నష్టాల టమోత

ABN , First Publish Date - 2020-12-07T06:25:29+05:30 IST

మార్కెట్‌ల్లో టమోటాల ధరలు భారీగా తగ్గిపోయాయి. దీంతో రైతులు ఖర్చులు కూడా రావని పండిన పంటను మార్కెట్‌కు కూడా తరలించకుండా రోడ్డుపై వదిలేస్తున్నారు.

నష్టాల టమోత
గార్లదిన్నె మండలం రామదాసుపేట వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి పక్కన పారబోసిన టమోటాలు

తగ్గిన టమోటా ధరలు

15 కిలోల బాక్సు కనిష్ఠ ధర రూ.50..గరిష్ఠ ధర రూ.200

ఎగుమతులు తగ్గిపోవడమే కారణం

మార్కెట్‌కు తీసుకెళ్లలేక రోడ్లపై పారబోస్తున్న రైతులు

అనంతపురంరూరల్‌, డిసెంబరు 6 : మార్కెట్‌ల్లో టమోటాల ధరలు భారీగా తగ్గిపోయాయి. దీంతో రైతులు ఖర్చులు కూడా రావని పండిన పంటను మార్కెట్‌కు కూడా తరలించకుండా రోడ్డుపై వదిలేస్తున్నారు. ఈఏడా ది సీజన్‌ ప్రారంభం నుంచి టమోటాల ధరలు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఇతర ప్రాంతాలకు ఎగుమతులు పడిపోవటం ధరలు తగ్గటానికి కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.  


కనిష్ఠ ధర రూ.50

అనంతపురం టమోటా మార్కెట్‌ల్లో ఆదివారం కనిష్ఠంగా 15కిలో బాక్సు రూ.50తో అమ్ముడు పోయాయి. గనిష్ఠ ధర రూ.200 వరకు పలికినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో పంట ఉత్పత్తులు మార్కెట్‌ రాకున్నా ధర మాత్రం నేల చూపులు చూస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఒక్కో మండికి 5వేల నుంచి 10 వేల బాక్సు ల మధ్య టమోటా వస్తున్నాయి. ఈఏడాది జూలై నుంచి మొదటిసారి ధరలు తగ్గిపోయినట్లు ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. గత మూడు, నాలుగు నెలలు కనిష్ఠ ధర రూ.200పైగా పలుకుతూ వచ్చాయి. అయితే గత వారం రోజులుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు చెబుతున్నారు. 


తగ్గిన ఎగుమతులు..

జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 వేల హెక్టార్లకు పైగా టమోటా సాగు చేసినట్టు అధికారుల చెబుతున్నారు. ప్రధానంగా కళ్యాణదుర్గం, కదిరి, ముదిగుబ్బ, గార్లదిన్నె, ఆత్మకూరు, రాయదుర్గం, బత్తలపల్లి, కూడేరు, రాప్తాడు, తదితర మండలాల్లో టమోటా అధికంగా పండిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి మదనపల్లి, కోలార్‌, అనంతపు రం కక్కలపల్లి మార్కెట్‌కు టమోటాలు తరలిస్తారు. అక్క డి నుంచి మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌ తదితర ప్రాంతాలకు టమోటాలు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోనే పంట దిగుబడులు ఎక్కువకావటంతో వారు మన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం లేదని  వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్‌ వచ్చిన కాయలను హైదరాబాదు, విజయవాడ, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమ తి చేస్తున్నారు. ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది రైతులు కోసిన పంటను రోడ్లపై పారబోయటం, పశువుల మేతకు వదిలేయటం చేస్తున్నారు.
 వినియోగదారుడికి ఊరటేదీ ?

మార్కెట్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసే టమోటా ధరలు భారీగా తగ్గినా ఆ ప్రయోజనం వినియోగదారుడికి చేరడం లేదు. టమోటా మార్కెట్‌లో 15 కిలో బాక్స్‌ ధర రూ.50 నుంచి రూ. 200 వరకూ పలుకుతోంది. ధర్మవరం, శింగమల, ఉరవకొండ, తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, గుత్తి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో కిలో మేలిరకం కాయలు రూ.20 నుంచి 25 మధ్య పలుకుతుండగా.. ఆతరువాత రకం కాయలు రూ.10 నుంచి రూ. 20మధ్య ఉంటున్నాయి. జిల్లా కేంద్రంలోను కిలో రూ.15 నుంచి రూ.20 మధ్య పలుకుతున్నాయి. ఈ లెక్కన ధరలు లేక రైతులు, ఉండాల్సినదానికంటే ఎక్కువ ధరలతో వినియోగదారులు ఇద్దరూ నష్టపోతున్నారు. వీరి ఇద్దరి మధ్య దళా రీలు, వ్యాపారులు మాత్రం లాభాలు దక్కించుకుంటున్నారు. 

Updated Date - 2020-12-07T06:25:29+05:30 IST