గల్లాపెట్టె ఖాళీ

ABN , First Publish Date - 2020-12-06T06:15:06+05:30 IST

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని నిధుల కష్టాలు చుట్టుముట్టాయి. గల్లాపెట్టె ఖాళీ అ యింది. ఉద్యోగులకు వేతనాలిచ్చేందుకూ ఇబ్బందిగా మారింది.

గల్లాపెట్టె ఖాళీ

ఎస్కేయూకు నిధుల కష్టాలు

ఉద్యోగుల వేతనాలకూ కటకట..

ఆరు నెలలుగా ఆలస్యంగానే..

జనవరిలో రానున్న గ్రాంటు

ఈ నెల జీతాలెలా?

అవస్థలు పడుతున్న చిరుద్యోగులు

వర్సిటీ చరిత్రలో ఇలా ఎప్పుడూ లేదంటూ ఆవేదన

ఎస్కేయూ, డిసెంబరు 5: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని నిధుల కష్టాలు చుట్టుముట్టాయి. గల్లాపెట్టె ఖాళీ అ యింది. ఉద్యోగులకు వేతనాలిచ్చేందుకూ ఇబ్బందిగా మారింది. ఆరు నెలలుగా ప్రతినెలా వేతనాల చెల్లింపులో జాప్యమవుతోంది. ప్రభుత్వం ఎస్కేయూకు 2020-21 సంవత్సరానికి ఉద్యోగుల వేతనాల కోసం రూ.54 కోట్ల బ్లాక్‌ గ్రాంటు కేటాయించింది. ఈ మొత్తం కూడా ఒకేసారి వర్సిటీకి రాలేదు. ఇప్పటివరకూ మూడు విడతలుగా రూ.39.70 కోట్లు ఇచ్చారు. ఈ మొత్తం నవంబరు వరకు జీతాలకు సరిపోయింది. ప్రస్తుతం రూ.13.70 కోట్లు నాలుగో విడతగా జనవరిలో ప్రభుత్వం మం జూరు చేయనుంది. ప్రభుత్వం జనవరిలో ఇస్తే.. డిసెంబరు వేతనాలకు కష్టంగా మారింది. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులు లేవనీ, సకాలంలో వేతనాలు అందేవని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రతినెలా వేతనం ఆలస్యమవుతోందని కుటుంబం గడవడం కష్టంగా మారిందని చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ప్రతినెలా రూ.6 కోట్లు జీతాలకే..

ఎస్కేయూ ఉద్యోగులకు ప్రతినెలా వేతనాల కోసం రూ.6 కోట్లు కావాలి. ఇందులో రెగ్యులర్‌ ఉద్యోగులు 278, టైమ్‌స్కేలు ఉద్యోగులు 248, మినిమమ్‌ స్కేలు 240 మందితోపాటు పెన్షనర్లకు కలిపి ప్రతినెలా రూ.6 కోట్లు రావాలి. ఇవేకాక డెయిలీవేజ్‌ ఉద్యోగులు మరో 50 మంది దాకా ఉన్నారు. వీరికి జనరల్‌ అకౌంటు నుంచి జీతాలు చెల్లిస్తారు. వీరికి ఏ ప్రొవిజినల్‌ ప్ర కారం జీతాలు ఇస్తారో అధికారులకే తెలియాలి. నూతన భవనాల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు లేక వర్సిటీ అభివృద్ధి కుంటుపడుతోంది. ఇలాగే కొనసాగితే వర్సిటీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఖజానా ఖాళీ

ఎస్కేయూ ఖజనా ఖాళీ అయింది. ప్రస్తుతం చిన్నపాటి మొ త్తాలకు కూడా ప్రభుత్వ గ్రాంటు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వర్సిటీ ఆదాయానికి కామధేనువుగా ఉన్న దూరవిద్య ద్వారా ఏటా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల ఆదాయం వచ్చేది. ఇలాంటి దూరవిద్యను పూర్వ డైరెక్టర్లు, ఉద్యోగులు నిర్వీర్యం చేయడంతో ప్రస్తుతం అడ్మిషన్లు పూర్తిగా తగ్గిపోయాయి. వేలలో ఉండే అడ్మిషన్లు వందల్లోకి మారాయి. దీంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. దూరవిద్య ఆదాయం ఉండుంటే ప్రభుత్వ బ్లాక్‌ గ్రాంటు కోసం ఎదురుచూడకుండా జీతాలకు ఉపయోగించుకుని మళ్లీ గ్రాంటు వచ్చాక సర్దుబాటు చేసుకునే వీలుండేది. దీంతో జీతాల ఆలస్యం సమస్య తలెత్తేది కాదు.


వీసీ దృష్టికి తీసుకెళ్తాం

జీతాల అంశం వైస్‌చాన్సెలర్‌ దృష్టికి తీసుకెళ్తాం. ప్రస్తుతం గ్రాంటు జనవరిలో వస్తుంది. అంతవరకూ జీతాలకు కష్టంగా ఉంటుంది. వైస్‌చాన్సెలర్‌తో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, గ్రాంటు తొందరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటాం. వచ్చే వారంలో జీతాలు అందేలా చర్యలు తీసుకుంటాం.

- శ్రీరాములు, ఫైనాన్స్‌ ఆఫీసర్‌

Read more