సడలింపే లక్ష్యం!

ABN , First Publish Date - 2020-05-17T09:06:41+05:30 IST

జిల్లా యంత్రాంగం ఆంక్షల సడలింపే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోందన్న వాదనలు

సడలింపే లక్ష్యం!

ఆ దిశగా యంత్రాంగం చర్యలు..

జిల్లాలో మూడు మండలాలే రెడ్‌జోన్‌గా గుర్తింపు..

ఆరెంజ్‌ జోన్‌లో 9 మండలాలు..

కేసులు నమోదవుతున్నా.. ప్రకటించని జోన్‌లు..

నేటితో పూర్తికానున్న మూడో విడత లాక్‌డౌన్‌


అనంతపురం, మే 16 (ఆంధ్రజ్యోతి):  జిల్లా యంత్రాంగం ఆంక్షల సడలింపే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో జోన్ల ప్రకటనే ఇందుకు నిదర్శనం. రెడ్‌జోన్ల కుదింపు దిశగా అడుగులేస్తోంది. కంటైన్మెంట్‌, రెడ్‌జోన్లలో పటిష్టమైన చర్యలు చేపట్టి మిగతా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాలని యోచిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జిల్లాలో అనంతపురం, హిందూపురం, కళ్యాణదుర్గం ప్రాంతాలను మాత్రమే రెడ్‌జోన్లుగా పరిగణిస్తున్నారు. ధర్మవరం, కదిరి, మడకశిర, లేపాక్షి, శెట్టూరు, విడపనకల్లు, తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్‌లుగా గుర్తించారు. ఒక పాజిటివ్‌ కేసు నమో దైన ప్రాంతాన్ని ఆరెంజ్‌జోన్‌గా, నాలుగు కేసులు నమో దైతే రెడ్‌జోన్‌లుగా జిల్లా యంత్రాంగం పరిగణిస్తోంది.


రెడ్‌జోన్‌, కంటైన్మెంట్‌ జోన్‌లలో ఆంక్షల సడలింపులు పూర్తిగా నిషేధించారు. ఆరెంజ్‌జోన్‌లలో ఉండే ప్రజలు ఎవరికి వారు భౌతికదూరం పాటించాలని నిబంధన విధించారు. గ్రీన్‌జోన్లలో ఉన్న ప్రజలు కంటైన్మెంట్‌ జోన్‌ల లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలందినట్లు సమాచారం. రెడ్‌జోన్‌, కంటైన్మెంట్‌ జోన్‌లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ జీవితానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలనే నిబంధన విధించినట్లు తెలుస్తోంది.జిల్లా యంత్రాంగం లెక్కల మేరకు 14 మండలాల్లో పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. ఓబుళదేవరచెరువు, తనకల్లు, హిందూపురం రూరల్‌, కళ్యాణదుర్గంరూరల్‌, శెట్టూరు, లేపాక్షి, విడపనక ల్లు, తాడిపత్రి రూరల్‌, కొత్తచెరువు, అనంతపురం రూరల్‌, గార్లదిన్నె, రొళ్ల, రాప్తాడు, కణేకల్లు మండలాల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మిగతా 49 మండలాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. దీంతో ఆ మండలా లన్నీ గ్రీన్‌జోన్‌ పరిధిలోకే వస్తాయి.


అనంతపురం నగర పాలక సంస్థలో పాజిటివ్‌ కేసులు అధిక కావడంతో రెడ్‌ జోన్‌ అమలవుతోంది. జిల్లాలో నమోదైన పాజిటివ్‌ కేసు ల్లో 60 శాతం హిందూపురం మున్సిపాలిటీలోనే నమోద య్యాయి. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ధర్మవరం, గుంతకల్లు మున్సిపాలిటీల్లోనూ పాజిటివ్‌ కేసు లు నమోదయ్యాయి. పుట్టపర్తి, గుత్తి, మడకశిర నగరపం చాయతీల్లోనూ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాల్లోనూ రెడ్‌జోన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కదిరి, రాయదుర్గం, తాడిపత్రి మున్సిపాలిటీలు గ్రీన్‌ జోన్‌ లో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఏవైతే గ్రీన్‌జోన్‌ మండ లాలున్నాయో ఆప్రాంతాలకు వైరస్‌ వ్యాపించకుండా అధి కార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది.


ఇందుకు అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలపై ప్రధానంగా దృష్టి సా రించాల్సి ఉంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన జిల్లాకు చెందిన వలస కూలీలను క్వారంటైన్‌లో ఉంచినప్పటికీ దాదాపు 40 మందిదాకా పాజిటివ్‌ వచ్చింది. ఈ పరిస్థితు ల్లో క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న వారికి వెంటనే నమూ నాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలి.  ఆలస్యం చేస్తే  క్వారంటైన్‌లో ఉన్న వారందరికీ కరోనా వైరస్‌ సోకే అవకా శాలు ఉన్నాయి జిల్లా ప్రజానీకాన్ని కరోనా వైరస్‌ బారి నుంచి కాపాడాలంటే ముందుగా రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌, క్వారంటైన్‌లలో శాంపిళ్ల సేకరణ వేగవంతం చేయడంతో పాటు పరీక్షలు అదే స్థాయిలో నిర్వహించి నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సి ఉంది. 


గ్రీన్‌ జోన్‌ అంటే...

గత 21 రోజుల నుంచి ఇప్పటి వరకూ పాజిటివ్‌ కేసు లు నమోదు కానట్లయితే ఆ ప్రాంతాన్ని గ్రీన్‌జోన్‌గా పరిగణిస్తారు. భౌతిక దూరం పాటిస్తూ ఇక్కడి ప్రజలు సాధారణ జీవితం గడపొచ్చు.  


ఆరెంజ్‌ జోన్‌....

పాజిటివ్‌ కేసులు నాలుగు కంటే తక్కువ నమోదైతే ఆ ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్‌లుగా పరిగణిస్తారు. ఇక్కడ ప్రజలు భౌతికదూరాన్ని పాటించడంతో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ప్రజా రవాణాకు అనుమతి లేదు. పరిమిత ఉద్యోగులతో షిఫ్టుల వారీగా కార్యాలయా లు పనిచేసుకోవచ్చు. కంటైన్మెంట్‌, హాట్‌స్పాట్‌ల వెలుప లనే ఈ అనుమతులు వర్తిస్తాయి. ఈ జోన్‌లలో ఉన్న ప్రజలు ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరికి వారు ఒంటరిగా ఉండాలి. కంటైన్మెంట్‌ జోన్‌లకు వెళ్లకూడదు. 


రెడ్‌జోన్‌....

కరోనా పాజిటివ్‌ కేసులు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా పరిగణిస్తారు. ఇక్కడ వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉంటుంది. పాజిటివ్‌ కేసు లతో పాటు కాంటాక్ట్‌లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో నిషేధాజ్ఞలు అమలవుతాయి. అవసరమైన వైద్యకార్యకలాపాలు మినహా ఎలాంటి కార్యచరణ అనుమ తులకు తావులేదు. ఈ జోన్‌లలో నివాసముంటున్న ప్రజ లు ఇళ్లకే పరిమితం కావాలి. రెడ్‌జోన్‌ను ఎత్తేసేంత వరకూ బయటకు రాకూడదు.  భౌతికదూరాన్ని పాటిస్తూ... ఎవరికి వారు సామాజిక బాధ్యతగా మెలగాలి.


మూడో విడత పూర్తి 

జిల్లాలో  ఆదివారంతో మూడో విడత లాక్‌డౌన్‌ పూర్తవుతోంది. దీంతో నాలుగో విడత లాక్‌డౌన్‌ ఉంటుందా...? ఉంటే ఎప్పటి వరకూ ఉంటుంది ? కేవలం రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌లకే ఆంక్షలు పరిమితం చేస్తారా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పటికే అధికారికంగా 122 నమోద య్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య 200కుచేరువలో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాను ఆరెంజ్‌ జోన్‌గా తీసుకుం టారా....? రెడ్‌జోన్‌గా తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ఆ నిర్ణయం నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ అమలు ఏ తీరుగా ఉంటుందన్నది స్పష్టం కానుంది.


పాజిటివ్‌ కేసుల వివరాలిలా..

జిల్లాలో ఇప్పటి దాకా 122 పాజిటివ్‌ కేసులు నమో దయ్యాయి. అయితే ఇందులో హిందూపురం అర్బన్‌, హిందూపురం రూరల్‌, లేపాక్షి, కొత్తచెరువు, అనంతపురం అర్బన్‌, అనంతపురం రూరల్‌, గుంతకల్లు అర్బన్‌, కళ్యాణ దుర్గం, శెట్టూరు, విడపనకల్లు, రాప్తాడు, గుత్తి, మడకశిర, ఓబుళదేవరచెరువు, తాడిపత్రి రూరల్‌, తనకల్లులో మాత్ర మే కేసులున్నట్లు చూపారు. తాజాగా.. వలస కార్మికులు జిల్లాకు రావడంతో పాల్తూరు, కణేకల్లు, హావళిగి, కొత్తకోట ప్రాంతాల్లోనూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. రికార్డుల్లో ఆ ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదైనట్లు చూపడం లేదు. ఇతరుల కింద చూపడం గమనార్హం. 


ప్రాంతం పురుషులు స్ర్తీలు మొత్తం ఆస్పత్రిలో ఉన్నవారు డిశ్చార్జ్‌ మరణాలు

హిందూపురం అర్బన్‌ 46 24 70 30 36 03

హిందూపురం రూరల్‌ 05 01 06 02 04 ----

లేపాక్షి 02 01 03 01 02 ----

కొత్తచెరువు 01 --- 01 --- 01 ----

అనంతపురం అర్బన్‌ 12 09 21 03 18 ----

అనంతపురం రూరల్‌ 01 01 02 --- 02 ----

గుంతకల్లు అర్బన్‌ --- 02 02 01 01 ----

కళ్యాణదుర్గం 01 02 03 --- 02 01

శెట్టూరు 01 01 02 --- 02 ----

రాప్తాడు 01 --- 01 --- 01 ----

విడపనకల్లు 02 01 03 02 01 ----

ధర్మవరం అర్బన్‌ 02 --- 02 01 01 ----

తాడిపత్రి రూరల్‌ 01 --- 01 --- 01 ----

గుత్తి అర్బన్‌ --- 01 01 --- 01 ----

మడకశిర అర్బన్‌ --- 01 01 01 --- ----

ఓబుళదేవరచెరువు --- 01 01 01 --- ----

తనకల్లు 01 01 02 02 --- ----

 

మొత్తం 76 46 122 45 73 04

Updated Date - 2020-05-17T09:06:41+05:30 IST