తొలుత ఎర..అంతలోనే తెర..

ABN , First Publish Date - 2020-03-19T10:39:24+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒక్కసారిగా చల్లబడింది. సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి.

తొలుత ఎర..అంతలోనే తెర..

రాయదుర్గం, మార్చి 18: స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒక్కసారిగా చల్లబడింది. సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు, స్ర్కూట్నీ ప్రక్రియలు ముగిసిన అనంతరం ఉపసంహరణలకు ముందే ఎన్నికలు రద్దయ్యాయి. నామినేషన్లు వేసి బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులపై తొలుత ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ఆరువారాల పాటు వాయిదా పడినప్పటికీ మళ్లీ ప్రక్రియ ప్రారంభమయ్యాక ఎలాంటి ప్రచారం చేయవద్దంటూ టీడీపీ అభ్యర్థులపై వైసీపీ శ్రేణులు ఒత్తిడి తెచ్చాయి. ఇందులో భాగంగా తీవ్ర స్థాయిలో బెదిరింపులు కూడా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ప్రక్రియకు బ్రేక్‌ పడడంతో ఒక్కసారిగా బుధవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడింది. ఎలాగైనా ఎన్నికలు జరుగుతాయని వైసీపీ శ్రేణులు భావిస్తూ వచ్చాయి. అయితే వారి ఆశలకు సుప్రీం తీర్పు కళ్లెం వేసింది. 


ఆశతో ప్రచారాలు 

తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే నమ్మకంతో వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ప్రచారాలు ఆపకుండా కొనసాగిస్తూ వచ్చారు. రాయదుర్గం మండలంలోని వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి మల్లికార్జున పల్లెల్లో మకాం వేసి ఇంటింటికీ తిరిగారు. అలాగే రాయదుర్గం పట్టణంలో వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు కూడా ప్రచారానికి శ్రమించారు. ఎన్నికలు వాయిదా పడవని, అనుకున్న సమయానికి అవి జరుగుతాయని కూడా ప్రచారం చేశారు. రాయదుర్గం మున్సిపాలిటీలో కొందరు వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చీరల పంపకాలు కూడా చేసినట్లు సమాచారం. వలంటీర్లను ఉపయోగించుకుని చీరలు పంచినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదులు కూడా చేశారు. కణేకల్లులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు చీకటి పడేవరకు ప్రచారాలు చేస్తూ ఎన్నికల వేడి కొనసాగించారు. 


బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు

కొంతమంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కొందరు వైసీపీ నాయకులు బ్లాక్‌ మెయిలింగ్‌కు, బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ముఖ్యంగా కణేకల్లు మండల తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కౌసల్య భర్త ఆనంద్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా వారి రైస్‌మిల్లు, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. వాటిని మూసి వేయిస్తామని ఏకంగా విప్‌ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరిక చేశారు. రైస్‌మిల్లు వల్ల స్కూలు పిల్లలకు అరోగ్య సమస్యలు వస్తున్నాయని పలు సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు. జడ్పీటీసీ అభ్యర్థిని లొంగదీసుకోవడమే ల క్ష్యంగా బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే కొందరు అధికారులపై ఒత్తిడి తెచ్చి.. వాటికి సంబంధించి విచారణ ప్రక్రియలు కూడా చేపట్టేవిధంగా చర్యలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.


అయితే దీనిపై ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా టీడీపీ శ్రేణులు ముందుకెళుతున్నాయి. అలాగే రాయదుర్గం మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఒకరిని తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఒకానొక సందర్భంలో ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కూడా బెదిరించినట్లు సమాచారం. దీంతో వెనుకడుగు వేసిన ఆ అభ్యర్థి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ఎక్కడా ఎన్నికల్లో ప్రచారం చేయకూడదని ఆ అభ్యర్థికి హుకుం జారీ చేసినట్లు సమాచారం. అలాగే కౌన్సిలర్‌ అభ్యర్థులకూ డబ్బులతో ఎరవేసే ప్రయత్నం చేశారు. ఒకరిద్దరు అభ్యర్థులు ఇప్పటికే వైసీపీ నాయకులతో అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒత్తిడి తట్టుకోలేక వారు లొంగిపోయినట్లు తెలిసింది. 


కోర్టు తీర్పుతో కంగుతిన్న వైసీపీ 

ఏదోవిధంగా ఎన్నికలు నిర్వహిస్తారనే ఆశతో ఉన్న వైసీపీ శ్రేణులు సుప్రీంకోర్టు తీర్పుతో కంగుతిన్నాయి. ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా పడడంతో ఇప్పటివరకు నడిపిన రాయబారాలు, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు నిలిపి వేశారు. తాత్కాలికంగా ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో ఇక ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చినా, బెదిరింపులు చేసినా నిష్ప్రయోజనమని భావించి స్వేచ్ఛగా వదిలేశారు. రాయబారాలు కూడా వెనక్కు తీసుకున్నారు. అయితే ఎన్నికలను పూర్తిస్థాయిలో నిలిపివేస్తారా?, లేక ఆపిన చోటు నుంచి మళ్లీ ప్రారంభిస్తారా? అనే విషయమై స్పష్టత లేకపోవడంతో తాత్కాలికంగా లొంగుబాటు ప్రక్రియను నిలిపివేసినట్లు కనిపిస్తోంది. ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా బుధవారం మధ్యాహ్నం నుంచి పూర్తిగా చల్లబడడంతో టీడీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. 

Updated Date - 2020-03-19T10:39:24+05:30 IST