అన్ని శాఖల్లో రిజర్వేషన్లు అమలు కావాల్సిందే

ABN , First Publish Date - 2020-12-17T06:54:24+05:30 IST

రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఎస్సీ శాసనసభ సంక్షేమ కమిటీ చైర్మన్‌ గొల్ల బాబురావు పేర్కొన్నారు. అలా పనిచేయని అధికారులు ఇంటికెళ్లిపోవచ్చన్నారు.

అన్ని శాఖల్లో రిజర్వేషన్లు అమలు కావాల్సిందే
సమావేశంలో మాట్లాడుతున్న గొల్ల బాబురావు .. వేదికపై కమిటీ సభ్యులు, అధికారులు

అలా చేయలేని అధికారులు ఇంటికెళ్లొచ్చు..

ఎస్సీ శాసనసభ సంక్షేమ కమిటీ చైర్మన్‌ గొల్ల  బాబురావు

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 16: రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఎస్సీ శాసనసభ సంక్షేమ కమిటీ చైర్మన్‌ గొల్ల బాబురావు పేర్కొన్నారు. అలా పనిచేయని అధికారులు ఇంటికెళ్లిపోవచ్చన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎస్సీ శాసనసభ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో రోస్టర్‌, రిజర్వేషన్ల అమలుపై రిజిస్టర్ల పరిశీలన సమావేశం నిర్వహించారు. అంతకుముందు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ శాసనసభ కమిటీ చైర్మన్‌ గొల్ల బాబురావు, సభ్యులు ఎమ్మెల్యేలు కొం డేటి చిట్టిబాబు, ఉన్నమట్ల ఎలిజా, ఎమ్మెల్సీ శమంతకమణి రిజిస్టర్లను పరిశీలించారు. చైర్మన్‌ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఈ కమిషన్‌ వివిధ జిల్లాల్లో పర్యటించి, ఎస్సీల సమగ్రాభివృద్ధికి పని చేస్తుందన్నారు. షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమానికి వివిధ పథకాలు ఎలా అమలు చేస్తున్నారో పరిశీలించి, ఎస్సీల జీవన ప్రమాణస్థాయిలు ఎలా మెరుగుపడ్డాయనే అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తుందన్నారు. అన్ని శాఖల్లో నియామకాల్లో రోస్టర్‌ కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా శాఖల్లో రిజర్వేషన్ల అమలు తప్పులతడకగా ఉందనీ, పునరావృతమైతే తీవ్రం గా పరిగణిస్తామన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. జిల్లాలో 480 దళిత కాలనీలకు పేర్లు మార్చటం సామాజిక సంస్కరణల్లో సువర్ణ అధ్యాయమన్నారు. అనంతరం ఎంపీ తలారి రంగయ్య.. చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రిజిస్టర్ల పరిశీలనలో కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు కొవిడ్‌-19 నిబంధనలు పాటించలేదు. పలువురు మాస్కు కూడా ధరించకపోవటం శోచనీయం. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ గంగాధర్‌ గౌడ్‌, డీఆర్‌ఓ గాయత్రీదేవి, జడ్పీ సీఈఓ శోభాస్వరూపరాణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ యుగంధర్‌, హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.




Updated Date - 2020-12-17T06:54:24+05:30 IST