పంటల నమోదుకు సర్వర్ కష్టాలు
ABN , First Publish Date - 2020-07-18T10:37:12+05:30 IST
ఈ-కర్షక్ యాప్‌లో ఖరీఫ్ పంటల నమోదుకు సర్వర్ సమస్యగా మారింది. దీంతో సాగైన పంటల వివరాల నమోదు ప్రక్రియ ..

ముందుకు సాగని ప్రక్రియ
వ్యవసాయ సిబ్బందికి తప్పని అవస్థలు
ఇప్పటిదాకా 400 ఎకరాలే పూర్తి
అనంతపురం వ్యవసాయం, జూలై 17: ఈ-కర్షక్ యాప్‌లో ఖరీఫ్ పంటల నమోదుకు సర్వర్ సమస్యగా మారింది. దీంతో సాగైన పంటల వివరాల నమోదు ప్రక్రియ ముందుకు సాగట్లేదు. వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. పొలాల్లో ఫొటోలు దిగేందుకు పలు మార్లు వెళ్లలేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఐదురోజుల క్రితం జిల్లాలో ఈ-కర్షక్ యాప్‌లో పంటల నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఆగస్టు నెలాఖరు వరకు గడువు విధించారు. తొలి మూడు రోజులపాటు యాప్ ద్వారా పంటల వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవటంలో సిబ్బంది నిమగ్నమయ్యారు. సర్వర్ సమస్యతో ఇందులోనూ అవస్థలు పడ్డారు. రెండు రోజులుగా క్షేత్ర స్థాయిలో పొలాల్లోకి వెళ్లి, పంటల వివరాలు అప్‌లోడ్ చేయటం మొదలు పెట్టారు. రైతుల వివరాలు, ఫొటో అప్‌లోడ్ చేసేందుకు సర్వర్ సమస్య అడ్డంకిగా మారింది. వివరాలు అప్‌లోడ్ చేసే సమయంలో సర్వర్ నాట్ రీచబుల్ అని చూపుతోంది. దీంతో ఏం చేయాలో తోచని అయోమయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది కొట్టుమిట్టాడుతున్నారు.
400 ఎకరాల నమోదు
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత వరుసగా పడిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా పంటల సాగు పెరుగుతోంది. ఇప్పటిదాకా 2.71 లక్షల హెక్టార్లల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో వేరుశనగ 2.29 లక్షలు, మరో 42 వేల హెక్టార్లలో ఇతర రకాల పంటలు సాగు చేశారు. పక్షం రోజుల్లో ఈసారి సాధారణ సాగు విస్తీర్ణం పూర్తయ్యే అవకాశం ఉంది. గతంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది మాత్రమే పంటల నమోదుకు బాధ్యులను చేశారు. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ శాఖలు, రెవెన్యూ సిబ్బందిని కూడా బాధ్యులను చేశారు. వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది కలిసి తమ పరిధిలోని పొలాలకు వెళ్లి, ఈ-కర్షక్ యాప్‌లో పంటల వివరాలు అప్‌లోడ్ చేసేలా నిబంధనలు విధించారు. సర్వర్ సమస్యతో వ్యవసాయ, అనుబంధ శాఖలు, రెవెన్యూ సిబ్బంది అవస్థలు పడుతున్నారు.
సర్వర్ మొరాయిస్తుండటంతో పంటల నమోదు ఆశించిన స్థాయిలో సాగట్లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పటిదాకా 400 ఎకరాల వివరాలు మాత్రమే నమోదు చేశారు. జిల్లాలో ఎంత మంది రైతులకు సంబంధించి ఎన్ని ఎకరాల్లో పంటల వివరాలు నమోదు చేశారన్న సమాచారం తెలుసుకునే అవకాశం జిల్లాస్థాయి అధికారులకు కష్టంగా మారింది. సర్వర్ సరిగా పనిచేయకపోవటమే ఇందుకు కారణమన్న వాదనలు ఆ శాఖ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గడువులోగా పంటల నమోదు కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు చొరవ తీసుకుని, సర్వర్ సమస్యను పరిష్కరించాల్సి ఉంది.