనసాగుతుండటం విమర్శలకు దారితీస్తోంది. 


హిందూపురం: పట్టణంలో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఓ బ్యాంకు ఉద్యోగి కూడా ఉన్నారు. శ్రీకంఠపురం, కోట, నానెప్పనగర్‌లో ముగ్గురికి కరోనా సోకింది. వీరందరూ పాజిటివ్‌ కేసుల మొదటి కాంటాక్ట్‌తో క్వారంటైన్‌లో ఉన్నారు. 

 

రిమాండ్‌ ఖైదీకి ..

స్థానిక సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతపురంలోని త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉంటున్న నిందితుడు హత్యాయత్నం కేసులో తాడిపత్రి సబ్‌జైలుకు రిమాండ్‌పై వచ్చాడు. అంబులెన్స్‌ ద్వారా ఖైదీని అనంతపురంలోని ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. 


బత్తలపల్లి: మండల కేంద్రంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారి తేజశ్రీ తెలిపారు. ఆర్డీటీ ఆస్పత్రిలో పనిచేసే ఓ ఉద్యోగికి ఇంతకుమునుపు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన ద్వారా భార్య, కుమార్తెకు వైరస్‌ సోకిందన్నారు. 


చెన్నేకొత్తపల్లి: మండలంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఎస్‌ఐ రమేశ్‌బాబు, వైద్య సిబ్బంది తెలిపారు. కియలో పని చేసే ఓ ఉద్యోగి 15రోజుల కిందట తమిళనాడుకు వెళ్లి తిరిగి రావడంతో బుధవారం వైద్య పరీక్షలు చేయించగా, కరోనా లక్షణాలు బయటపడ్డాయన్నారు. ఈయువకుడు సీకేపల్లిలో ఓఅద్దెఇంటిలో నివాసముంటున్నాడు. బసంపల్లిలో వృద్ధుడికి (65) కరోనా పాజిటివ్‌ వచ్చింది.


పెనుకొండ రూరల్‌: మండలంలోని వెంకటరెడ్డిపల్లి, వెంకటాపురంతండాలో రెండు కరోనా కేసులు నమోద య్యాయి. ఓ డ్రైవర్‌ (60) రవాణా కంపెనీలో పని చేస్తూ కియ అనుబంధ పరిశ్రమకు అవసరమైన విడిభాగాలను చెన్నై నుంచి పరిశ్రమకు తీసుకొచ్చేవాడు. ఇతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల ముంబై నుంచి వెంకటాపురం తండాకు చెందిన మరో మహిళకు పాజిటివ్‌ వచ్చింది.


 కళ్యాణదుర్గం: పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పోలీస్‌ అధికారుల ద్వారా తెలిసింది. అధికారికంగా వెల్లడించలేదు.


శింగనమల: మండలంలోని తరిమెల గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి అన్వర్‌బాషా తెలిపారు.


బుక్కరాయసముద్రం: మండలకేంద్రంలో ఓ గ్రామ వలంటీర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. రేకల కుంటలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న ఏఈఓకు పాజిటివ్‌ వచ్చింది. గ్రామ సచివాలయం-5లో పనిచేస్తున్న ఓ వీఆర్వోతో గ్రామ వలంటీర్‌ ప్రైమరీ కాంటాక్ట్‌ కావడంతో ఆయన హోమ్‌ క్వారంటైన్‌కు వెళ్లాడు. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పలువురు శాస్త్రవేత్తలు కూడా హోమ్‌ క్వారంటైన్‌కు వెళ్లారు. 


రాప్తాడు: మండలంలోని ప్రసన్నాయపల్లి పంచాయతీ పరిధిలోని చిన్మయ్‌నగర్‌లో వారం రోజుల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.


తాడిపత్రిటౌన్‌/రూరల్‌: మండలంలోని తిమ్మాపురం, చిన్నపొలమడ గ్రామాలకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన ఉద్యోగి పట్టణంలోని రెడ్డివారిపాలెంలోని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. చిన్నపొలమడ గ్రామానికి చెందిన మేస్త్రీకి కరోనా సోకింది.


పామిడి: మండల కేంద్రంలో మరో మూడు కరోనా  కేసులు నమోదైనట్లు ఎద్దులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రోహినాథ్‌ తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురికి వైరస్‌ సోకింది.


గుంతకల్లుటౌన్‌: పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు కొవిడ్‌-19  ఇన్‌చార్జ్‌ వైద్యాధికారి కల్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. అనంతపురానికి చెందిన ఈమె వారం కిందట తిలక్‌నగర్‌లో నానమ్మ ఇంటికి వచ్చింది. మూడు రోజుల కిందట కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది.


20 రోజులు ఆలస్యంగా కరోనా  ఫలితాలు

ఈనెల 3న నలుగురికి చేసిన కరోనా పరీక్షల ఫలితాలు 20రోజులు ఆలస్యంగా గురువారం రావడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఈనెల 3వతేదీన పుట్లూరు మండలం అరకటవేములకు చెందిన ఓ వ్యక్తి యాడికిలోని అత్తవారింటికి వచ్చాడు. ఈ సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడితో కాంటాక్ట్స్‌ ఉన్న నలుగురిని క్వారంటైన్‌కు పంపించారు. క్వారంటైన్‌లో వారికి మొదటిసారి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ కోసం పంపారు. రోజులు గడుస్తున్నా ఫలితాలు రాక పోవడంతో రెండోసారి వారికి పరీక్షలు నిర్వహించి న మూనాలను పంపించారు. ఫలితాల్లో వీరికి కరోనా నెగిటివ్‌ రావడంతో  14రోజులు క్వారంటైన్‌లో ఉండి డిశ్చార్జ్‌ అయ్యారు. క్వారంటైన్‌లో మొదటిసారి పంపిన నమూనాలకు  సంబంధించి ఫలితాల్లో నలుగురికి పాజిటివ్‌ రావడంపై అధికారుల్లో అయోమయం నెలకొంది.


 48 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్‌

కరోనా నుంచి కోలుకుని 48 మంది డిశ్చార్జ్‌ అయినట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు  గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి నుంచి 37 మంది, సవీరా ఆస్పత్రి నుంచి నలుగురు, హిందూపురం కొవిడ్‌ ఆస్పత్రి నుంచి ఏడుగురు కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్‌ చేసి, స్వస్థలాలకు పంపామన్నారు.


కరోనా శాంపిళ్ల సేకరణకు మొబైల్‌ వాహనాలు

కరోనా శాంపిళ్ల సేకరణకు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్‌ వాహనాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర శాఖ నుంచి జిల్లాకు మొబైల్‌ బస్సులు రెండు కేటాయించారు. ఈ రెండు జిల్లాకు చేరాయి. దీంతో జిల్లా అధికారులు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కో మొబైల్‌ బస్సును కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో ఈ మొబైల్‌ బస్సులు పర్యటిస్తూ అనుమానితుల నుంచి వైద్య సిబ్బంది శాంపిళ్లు సేకరిస్తున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రామచంద్రనగర్‌లో ఈ మొబైల్‌ వాహనం ద్వారా శాంపిళ్లు సేకరించారు. జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పరిశీలించారు.

Updated Date - 2020-06-26T10:19:21+05:30 IST