ఎస్‌ఐ వ్యాఖ్యలతో సిబ్బందిలో కలకలం!
ABN , First Publish Date - 2020-12-13T06:09:38+05:30 IST
ఆత్మాభిమానం దెబ్బతినేలా, కుటుంబాలను కించపరిచేలా ఓ ఎస్‌ఐ మాట్లాడిన మాటలు సిబ్బందికి తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి.

ఆత్మాభిమానం దెబ్బతీసేలా మాట్లాడటంపై ఆగ్రహం
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
అనంతపురం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆత్మాభిమానం దెబ్బతినేలా, కుటుంబాలను కించపరిచేలా ఓ ఎస్‌ఐ మాట్లాడిన మాటలు సిబ్బందికి తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. ఎస్‌ఐ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలా పాలపై ఉక్కుపాదం మోపే దిశగా చర్యలు తీసుకోవటంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అదుపుతప్పాయి. ఆ ఎస్‌ఐ సిబ్బందితో నాలుగు గోడల మధ్య మాట్లాడిన తీరును శాఖలోని ఉన్నతాధికారులకు వివరించినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం సిబ్బందికి మరింత ఆవేదన కలిగిస్తోంది. జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమకు నెలవైన పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఓ ఎస్‌ఐ విధులు నిర్వర్తిస్తున్నాడు. మరో సమీప పోలీ్‌సస్టేషన్‌కు ఇన్‌చార్జ్‌గా కూడా పనిచేస్తున్నారు. పేకాట, మట్కాతోపాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా పలుచోట్ల దాడులు చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట కొనసాగుతున్న నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేయటంలో భాగంగా ఆ ఎస్‌ఐ తమ సిబ్బందితో ఇటీవల స్టేషన్‌లో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఆ సందర్భంగా శాఖలోని సిబ్బంది ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారితో జత కట్టినట్లయితే వారు మీ ఇళ్లల్లోకి వచ్చి వెళ్లినట్లేనని కు టుంబీకులకు తాకేలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీంతో సిబ్బందంతా అవాక్కయ్యారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారితో స న్నిహితంగా ఉన్న వారిని గుర్తించి, చర్యలు తీసుకోకుండా అందర్నీ ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని, పైగా కుటుంబసభ్యులను ఉద్దేశించి మాట్లాడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వారిలో కొందరు సిబ్బంది ఆ ఎస్‌ఐ తీరును స్టేషన్‌లోనే ఖండించే దిశగా ప్రయత్నించినప్పటికీ.. మరికొందరు వారించినట్లు తెలుస్తోంది. ఆ ఎస్‌ఐ వ్యవహారశైలిని పైస్థాయి అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. చివరికి సబ్ డివిజనల్ అధికారి దృష్టికీ విషయాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అధికారులు.. ఆ ఎస్‌ఐను మందలించకపోవటంతో సిబ్బంది ఆవేదనకు గురవుతున్నట్లు సమాచారం. జిల్లాలో కిందిస్థాయి సిబ్బంది, కుటుంబసభ్యుల ఆరోగ్యం, భద్రత పట్ల ఎస్పీ సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ.. కిందిస్థాయి అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై పోలీసువర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆ ఎస్‌ఐపై ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఓ గోదాములో పట్టుకున్న రేషన్ బియ్యం వ్యవహారంలో అధికార పార్టీ నాయకుడి నుంచి ఫోన్ రావడంతో సంబంధిత వ్యక్తిని వదిలేందుకు డబ్బు తీసుకున్నారన్న విమర్శలున్నాయి. పేకాట ఆడుతున్నారంటూ కారులో వెళ్తున్న కొందరిని అడ్డగించి, వారి నుంచి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా ఆ ఎస్‌ఐ బెదిరింపులతో ఓ వ్యక్తి ప్రైవేట్ కేసు వేసేందుకు సిద్ధపడిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ స్థాయి నాయకుడితో చెప్పించి, ఉపసంహరించేలా మంతనాలు సాగాయన్న ప్రచారమూ పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు.. ఆ ఎస్‌ఐపై చర్యలు తీసుకుని, సిబ్బందిలో ఆత్మస్థయిర్యం నింపుతారో.. ఉదాసీనంగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.