-
-
Home » Andhra Pradesh » Ananthapuram » TDP former MLA phone to DSP
-
డీఎస్పీకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫోన్
ABN , First Publish Date - 2020-12-30T06:28:44+05:30 IST
ఇసుక తరలిస్తున్న ఎద్దులబండ్లను పోలీసులు స్టేషన్‌కు తరలించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విలేకరుల సమక్షంలో డీఎస్పీ చైతన్యతో ఫోన్‌లో మాట్లాడారు.

పోలీసుల అదుపులోని ఎద్దులబండ్లు విడుదల
తాడిపత్రి, డిసెంబరు 29:
ఇసుక తరలిస్తున్న ఎద్దులబండ్లను పోలీసులు స్టేషన్‌కు తరలించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విలేకరుల సమక్షంలో డీఎస్పీ చైతన్యతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ వెంటనే పదినిమిషాల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్న ఎద్దులబండ్లను పోలీసులు వదిలిపెట్టారు. వివరాలివి. పెన్నానది నుంచి ఇసుకను తరలిస్తున్న దాదాపు 15 ఎద్దులబండ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని పట్టణ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. దాదాపు గంట పాటు స్టేషన్ బయట పెట్టారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వెంటనే డీఎస్పీ చైతన్యకు ఫోన్‌చేశారు. సోషల్‌మీడియాలో చోటుచేసుకున్న ఇసుక వివాదాన్ని కారణంగా చేసుకొని పోలీసులు ఇసుక బండ్లను అదుపులోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నిబంధనల పేరుతో అదుపులోకి తీసుకోవడం వల్ల ఎద్దులబండ్ల యజమానులు ఎలా బతకాలని, వాటిని ఎలా సాకాలని అడిగారు. గంటకుపైగా బండ్లను స్టేషన్ వద్ద పెట్టడం వల్ల బరువు ఎక్కువై, చెప్పలేని స్థితిలో ఎద్దులు మూగబాధను అనుభవిస్తున్నాయన్నారు. ఎందుకు అదుపులోకి తీసుకున్నారో విచారించి వాటిని వెంటనే వదిలిపెట్టాలన్నారు. లేదంటే వాటికోసం తాను స్టేషన్ వద్దకు వస్తానని చెప్పారు. ఇప్పటికే తహసీల్దార్ దృష్టికి ఈవిషయం తీసుకువెళ్లానన్నారు. స్పందించిన డీఎస్పీ చైతన్య విచారణ జరిపి వాటిని వెంటనే వదిలిపెడతామని జేసీకి హామీ ఇచ్చారు. పట్టుమని పది నిమిషాల్లోనే పట్టణ పోలీసులకు డీఎస్పీ ఫోన్‌చేశారు. అదుపులోకి తీసుకున్న ఎద్దులబండ్లను వదిలిపెట్టాలని ఆదేశించారు. దీంతో స్టేషన్ ఆవరణలో ఉన్న ఎద్దులబండ్లను పోలీసులు వదిలిపెట్టారు.
ఎద్దులబండ్ల యజమానుల కడుపు కొడతారా : జేసీ
రెక్కాడితే గానీ డొక్కాడని దుర్భర పరిస్థితుల్లో ఇసుకను అమ్ముకుంటున్న ఎద్దులబండ్ల యజమానుల కడుపు కొడతారా అంటూ ప్రభుత్వం, పోలీసు అధికారులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల గురించి పట్టించుకోని పోలీసులు.. అమాయకులైన ఎద్దులబండ్ల యజమానులను అదుపులోకి తీసుకొని, బండ్లను స్టేషన్‌కు తీసుకురావడం ఎంతవరకు సమంజసమన్నారు. దమ్ముంటే వైసీపీ ప్రభుత్వం ఎద్దులబండ్ల యజమానులకు ఉపాధి కల్పించాలన్నారు. ఉపాధిని గాలికి వదిలేసి వారు చేసుకుంటున్న పనిని కూడా నిబంధనల పేరుతో అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తాడిపత్రి ప్రాంతంలో ఇసుక అక్రమంగా టిప్పర్లు, ఇతర వాహనాల్లో భారీఎత్తున తరలిపోతున్నా పోలీసులతో పాటు ఇతర అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వాటి తరలింపులో బడానేతలు ఉండడమే కారణమా అని ప్రశ్నించారు. ఇసుక బండ్ల యజమానులు తమను ప్రశ్నించలేరని, ఎదురుతిరగలేరన్న ధైర్యంతో వారిపై అధికారం ప్రదర్శిస్తున్నారన్నారు. ఎద్దులబండ్లకు పెన్నానదిలో ఉచితంగా ఇసుక తోలుకొనే విధంగా అధికారులు, పోలీసులు సహకరించాలన్నారు. భవిష్యత్తులో ఇసుక బండ్లను సీజ్ చేసినా, యజమానులపై పర్సంటేజీల పేరుతో డబ్బులు వసూలు చేసినా వారందరితో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేస్తానని తెలిపారు. వారి సమస్య తీరేంతవరకు అక్కడి నుంచి కదిలేది లేదని హెచ్చరించారు. ఆటోలకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్న ప్రభుత్వమే వాటికి ఇన్సూరెన్స్ కట్టడంతో పాటు రాయితీల్లో మినహాయింపు ఎందుకు ఇవ్వకూడదన్నారు. ఇన్సూరెన్స్ మినహాయింపు ఇవ్వడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగితే డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారు కూడా లబ్ధిపొందే అవకాశం ఉంటుందన్నారు. అమ్మఒడి, నేతన్ననేస్తం తదితర పథకాల ద్వారా వేలకోట్ల రూపాయలను లబ్ధిదారుల కోసం ఖర్చుచేస్తోందని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. ఎద్దులబండ్లను విస్మరించడంపై ఆయన మండిపడ్డారు.