బీజేపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్ద పీట
ABN , First Publish Date - 2020-09-14T11:14:31+05:30 IST
రతీయ జనతాపార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్దపీట వేశారు. జిల్లాకు చెందిన ముగ్గురికి కీలక పదవులు లభించాయి.
ముగ్గురు నేతలకు కీలక పదవులు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్‌రెడ్డి
కార్యదర్శిగా చార్లెస్ చిరంజీవిరెడ్డి
ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా దేవానంద్
అనంతపురం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) :భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్దపీట వేశారు. జిల్లాకు చెందిన ముగ్గురికి కీలక పదవులు లభించాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆదివారం ప్రకటించిన రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్‌రెడ్డికి, కార్యదర్శిగా చార్లెస్ చిరంజీవిరెడ్డికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా దేవానంద్‌కు అవకాశం దక్కింది.
విష్ణుకి కీలక బాధ్యతలు
భారతీయ జనతా పార్టీలో రెండున్నర దశాబ్దాలుగా పని చేస్తున్న విష్ణువర్ధన్‌రెడ్డికి ఆ పార్టీ మరోసారి కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం నెహ్రూ యువకేంద్ర వైస్‌చైర్మన్ హోదాలో పనిచేస్తున్న ఆయన్ను తాజాగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అమడగూరు మండలం కంచరవాండ్లపల్లికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి 1992లో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు. మొదట కదిరి ఏబీవీపీ తాలూకా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అంచలంచెలుగా ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడి దాకా ఎదిగారు. 1998లో యువ మోర్చా జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ఆ విభాగంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పని చేశా రు.
ఆ తరువాత బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తాజా కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి ‘ఆంధ్ర జ్యోతి’తో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ప్రధాన నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు.
చిరంజీవిరెడ్డికి పార్టీ గుర్తింపు..
అనతికాలంలోనే భారతీయ జనతా పార్టీలో చార్లెస్ చిరంజీవిరెడ్డికి మంచి గుర్తింపు లభించింది. మాజీ సైనిక ఉద్యోగి అయిన ఆయన 24 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ పార్టీలో దశాబ్దంన్నర కాలానికిపైగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యం లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర పార్టీ తరపున అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కొన్ని రోజులు స్తబ్ధుగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆయనకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం దక్కింది. ఈ సందర్భంగా చిరంజీవిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకాన్ని ఉంచి కీలక బాధ్యతలు అప్పగించినందుకు ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా, సోము వీర్రాజులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏబీవీపీతో ఆరంభమై... ఎస్సీ మోర్చా అధ్యక్షుడు స్థాయికి దేవానంద్
కదిరికి చెందిన దేవానంద్ భారతీయ జనతా పార్టీ అనుబంధ ఏబీవీపీలో 1983లో చేరి చురుగ్గా పని చేస్తూ అంచలంచెలుగా ఎదిగారు. దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడి గానూ, దళిత మోర్చా జాతీయ కార్యదర్శిగానూ పదవుల ను అలంకరించారు. పార్టీ చేపట్టిన అయోధ్య, కశ్మీర్ అంశాల్లో చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలుకెళ్లారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీలో చేరి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి తిరిగి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్న దేవానంద్‌ను ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దేవానంద్ మాట్లాడుతూ పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పినందుకు పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.