లేఔట్లపై అధికార పార్టీ నేతల కన్ను

ABN , First Publish Date - 2020-02-16T09:30:35+05:30 IST

పట్టణ పరిసర ప్రాంతాల్లోని లేఔట్లపై అధికారపార్టీ నేతల కన్నుపడింది.

లేఔట్లపై అధికార పార్టీ నేతల కన్ను

ముడుపులు చెల్లిస్తేనే లేఔట్ల విక్రయానికి అంగీకారం...? 

 కోట్లు దండుకుంటున్న ఓ కీలకనేత 

పట్టణ పరిసరాల్లో కుప్పలు తెప్పలుగా అక్రమ లేఔట్లు

వ్యవసాయ భూమి కన్వర్షన్‌ కాకుండానే లేఔట్ల ఏర్పాటు

మున్సిపాల్టీకి 10శాతం భూమి కేటాయించని వైనం

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికార గణం


 కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 15 :  పట్టణ పరిసర ప్రాంతాల్లోని లేఔట్లపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా లేఔట్లు ఏర్పాటు చేశారని అధికార పార్టీ నాయకులు ప్లాట్ల క్రయవిక్రయాలను నిలిపివేసి వారి నుంచి ముడుపులు డిమాండ్‌ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకు మున్సిపాలిటీకి కేటాయించిన స్థలాలను సైతం విక్రయిస్తున్నారనే నెపంతో అధికారపార్టీకి చెందిన ఓ కీలకనేత రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారనే ఆరోపణలు అధికారపార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మక్కై అక్రమ లేఔట్లను ఏర్పాటుచేసి రూ.కోట్లు గడిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పాలకులు, అధికారులు కుమ్మక్కై ప్రజాప్రయోజనాల కోసం మున్సిపాలిటీకి కేటాయించాల్సిన స్థలాలను సైతం విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్నారనే వాదనలు  వినిపిస్తున్నాయి.  కళ్యాణదుర్గం రింగురోడ్డు పరిసర ప్రాంతాల్లో ఎకరా భూమి రూ. 1.25 కోట్లు పలుకుతోంది.


రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులు వ్యవసాయ భూములను తక్కువ ధరలతో కొనుగోలు చేసి నిబంధనలు పాటించకుండానే లేఔట్లు వేసి దర్జాగా విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యవసాయ భూముల్లో లేఔట్లు వేయాలంటే ముందుగా వాటిని కమర్షియల్‌ ల్యాండ్‌గా మార్చుకోవాలి. అనంతరం లేఔట్‌ వేసే ప్రాంతాన్ని, సర్వే నెంబర్‌తో కూడిన భూమిని మున్సిపల్‌ అధికారులకు చూపించాలి.  లేఔట్‌ వేసేముందు ఊహాచిత్రాన్ని గీసి డీటీసీపీ (డైరెక్టర్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌) శాఖ అనుమతి కోసం పంపాల్సి ఉంది. ఆ శాఖ నుంచి అనుమతి పొందిన అనంతరం లేఔట్‌ను ఏర్పాటుచేసి ఆ స్థలం ఎన్ని ఎకరాలు ఉంటే అందులో పదిశాతం మున్సిపాలిటీకి స్థలాన్ని కేటాయించి మున్సిపల్‌ కమిషనర్‌ పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంది.  40అడుగులు రోడ్డు వేసి ప్రణాళికాబద్ధంగా లేఔట్‌ను ఏర్పాటుచేయాలనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కానీ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల సుమారు 200ఎకరాల్లో లేఔట్‌లు వేసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు స్థలాలను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. 


 అక్రమ లేఔట్ల పర్వం 

పార్వతీనగర్‌ సర్వే నెంబర్‌ 343, 344, ముదిగల్లు రింగు రోడ్డు ప్రాంతంలో 296, 473, 471, రూరల్‌ స్టేషన్‌ పరిసర ప్రాంతంలో 359, గోల్డెన్‌బెల్స్‌ పాఠశాల సమీపంలో 330, ఒంటిమిద్ది పరిసరాల్లో 306, 272, ధర్మవరం రోడ్డులోని గ్యాస్‌గోడౌన్‌ పరిసర ప్రాంతంలో 447, ఆర్టీసీ బస్టాండు సమీపంలో 444లతో పాటు దొడఘట్ట రింగురోడ్డులో 325, 332 సర్వే నెంబర్లు, హిందూపురం, గరుడాపురం రోడ్లలో సైతం పదుల సంఖ్యలో లేఔట్‌లను ఏర్పాటుచేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. పై సర్వే నెంబర్లలో సుమారు 250 ఎక రాల్లో లేఔట్‌లను వేశారు. మున్సిపాలిటీ నిబంధనల మేరకు పదిశాతం కేటాయించాలి. అయితే అలాంటి ప్రక్రియ ఎక్కడా కానరాదు. 359 సర్వేనెంబర్‌లో కొందరు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అక్రమ లేఔట్‌ను ఏర్పాటుచేయడంతో మున్సిపల్‌ అధికారులు గత ఏడాదిలో ఆ లేఔట్‌ లోని రాళ్లను తొలగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల ఆగడాలు ఆగలేదు.


మున్సిపల్‌ కార్యాలయం కట్టుకోవడానికి కూడా పట్టణంలో స్థలం లేకపోవడంతో భవన నిర్మాణానికి మంజూరైన రూ. 3కోట్ల నిధులు మురుగుతున్నాయి. 343, 344, 359 సర్వేనెంబర్లలో ఏర్పాటుచేసిన లేఔట్లలో కొందరు రాజకీయ దళారులు కుమ్మక్కై మున్సిపాలిటీకి కేటాయించిన స్థలాన్ని విక్రయించి కోట్లు దండుకున్నారనే చర్చ అధికార, రాజకీయ పార్టీల్లో విస్తృతంగా సాగుతోంది.  గత ఎన్నికల్లో అధికార పార్టీకి పనిచేశానని ఓ కూరగాయల వ్యాపారి నేరుగా మున్సిపల్‌ స్థలాన్ని ఆక్రమించి యథేచ్ఛగా కూరగాయల మండీ ఏర్పాటు చేసుకున్నాడు.  మున్సిపల్‌ అధికారులు, పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు ప్రముఖ భూమిక పోషిస్తుండడం గమనార్హం. అయితే అక్రమ లేఔట్ల క్రయ విక్రయాలను నిలుపుదల చేయాలని కమిషనర్‌ ఇటీవల తహసీల్దార్‌, సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు నోటీసులు జారీచేశారు. ఇటీవల ఒంటిమిద్ది సమీపంలో ఒకే భూమిని అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల నాయకులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే ఇందు లో ఓ వర్గం నాయకులు ప్లాట్లు వేసే ప్రయత్నం చేయగా, మరోవర్గం నాయకులు అడ్డుకోవడంతో తీవ్ర  ఘర్షణకు దారితీసినట్లు విస్తృత చర్చ వినిపిస్తోంది. 


 అనుమతి లేకుండా లేఔట్లు ఏర్పాటుచేస్తే చర్యలు : వెంకట్రాముడు, మున్సిపల్‌ కమిషనర్‌, కళ్యాణదుర్గం. 

మున్సిపల్‌ నిబంధనల మేరకు అనుమతి తీసుకోకుండా  లేఔట్లు ఏర్పాటుచేస్తే చర్యలు తప్పవు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లేఔట్లలో మున్సిపాలిటీకి పది శాతం స్థలాన్ని కేటాయించి ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించాలి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి మున్సిపల్‌ ఆదాయానికి గండికొడితే ప్రభుత్వ నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోక తప్పదు. మున్సిపల్‌ పరిదిలో ఉన్న లేఔట్లను పరిశీలించి విధివిధానాలపై సమీక్షిస్తాం. 

Updated Date - 2020-02-16T09:30:35+05:30 IST