-
-
Home » Andhra Pradesh » Ananthapuram » teacher story
-
ఒక్కొక్కరుగా బయటపడుతున్న అక్రమార్కులు.. ఇంకా ఎందరున్నారో తెలియక..
ABN , First Publish Date - 2020-12-10T06:43:23+05:30 IST
ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమార్కులు ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. దీంతో ఇంకా ఎందరున్నారోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇంకెందరున్నారో..?
ప్రిఫరెన్సియల్, స్పౌజ్ కేటగిరీల్లో లబ్ధికి దొడ్దిదారిలో మరికొందరు టీచర్లు..
‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో లోతైన దర్యాప్తు
మరో 17 మంది దరఖాస్తుల
తిరస్కరణకు సిద్ధం
ఇప్పటికే 61 మందిపై చర్యలు
అనంతపురం విద్య, డిసెంబరు 9: ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమార్కులు ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. దీంతో ఇంకా ఎందరున్నారోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బదిలీల్లో ప్రిఫరెన్సియల్, స్పౌజ్ కేటగిరీల్లో లబ్ధి పొందేందుకు దొడ్డిదారిలో వచ్చి అనేక మంది వలకు చిక్కారు. ఇప్పటికే 61 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మరో 17 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపై ఒకట్రెండు రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
లోతైన దర్యాప్తుతో..
అడ్డదారిలో 20 హెచ్‌ఆర్‌ఏ, ఇతర దగ్గరి స్థానాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రిఫరెన్సియల్, స్పౌజ్ కేటగిరీలో లబ్ధి పొందేందుకు చాలా మంది ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. కొందరు సంఘాల నాయకులు, టీచర్లు అడ్డదారులు తొక్కటంపై పక్షం రోజులుగా ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురిస్తున్న విషయం విదితమే. దీంతో డీఈఓ శామ్యూల్ ఆదేశాల మేరకు విద్యాశాఖాధికారులు విచారణ ముమ్మరం చేశారు. లోతైన దర్యాప్తునకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరు, బోగస్ సర్టిఫికెట్లు, తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేసిన వారిపై కొరఢా ఝుళిపించారు. ఈ క్రమంలో ఏకంగా 61 మంది దరఖాస్తులను తిరస్కరించారు.
తాజాగా మరో 17 వరకూ..
అడ్డదారిలో వచ్చిన మరో 17 మందిని గుర్తించినట్లు సమాచారం. అర్హులు కాకపోయినా.. ప్రిఫరెన్సియల్, స్పౌజ్ కేటగిరీల్లో లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసిన 17 మందిని అనర్హులుగా ఇప్పటికే విద్యాశాఖాధికారులు తేల్చినట్లు తెలుస్తోంది. గత 8 ఏళ్లలో స్పౌజ్, ప్రిఫరెన్సియల్ కేటగిరీలో లబ్ధి పొంది కూడా తాజాగా ఈ ఏడాది బదిలీల్లో అడ్డదారిలో వచ్చినట్లు సమాచారం. దీంతో వారందరినీ అనర్హులుగా నిర్ధారించే పనిలో అధికారులు పడ్డారు. గురువారం పూర్తిస్థాయిలో 17 మందిని తిరస్కరించే అవకాశమున్నట్లు సమాచారం. ఇదే జరిగితే బదిలీల్లో దొడ్డిదారి బదిలీరాయుళ్ల సంఖ్య 78కి చేరనుంది. అక్రమార్కుల వేట కొనసాగుతోంది. ఇంకా ఎంత మంది తేలుతారో.. చూడాలి.
విడిపోయినోళ్లు స్పౌజ్ ఎట్టా..?
ఉపాధ్యాయుడు రామకృష్ణపై సస్పెన్షన్ వేటు
ఆయన భార్యపై చర్యలకు ఆర్జేడీకి లేఖ
అనంతపురం విద్య, డిసెంబరు 9: అడ్డదారిలో స్పౌజ్‌ను ఉపయోగించుకున్న ఆత్మకూరు మండలం బీ యాలేరు పాఠశాల గణిత ఉపాధ్యాయుడు రామకృష్ణను సస్పెండ్ చేస్తూ డీఈఓ శామ్యూల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చట్టబద్ధంగా విడిపోయామంటూ 2009లో ఆయన భార్య ప్రిఫరెన్సియల్ కేటగిరీని వినియోగించుకున్నారు. ప్రస్తుత బదిలీల్లో స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేశారు. గతంలో చట్టబద్ధంగా విడిపోయిన వారు ఇప్పుడు స్పౌజ్ కింద దరఖాస్తు చేయటంతో డీఈఓ, ఇతర విద్యాశాఖాధికారులకు సందేహం వచ్చింది. డీఈఓ ఆదేశాల మేరకు విద్యాశాఖాధికారులు విచారణ చేపట్టారు. చట్టబద్ధంగా కలిసినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలంటూ దరఖాస్తుదారుడిని కోరారు. అలాంటి పత్రాలు అందించకపోవటంతో అక్రమ మార్గంలో స్పౌజ్ వినియోగించుకున్నట్లు నిర్ధారణకు వచ్చిన డీఈఓ.. టీచర్ రామకృష్ణపై సస్పెషన్ వేటు వేశారు. ఈ మేరకు కమిషనర్, కలెక్టర్, జేసీలకు నివేదిక ఇచ్చారు. ఆయనకు స్పౌజ్ కేటగిరీ వినియోగంలో సహకరించిన ఆయన భార్య, ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్జేడీకి లేఖ పంపారు.