నగరం... చెత్తమయం!
ABN , First Publish Date - 2020-03-02T10:14:33+05:30 IST
ఐదు నెలలుగా నగరపాలక సంస్థలో పారిశుధ్యం పడకేసింది. గత ఐదు నెలలుగా ఇదే దుస్థితి ఎదురవుతోంది.

పడకేసిన పారిశుధ్యం
కాలువల్లో పేరుకుపోతున్న మురుగు
అపరిశుభ్రతతో విజృంభిస్తున్న దోమలు
500 మంది కార్మికులకు 136 మంది పర్యవేక్షకులే..!
తూతూమంత్రంగా స్ర్పేయింగ్, ఫాగింగ్
పనికిరాని పుష్‌కాట్‌లకు రూ.లక్షలు వెచ్చింపు
వీల్‌బోర్డ్‌లు, పరకలు, గ్లౌజ్‌ల ఊసేలేదు
నగరపాలక సంస్థలో అధికారుల చోద్యం
అనంతపురం కార్పొరేషన్, మార్చి1ః ఐదు నెలలుగా నగరపాలక సంస్థలో పారిశుధ్యం పడకేసింది. గత ఐదు నెలలుగా ఇదే దుస్థితి ఎదురవుతోంది. పలు కాలనీల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తదిబ్బలు పేరుకుపోయాయి. డ్రైనేజీల్లో ముందుకు కదలని మురుగు దర్శనమిస్తోంది. ఒకసారి కాలువల్లో మురుగు తొలగిస్తే... ఇక నెలలు గడిచినా అటువైపు వెళ్లని పరిస్థితి. దీంతో అపరిశుభ్ర ప్రాంతాలు దోమలకు ఆవాసంగా మారి రోగాలు ప్రబలడానికి కారణమవుతున్నాయి. కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కార్మికుల కంటే పర్యవేక్షకులే అధికమంది ఉండటం గమనార్హం. కమిషనర్‌గా ప్రశాంతి ఉన్న సమయంలో పారిశుధ్యంపై దృష్టి సారించి సమస్యను కొంతవరకు పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత పారిశుధ్యం చాలా అధ్వానంగా తయారైంది. ప్రధాన కాలనీల్లో సైతం చెత్తతో నిండిన డంపింగ్ బిన్‌లు మూలుగుతున్నాయి. వాటి చుట్టూ ఆవులు, పందులు చేరి ఇష్టానుసారంగా చెత్తను రోడ్డుపై పడేసే దృశ్యాలు నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నాయి.
మరోవైపు కార్మికులు మురుగును తరలించేందుకు అవసరమైన వీల్‌బోర్డ్‌లు లేక సంచులనే ఉపయోగించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరికి పరకలు, గంపలు, చేతులకు ధరించాల్సిన గ్లౌజ్‌లు, మాస్క్‌లు కూడా లేని దయనీయ పరిస్థితి. అయితే ‘మన అనంత-సుందర అనంత’తో అభివృద్ది జరిగిపోతోందని అధికారులు మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ కార్యక్రమానికి మాత్రం ప్రతి రోజూ కొత్తగా గ్లౌజ్‌లు కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. ఇక వాహనాల కోసం అద్దె రూపంలో చేస్తున్న ఖర్చు మాత్రం రెట్టింపవుతోంది. కానీ అక్కడ ఎక్కువ పనిచేసేది నగరపాలక సంస్థ కార్మికులే.
లెక్కకు మంచి పారిశుధ్య పర్యవేక్షకులు
నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో పనిచేసే వాళ్లు తక్కువ... పని చేయించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. కొందరు అధికారుల పుణ్యమా అని ఈ విభాగంలో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా మార్చుకున్నారు. పారిశుధ్య కార్మికుల్లో ఔట్‌సోర్సింగ్ కింద 409 మది పనిచేస్తున్నారు. వీరిలో డ్రైవర్లు 40 మంది, కంప్యూటర్ ఆపరేటర్లుగా, పాఠశాలల్లోనూ 15 మంది వరకు పనిచేస్తున్నారు. మేస్ర్తీలుగా 22 మంది ఉన్నారు. అదే శాశ్వత ఉద్యోగులుగా ఉన్న 220 మంది కార్మికుల్లో 12 మంది వరకు స్కూళ్లలో వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు. 13 మంది మేస్ర్తీలుగా, పీహెచ్‌వర్క్‌ర్‌గా పనిచేస్తూ డిప్యుటేషన్ మీద మేస్ర్తీగా మరో 20 మంది ఉన్నారు. ఔట్‌సోర్సింగ్‌లో 67 మంది, రెగ్యులర్‌లో 45 మంది పోనూ 517 మంది వరకు కార్మికులు విధుల్లో ఉన్నారు. వీరిలో మరో ఐదుగురు ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా ఉన్నారు.
సెలవులూ ఇతరత్రా చూస్తే.. నిత్యం 500 మంది వరకు అందుబాటులో ఉంటారు. వీరందరినీ పారిశుధ్య విభాగం అధికారి (ఎంహెచ్‌ఓ), ఆరు గురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, 55 మంది మేస్ర్తీలు, 74 మంది నూతనంగా ఎంపికైన శానిటరీ ఎన్విరాన్‌మెంటల్ సెక్రటరీలు పర్యవేక్షిస్తున్నారు. అంటే నగరంలోని 50 డివిజన్లలో పనిచేసే కార్మికులకు 136 మంది పర్యవేక్షకులే. గతంలో సర్కిల్‌కు ఇద్దరు మేస్ర్తీల చొప్పున, అదనంగా కంపో్‌స్టయార్డ్‌కు ఒకరు మొత్తం 13 మందిని మాత్రమే అలాట్ చేశారు. కానీ నాలుగేళ్ల క్రితం ఓ కమిషనర్ చేసిన వ్యవహారంతో ఇబ్బడిముబ్బడిగా మేస్ర్తీలను పెంచేశారు. మరి ఆ పర్యవేక్షణతో ఏం ఒరుగుతోందో అర్థంకాని పరిస్థితి.
తక్కువ కొలతలతో పుష్‌కాట్‌ల తయారీ.. ఉపయోగంలోకి రాక మూలనపడేసిన వైనం
పారిశుధ్య పనుల్లో పుష్‌కాట్‌లు అత్యవసరం. ప్రస్తుతం ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా టబ్‌లలో తీసుకుని వాటిని పుష్‌కాట్‌లో తీసుకెళ్లాలి. అయితే ఇప్పుడు తెచ్చిన పుష్‌కాట్‌లు అందుకు అనుగుణంగా లేవు. అందులో నాలుగు టబ్‌లు అమర్చాల్సి ఉండగా, కొలతలు తక్కువగా ఉండడంతో పట్టడం లేదు. ఇక రెండే టబ్‌లు పెట్టాల్సి వస్తే ఎక్కువ సమయం వృథా అవుతుంది. కానీ అధికారులు ఎలాంటి కొలతలతో వాటిని నిర్మాణం జరిగేలా ఆదేశాలిచ్చారో తెలియదు కానీ... కార్పొరేషన్‌కు పట్టుకొచ్చారు. దాదాపు 250 వరకు వాటిని తీసుకొచ్చారు. అందులో 50 వరకు పారిశుధ్య పనికి ఉపయోగించారు. కానీ అవి ఉపయోగపడకపోవడంతో వినియోగించడం లేదు. దీంతో రూ.లక్షల నిధులు మట్టిలో పోసినట్లయిందనే విమర్శలున్నాయి.
వీల్‌బోర్డ్‌లు, పరకలు, గ్లౌజ్‌ల సంగతేంటి?
పారిశుధ్య కార్మికులపై అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. వారికి అందించాల్సిన కనీస సదుపాయాలు కూడా మృగ్యమయ్యాయి. ప్రధానంగా కాలువల్లో తీసిన మురుగును తరలించేందుకు వీల్‌బోర్డ్స్ (కాలువ బండ్లు) అవసరం. సర్కిల్‌కు 50 చొప్పున 250 నుంచి 300 వరకు కావాల్సి ఉంది. కానీ అవి లేకపోవడంతో పాడైపోయిన కాలువబండ్లు, సంచుల్లోనూ తీసుకెళ్లాల్సి వస్తోంది. ఇక పరకలు, గంపలు, ఆరునెలలకోసారి ఇవ్వాలి. వాటి విషయంలో అతీగతీ లేదు. కాలువ తీయడానికి ఉపయోగించే కడ్డీలు, మాస్క్‌లు, గ్లౌజ్‌లు, కొబ్బరినూనె, చెప్పులు, దుస్తులు (యూనిఫాం), సబ్బులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా నాలుగు నెలల పరకలు, గంపలు రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చారు. దీంతో కార్మిక సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక్కొక్కరికి 12 పరకలు ఇవ్వాల్సి ఉండగా చివరికి రెండు మాత్రమే ఇచ్చారు.