మళ్లీ సర్వర్ సమస్య
ABN , First Publish Date - 2020-03-02T10:17:31+05:30 IST
జిల్లాలో తొలిరోజు ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. గత నెలతో పోలిస్తే కొంత పెరిగినా లక్ష్యాన్ని చేరుకోలేదు.

83.94 శాతం పింఛన్ సొమ్ము పంపిణీ
పలు ప్రాంతాల్లో సర్వర్ సమస్యతో ఆటంకం
తొలిరోజు లక్ష్యాన్ని చేరుకోని వైనం
5.13 లక్షల మందికి రూ.131.44 కోట్లు కేటాయింపు
ఆన్‌లైన్ పోర్టల్‌లో తేడా
అనంతపురం వ్యవసాయం, మార్చి 1 : జిల్లాలో తొలిరోజు ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. గత నెలతో పోలిస్తే కొంత పెరిగినా లక్ష్యాన్ని చేరుకోలేదు. ఆదివారం తొలిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు 83.94 శాతం పింఛన్ సొమ్ము పంపిణీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల్లోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో తొలిరోజు అనుకున్న సమయానికి పంపిణీ చేయలేకపోయారు. మధ్యాహ్నం సమయానికి 50 శాతంలోపే పింఛన్ల పంపిణీ జరిగింది. మధ్యాహ్నం తర్వాత నెమ్మదిగా పుంజుకుంది. రాత్రి 7 గంటల వరకు (83.94 శాతం) 4.33 లక్షల మందికి రూ.107.81 కోట్లు పంపిణీ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించగా... కొన్ని ప్రాంతాల్లో 7 గంటలు, మరికొన్ని ప్రాంతాల్లో 8 గంటలకు పంపిణీని మొదలుపెట్టారు. అలాగే మారుమూల గ్రామాల్లో సర్వర్ సమస్యతో పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది. ఈనెలలో జిల్లాకు 5.13 లక్షల మందికి రూ.131.44 కోట్లు కేటాయించారు. అయితే వైఎ్‌సఆర్ పింఛన్ కానుక ఆన్‌లైన్ పోర్టల్‌లో 5 లక్షల మందికి రూ.128.43 కోట్లు కేటాయించినట్లు చూపించడం గమనార్హం. గత నెలలోనే ఈ తప్పిదం జరిగింది. ఈనెలలో కూడా అదే తప్పు పునరావృతం కావడం విమర్శలకు తావిస్తోంది.
పంపిణీ శాతం పెరిగినా... అందుకోని లక్ష్యం
ప్రతి నెలా తొలిరోజు మధ్యాహ్నం సమయానికి 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఫిబ్రవరిలో తొలిరోజు రాత్రి వరకు 75 శాతం పింఛన్లు పంపిణీ చేశారు. గత నెలతో పోలిస్తే ఈనెల పింఛన్ల పంపిణీ శాతం పెరిగినా లక్ష్యం మేరకు పంపిణీ చేయలేకపోయారు. ఈనెలలో పింఛన్ల పంపిణీలో పుట్లూరు మండలం మొదటి స్థానంలో నిలిచింది. ఆ మండలంలో 96.13 శాతం పింఛన్ సొమ్ము పంపిణీ చేశారు. ఆ తర్వాత వరుసగా కదిరి, పెద్దవడుగూరు, తాడిపత్రి, నార్పల, బుక్కరాయసముద్రం, నల్లచెరువు, నల్లమాడ, తలుపుల, లేపాక్షి, గుంతకల్లు, తనకల్లు, గార్లదిన్నె మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో 90 శాతం నుంచి 94.12 శాతం వరకు సొమ్ము పంపిణీ చేశారు. అత్యల్పంగా మడకశిరలో పింఛన్ల సొమ్మును పంపిణీ చేసి వెనుకబడ్డారు. మడకశిర మండల పరిధిలో 65.49 శాతం, కుందుర్పిలో 70.66, బుక్కపట్నం 74.72, అనంతపురం నగరం 72.83 శాతం పింఛన్ సొమ్మును పంపిణీ చేయడంతో సరిపెట్టారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 4.33 లక్షల మందికి రూ.107.81 కోట్లు పంపిణీ చేశారు.