హమ్మయ్య..! .. ఆ ఏడుగురికీ కరోనా లేదు..

ABN , First Publish Date - 2020-03-24T10:21:44+05:30 IST

హమ్మయ్య..! ఆ ఏడుగురికీ కరోనా లేదని తేలింది. వారిలో ఆ లక్షణాలు లేవంటూ జిల్లాకు నివేదికలందడంతో జిల్లా ప్ర జలు ఊపిరి పీల్చుకున్నారు.

హమ్మయ్య..! .. ఆ ఏడుగురికీ కరోనా లేదు..

అనంతపురం వైద్యం, మార్చి 23: హమ్మయ్య..! ఆ ఏడుగురికీ కరోనా లేదని తేలింది. వారిలో ఆ లక్షణాలు లేవంటూ జిల్లాకు నివేదికలందడంతో జిల్లా ప్ర జలు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా అనుమానితులతో జిల్లాలో అలజడి రేగిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 11మంది అనుమానితులను జిల్లా ఆస్పత్రి లోని ఐసొలేషన్‌ వార్డులో ఉంచి చికిత్సలందించారు. ఇప్పటికే నలుగురి శాంపిల్స్‌ తిరుపతికి పంపించగా.. వారికి వ్యాధి లేదని నిర్ధారణ అయింది. ఆ తరువాత ఏడు అనుమానిత కేసులకు సంబంధించిన శాంపిల్స్‌ తిరుపతికి పంపించారు. అక్కడ పరీక్షలు నిర్వహించి వారికి కరోనా లేదని నిర్ధారిస్తూ నివేదికలు పంపించారు. ఆ ఏడుగురికీ నెగిటివ్‌ వచ్చినట్లు సోమవారం డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్‌ తెలిపారు.దీంతో ఆస్పత్రి వైద్యాధికారులు సోమవారం ఆరుగురిని డిశ్చార్జ్‌ చేసి పంపించారు.


మరొకరిని మంగళవారం వరకు చూసి పంపిస్తామన్నారు. కాగా, జిల్లా ప్రజలను కరోనా వదంతులు వణికిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చినవా రిని చూసి జనం జడుసుకుంటున్నారు. అలాంటి వారి చిరునామా తెలిస్తే వెంటనే హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తున్నారు. నగరంలోని జీస్‌సనగర్‌లో గల ఓ అపార్ట్‌మెంటులో ఉగాండా నుంచి వచ్చిన యువతి ఉన్నట్లు సమాచారం తెలుసుకున్నారు. ఆమెకు కరోనా లక్షణాలున్నాయంటూ ప్రచారం జరి గింది. దీంతో ఆ అపార్ట్‌మెంటులోని ఇతర కుటుంబాలు, చుట్టుపక్కల కుటుంబాల వారు ఆ అమ్మాయి ఇంటిని మూసివేసి.. లోపలే బందీని చేశారు. వైద్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి వెళ్లి ఆమెను తీసుకువచ్చి పరీక్ష చేశారు. అయితే ఎలాంటి లక్షణాలు లేవని నిర్ధారించి పంపించారు. అలాగే ఢిల్లీ నుంచి గార్లదిన్నె మండలంలోని ఓ గ్రామానికి నలుగురు వచ్చారు. వారికి కరోనా లక్షణాలున్నట్లు వదంతులు వ్యాపించాయి. వైద్యాధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు అప్రమత్తమయ్యారు.


స్థానిక మెడికల్‌ ఆఫీసర్‌, సిబ్బందిని పంపించి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. దీంతో వారు హుటాహుటిన వెళ్లి పరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే 14 రోజుల పాటు బయటి ప్రదేశాలకు వెళ్లకూడదంటూ హెచ్చరిక నోటీసులందజేశారు. కుందుర్పిలోనూ ఇలాగే ఉగాండా నుంచి వచ్చిన ఆమెకు కరోనా లక్షణాలున్నాయంటూ ప్రచారం జరిగింది. ఆమెను వైద్యులు ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. మరోవైపు  పక్క రాష్ర్టాల నుంచి జిల్లాకు ఎవరినీ రానివ్వకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, వైద్యశాఖ అధికారులు, వైద్యులు పహారా కాస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి జిల్లా వాసులయితే వారిని అక్కడే ఉంచి వారి సమగ్ర సమాచారం తెలుసుకుంటున్నారు.


పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉన్నారంటేనే వారి బంధువులతో కలిసి జిల్లాకు పంపిస్తున్నారు. ఇతరులనైతే తిరిగి పంపించేస్తున్నారు. పెనుకొండకు చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలున్నాయంటూ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమె రైల్వేశాఖలో పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో డాక్టర్లు అప్రమత్తమై  రాత్రికి రాత్రే ఐసొలేషన్‌ వార్డులో ఆమెను ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. చివరికి ఎలాంటి లక్షణాలు లేవని నిర్ధారించి అవసరమైన చికిత్సలు చేసి పంపించేశారు. ఇలా జిల్లాలో ప్రజలు, అధికారులను కరోనా కలవర పెడుతోంది.


ఆస్పత్రిలో ఎమర్జెన్సీ సేవలకు  వైద్య బృందాలు..

జిల్లా ఆస్పత్రిలో కరోనా వైద్యసేవలందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇ ప్పటి వరకూ రాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌ ఏర్పాటుచేశారు. అయితే రోజూ తామే ఐసొలేషన్‌ వార్డుకు వెళ్లి చికిత్సలందించాల్సి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది వివాదానికి దారితీసింది. దీంతో సూపరింటెండెంట్‌ రామస్వామినాయక్‌ ఆలోచించి ఎమర్జెన్సీ వైద్య బృందాలు ఏర్పాటు చేశారు. ఇందులో వైద్యులు, ల్యాబ్‌, ఎక్స్‌రే టెక్నీషియన్లు, ఇతర నర్సులు మూడు రోజులకోసారి డ్యూటీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

Updated Date - 2020-03-24T10:21:44+05:30 IST