ఉక్కిరిబిక్కిరి..!
ABN , First Publish Date - 2020-07-08T10:17:07+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోంది. రోజురోజుకీ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది.

కేసులు పెరుగుతున్నా.. కనిపించని అప్రమత్తత
పాజిటివ్ వ్యక్తులను ఆస్పత్రులకు తరలించటంలోనూ గందరగోళం
సమన్వయలోపంతో అంతా అయోమయం
కంటైన్మెంట్ జోన్లలోనూ కట్టడి కరువాయె
స్వీయ నియంత్రణలో బాధ్యత మరుస్తున్న వైనం
రాబోవు రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం
దృష్టి సారించకపోతే పొంచి ఉన్న పెను ముప్పు
అనంతపురం, జూలై 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోంది. రోజురోజుకీ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. రోజూ వందలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. కరోనాను ఎలా కట్టడి చేయాలన్న మీమాంసలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. వారి మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పాజిటివ్ వ్యక్తులను కొవిడ్ సెంటర్లకు తరలించే క్రమంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. డిశ్చార్జ్‌ల విషయంలోనూ ఇదే గందరగోళం కొనసాగుతోంది.
సంబంధిత అధికారులు ఆ మేరకు ప్రణాళికను సిద్ధం చేసుకోవటంలో అలసత్వం చూపుతున్నారు. రాష్ట్రంలోనే వైరస్ అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న జిల్లాల్లో అనంత రెండో స్థానంలో ఉంది. రోజూ రాష్ట్ర వ్యాప్తంగా వెల్లడిస్తున్న కరోనా బులిటెన్‌లో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో అనంత ప్రముఖంగా కనిపిస్తోంది. జిల్లాలో కరోనా వైరస్ ఏ మేరకు వ్యాప్తి చెందుతోందో దీన్నిబట్టే తెలుస్తోంది. అయినా అధికారుల్లో అప్రమత్తత కనిపించడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పని విభజనలో సమన్వయలోపమే ఇందుకు ప్రధాన కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇలా అయితే వైరస్ కట్టడి ఎలా అన్న అభద్రతాభావం జిల్లా ప్రజానీకాన్నే కాదు.. అధికారులను సైతం వెంటాడుతోంది. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారే తప్పా.. కట్టడి చేయడంలో తీవ్ర అశ్రద్ధ చూపుతున్నారు. కంటైన్మెంట్ జోన్లలో సైతం రాకపోకలు సాధారణ రోజులను తలపిస్తుండటం గమనార్హం.
పాజిటివ్ వ్యక్తులను తరలించటంలోనూ గందరగోళం
శాంపిల్ సేకరించిన తరువాత పరీక్షల నిర్వహణ పూర్తవగానే పాజిటివా.. నెగిటివా అని నిర్ధారణ అవుతోంది. ఆ మేరకు సంబంధిత వ్యక్తికి మెసేజ్ రూపంలో పంపుతున్న విషయంతెలిసిందే. పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచాలా.. లేదా కొవిడ్ ఆస్పత్రులకు తరలించాలా అనేది అధికారుల్లోనే స్పష్టత కొరవడింది. ఈ క్రమంలో పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆస్పత్రులకు వెళ్లాలని బాధితులు సిద్ధమవుతున్నారు. స్థానిక అధికారులు ఆ మేరకు కరోనా బాధితులకు సమాచారం అందిస్తున్నారు. దీంతో ఆస్పత్రికి వెళ్లేందుకు సిద్ధమైన సందర్భంలో గంటల తరబడి అంబులెన్స్ కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఒకే అంబులెన్స్‌లో నలుగురైదుగురిని తీసుకెళ్లాలని చూస్తున్నారు. దీంతో ఎదురుచూపులు తప్పట్లేదు.
అంతా అయోమయం
కరోనా విషయంలో ఆది నుంచి సమన్వయలోపంతో అయోమయంగా మారింది. పాజిటివ్ నిర్ధారణ కాగానే.. ఆ వ్యక్తులను వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎవరిని ఎక్కడికి తరలించాలి? అందుకు ఎవరు బాధ్యులు? ఏ కొవిడ్ సెంటర్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయి? అనే వివరాలను సరిచూసుకుని పక్కా ప్రణాళికలతో పాజిటివ్ వ్యక్తులను తరలించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. జిల్లాలో అందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోంది. పాజిటివ్ వ్యక్తులను అంబులెన్స్‌లో ఎక్కించుకున్న తరువాత కొవిడ్ సెంటర్లకు తిప్పుతూ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ చేరుస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ముందస్తు ప్రణాళికకు తిలోదకాలు ఇచ్చారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో సంబంధిత అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని... ఆ మేరకు పాజిటివ్ వ్యక్తులను తరలించడంగానీ.... డిశ్చార్జ్ అయిన తరువాత ఇళ్లకు చేర్చడంగానీ.... చేసినట్లయితే ఈ అయోమయానికి తావుండదనే వాదన వినిపిస్తోంది.
పొంచివున్న పెనుముప్పు
కరోనా వైర్‌సకు వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే వచ్చే పరిస్థితులు దాదాపుగా లేవనే చెప్పాలి. కరోనా వైర్‌సతో ప్రజలకు పోరాటమే తప్పా... గత్యంతరం లేని పరిస్థితి నెలకొందనడంలో సందేహం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. ప్రజలు సైతం స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించకపోతే పెనుముప్పు బారిన పడక తప్పదు. ఈ పరిస్థితుల్లో అధికారులందరినీ సమన్వయం చేస్తూ, లోపాలకు తావులేకుండా కరోనా కట్టడికి సమిష్టిగా కదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.
రోడ్డెక్కని 108, 104 వాహనాలు
జిల్లాకు కొత్తగా 108, 104 వాహనాలు వచ్చినా కొన్ని ప్రాంతాల్లో రోడ్డెక్కలేదు. ఐదు రోజులైనా మండల కేంద్రాల్లోని సంబంధిత కార్యాలయాల వద్దే పార్కింగ్‌లో ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మందులు సరఫరా చేసేందుకు ఈ వాహనాలను వాడుకుంటున్నారు. అసలే కరోనా కాలంలో అంబులెన్స్‌ల ప్రాధాన్యత అత్యధికమన్న విషయాన్ని అధికారులు మరచినట్లున్నారు. పెనుకొండ నియోజకవర్గానికి ఆరు అంబులెన్స్‌లు మంజూరయ్యాయి.
ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలోనే ఇప్పటికీ కొలువై ఉన్నాయి. పాత అంబులెన్స్‌లను వెనక్కి పిలిపించడంతోపాటు సిబ్బందిని నియమించిన తరువాతే మండలాలకు కొత్తవాటిని పంపుతామని అధికారులు సెలవిస్తున్నారు. నార్పల మండలానికి ఇప్పటికీ వాహనాలు మంజూరు చేయలేదు. ఉన్న పాత వాటిని బత్తలపల్లి ఆర్డీటీకి కేటాయించారు. అనంతపురం రూరల్ మండలానికి ఇప్పటి వరకూ అంబులెన్స్‌లు కేటాయించలేదు. కదిరి నియోజకవర్గానికి 6 చొప్పున 108లు, 104 మంజూరైనప్పటికీ పీహెచ్‌సీలకు అప్పగించలేదు. వాటిని మందుల రవాణాకు మాత్రమే వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొత్త వాహనాలను ఆయా మండలాలకు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ బాధ్యతను సంబంధిత అధికారులు విస్మరించారన్న విమర్శలు లేకపోలేదు.