కంప్యూటర్ స్కేళ్ల మాయాజాలం
ABN , First Publish Date - 2020-11-13T06:24:00+05:30 IST
వేరుశనగ రైతుకు కునుకు లేకుండా పోతోంది. అతివృష్టి, అనావృష్టికి ఎదురొడ్డి సాగులో గట్టెక్కడం ఒక ఎత్తయితే... కాస్తోకూస్తో చేతికొచ్చిన పంటను అ మ్ముకోవడం గగనమవుతోంది. కళ్యాణదుర్గం ప్రాం తంలో వేరుశనగకు ఎలాంటి మార్కెటింగ్ సదుపాయం లేదు.
వేరుశనగ రైతుకు తూకాల్లో ఎగనామం
బస్తాపై 8 కేజీల వరకు మోసం
ఆపై రివాజుతో మరో 4 కేజీలు అదనం
కరువు రైతును చిత్తుచేస్తున్న దళారులు
కళ్యాణదుర్గం, నవంబరు 12: వేరుశనగ రైతుకు కునుకు లేకుండా పోతోంది. అతివృష్టి, అనావృష్టికి ఎదురొడ్డి సాగులో గట్టెక్కడం ఒక ఎత్తయితే... కాస్తోకూస్తో చేతికొచ్చిన పంటను అ మ్ముకోవడం గగనమవుతోంది. కళ్యాణదుర్గం ప్రాం తంలో వేరుశనగకు ఎలాంటి మార్కెటింగ్ సదుపాయం లేదు. ఇదే దళారులకు కలిసొస్తోంది. కొ త్తగా పుట్టుకొచ్చిన కంప్యూటర్ స్కేళ్లతో మాయాజాలం చేస్తున్నారు. తక్కువ తూకాలతో రైతన్నను నిలువునా దోపిడీ చేస్తుండడంతో పంటంతా దళారుల పాలవుతోంది. వ్యాపారులు, మధ్య దళారులు కుమ్మక్కై రూ.లక్షలు గడిస్తున్నారని ఈప్రాంత రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ వేరుశనగ పంట ముందస్తుగా రావడంతో కళ్యాణదుర్గం ప్రాంతంలో క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. నాణ్యమైన వేరుశనగ క్వింటాల్ ధర రూ.4 వేలు పలుకుతోంది. నాసిరకం కాయలు రూ.3 వేల నుంచి రూ.3500 వరకు కొనుగోలు చేస్తున్నారు. రైతుల బలహీనతను గుర్తించిన వ్యాపారులు, దళారులు కుమ్మక్కై కంప్యూటర్ స్కేల్ ద్వారా తూకాలు వేసి మోసాలకు తెగబడుతున్నారు. ఈ యంత్రాలకు రిమోట్ ఏర్పాటు చేసి బరువుల్లో రైతును ముంచుతున్నారు. 50 కేజీల బస్తా కంప్యూటర్ స్కేల్ తూకంలో 40, 42 కేజీలకు మాత్రమే చూపుతోందని రైతులు చెబుతున్నారు. దీంతో బస్తాపై సుమారు 8 నుంచి 10 కేజీల వరకు నష్టపోతున్నట్లు వాపోతున్నారు. మరోవైపు బస్తాకు 4 కేజీలు రివాజ్ పోను రైతు భారీగా నష్టపోతున్నాడు. ఇటీవల కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో ఇదే రీతిన దళారుల మోసం బహిర్గతమైంది. ఓ వ్యాపారి ఈక్రమంలో రైతులను మోసం చేయడంతో స్థానికులు గుర్తించారు. ఆవెంటనే వేరుశనగ తరలించే వాహనాన్ని అడ్డుకున్నారు. మరోసారి తూకాలు వేయాలని పట్టుబట్టడంతో దళారుల గుట్టు రట్టయింది. కాగా ఈప్రాంతం నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, తమిళనాడుకు వేరుశనగ లారీలు నిత్యం వందలాదిగా తరలుతున్నాయి. ఎలాంటి రసీదులు లేకుండా జీరో వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
ప్రభుత్వ నిబంధనలు ఇలా...
వ్యాపార లావాదేవీలు కొనసాగించాలంటే ముం దుగా ట్రేడింగ్ లైసెన్స్ పొందాలి. సరుకు కొనుగోలు చేసే స్కేళ్లను తూనికల శాఖ అధికారులు పరిశీలించి, తూకాల్లో తేడాలేకుండా సవరించి స్కేళ్లకు సీల్ వేయించుకోవాలి. అయితే సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. కళ్యాణదుర్గం పట్టణంతో పాటు పాలవాయి, కంబదూరు, యాటకల్లు, మామిడూరు, దురదకుంట, బెళుగుప్ప తదితర ప్రాంతాలకు చెందిన దళారులు వ్యాపారుల అవతారమెత్తి నిత్యం తూకాల్లో మోసాలకు పాల్పడుతూ అక్రమంగా లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇష్టారాజ్యంగా వేరుశనగ క్రయవిక్రయాలు సాగుతున్నా, తూనికలు, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నాయి. ధరల్లో తేడా, తూకాల్లో మోసం, రివాజ్ పేరుతో నాలుగు కేజీలు తొలగింపులతో లెక్కలు కడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారు.
గుంతకల్లు కేంద్రంగా పుట్టుకొస్తున్న నకిలీ స్కేళ్లు
గుంతకల్లులో నకిలీ కంప్యూటర్ స్కేళ్లు పుట్టుకొస్తున్నాయని ఈ ప్రాంత వ్యాపారస్తులు ద్వారా తెలుస్తోంది. కంప్యూటర్ స్కేళ్లలో సాంకేతిక సమస్యను సృష్టించి, అందులో తూకాల్లో తేడా వచ్చే విధంగా మార్చుతున్నట్లు సమాచారం. దీనికి తోడు వ్యాపారుల వద్ద కంప్యూటర్ స్కేల్‌కు సంబంధించిన రిమోట్ ఉండడంతో మరో మోసం జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్కేల్‌పై 50 కేజీల వేరుశనగ బస్తా ఉంచితే, 42 కేజీలు ఉన్నట్లు తేడా చూపుతోంది. ఒక వేళ స్కేల్‌లో సరిగా 50 కేజీలు చూపితే... గుర్తించిన దళారి అతని జేబులో ఉన్న రిమోట్‌తో అపరేట్ చేసి తక్కువ తూకాలు వచ్చేలా మోసాలకు పాల్పడుతున్నట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. రైతు గిట్టుబాటు ధరకు పట్టుబడితే దళారులు సరే అంటూ తూని కల్లో తేడా చూపుతున్నారనే విమర్శలున్నాయి. కళ్యాణదుర్గం ప్రాంతంలో దళారులు యథేచ్ఛగా రైతులను మోసం చేస్తున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు. తూనికలు, కొలతల శాఖ అధికారులకు వ్యాపారుల నుంచి ముడుపులు అందుతుండడంతో ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేరుశనగ రైతులను దోపిడీ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.