అంతా ఆర్భాటమే..!

ABN , First Publish Date - 2020-02-16T09:38:46+05:30 IST

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బియ్యం కార్డుల పంపిణీ ఆర్భాటంగా మారింది. కొత్త ఏడాది నుంచే ఈ కార్డులిస్తామని ప్రకటించిన ప్రభుత్వం..

అంతా ఆర్భాటమే..!

 బియ్యం కార్డుల లబ్ధిదారులకు మొండిచేయి

జిల్లాకు చేరింది 1468 కార్డులే..

అర్హత జాబితాలో 10.60 లక్షల కార్డులు 

మిగిలిన కార్డులు ఎప్పుడొస్తాయో తెలియని వైనం

1.59 లక్షల కార్డులపై అనర్హత వేటు 

తొలిరోజు పంపిణీ లాంఛనమే!


అనంతపురం వ్యవసాయం, ఫిబ్రవరి 15 : ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బియ్యం కార్డుల పంపిణీ ఆర్భాటంగా మారింది. కొత్త ఏడాది నుంచే ఈ కార్డులిస్తామని ప్రకటించిన ప్రభుత్వం... నేటికీ లబ్ధిదారుల ఆశలపై నీళ్లుపోస్తోంది. అర్హత జాబితాలో రూ.10.60 లక్షల కార్డులు ఉంటే... తొలిరోజు జిల్లాకు కేవలం 1468 బియ్యం కార్డులు మాత్రమే పంపి చేతులు దులుపుకుంది. దీంతో ప్రారంభంలోనే పంపిణీ ఆశించిన స్థాయిలో జరగలేదు. కేవలం ఆరు నియోజకవర్గాల్లో లాంఛనంగా ప్రారంభించడంతోనే సరిపెట్టారు. జనవరి నుంచే కొత్త బియ్యంకార్డులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తు ప్రణాళికాలోపంతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా బియ్యం కార్డుల పంపిణీ మొదలు పెడతామని మరోసారి ఆర్భాటంగా ప్రకటించారు. తమకు కొత్త బియ్యం కార్డులు ఇస్తారని ప్రజలు ఎంతో ఆశ పడి... తీరా ప్రభుత్వ తీరుతో నిట్టూర్చారు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రజలు అవాక్కయ్యారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయంలో సివిల్‌సప్లై అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. తొలుత ట్రైల్‌ రన్‌ కింద జిల్లాకు కొన్ని కార్డులు పంపారని, దశల వారిగా మిగిలిన కార్డులు వస్తాయంటూ ఉన్నతాధికారుల కుంటిసాకులు విమర్శలకు తావిస్తున్నాయి. మిగిలిన కార్డులు జిల్లాకు ఎప్పడు వస్తాయో..? ఎప్పటిలోగా లబ్ధిదారులకు అందిస్తారో అధికారులకే తెలియని దుస్థితి నెలకొంది. ఇదిలాఉంటే జిల్లాలో 1.59 లక్షల కార్డులపై అనర్హత వేటు వేసి వారికి రేషన్‌ సరుకులు దూరం చేశారు.


ఆరు నియోజకవర్గాలకే కార్డులు

జిల్లాలో 10.60 లక్షల కార్డుదారులను బియ్యం కార్డులకు అర్హులుగా తేల్చారు. వీటిలో శనివారం తొలి రోజు 1468 బియ్యం కార్డులు జిల్లాకు పంపారు. అందులోనూ రాప్తాడు, హిందూపురం, మడకశిర, తాడిపత్రి, పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాలకు మాత్రమే కార్డులు పంపడం గమనార్హం. మిగిలిన నియోజకవర్గాలకు చెందిన మండలాలకు ఒక్క కార్డు కూడా పంపకపోవడం విడ్డూరం. తొలి రోజు ఆరు నియోజకవర్గాల పరిధిలో వచ్చిన కార్డులను పంపిణీ చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తమకెప్పుడు బియ్యం కార్డులు ఇస్తారని ప్రశ్నించగా... త్వరలో వస్తాయంటూ ఉచిత సలహాతో మిన్నకుండిపోవడం కనిపించింది. 


సాంకేతిక సమస్యలతో ప్రింటింగ్‌ జాప్యం   

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విజయవాడలో బియ్యం కార్డుల ప్రింటింగ్‌  చేస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి మూడు రోజుల క్రితం నలుగురు సీఎ్‌సడీటీలను బియ్యం కార్డులు తీసుకొచ్చేందుకు పంపారు. అయితే పలు రకాల సాంకేతిక సమస్యలతో ప్రింటింగ్‌ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. రెండు రోజుల క్రితమే జిల్లాకు వంద శాతం కొత్త బియ్యం కార్డులు వస్తాయని అందరూ ఆశించారు. అయితే శనివారం సాయంత్రానికి కేవలం వందల్లోనే కార్డులు పంపడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. సంబంధిత రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపంతో ఆశించిన స్థాయిలో ప్రింటింగ్‌ ప్రక్రియ ముందుకు సాగడం లేదన్న విమర్శలున్నాయి. 


వేటుపడిన కార్డులపై పునఃపరిశీలన ఏదీ?

జిల్లా వ్యాప్తంగా 12.19 లక్షల రేషన్‌కార్డులున్నాయి. వాటిలో 10.60 లక్షల కార్డుదారులను బియ్యం కార్డులకు అర్హులుగా తేల్చారు. మిగిలిన 1.59 లక్షల మందిని అనర్హత జాబితాలో చేర్చారు. అనర్హత జాబితాలోని లబ్ధిదారులతో మరో మారు దరఖాస్తులు స్వీకరించి పునఃపరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే జిల్లాలో ఆశించిన స్థాయిలో పునఃపరిశీలన జరగలేదన్న విమర్శలున్నాయి. తద్వారా అర్హులైన లబ్ధిదారులు బియ్యం కార్డులకు దూరమయ్యే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో బాధిత వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.


బియ్యం కార్డులకు నిబంధనలివీ...

బియ్యం కార్డుల జారీకి ప్రభుత్వం కొత్త నిబంఽధనలు విధించింది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, అర్బన్‌ ప్రాంతాల్లో రూ.12 వేలు ఆదాయం మించకూడదని షరతు విధించారు. కుటుంబ సభ్యులకు పదెకరాల్లోపు భూమి ఉండాలి. ఆరు నెలల సరాసరి నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగం మించరాదు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు బియ్యం కార్డుకు అర్హులు కాదు. సొంత నాలుగు చక్రాల వాహనం కలిగిన వ్యక్తులు అనర్హులవుతారు. అయితే 4 చక్రాల ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపునిచ్చారు. ఆయా నిబంధనల మేరకు అన్నీ సవ్యంగా ఉన్నా అనర్హత జాబితాలో ఉంచడంపై బాధిత వర్గాలు గగ్గోలు పెడుతున్నారు. అభ్యంతరాలు ఇచ్చినా తమ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించినా.. కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తులు స్వీకరించలేదు. కొత్త కార్డుల పంపిణీ పూర్తైన తర్వాతనే కొత్త బియ్యం కార్డులు, చేర్పులు, మార్పుల కోసం దరఖాస్తులు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. దీంతో చేసిందేమి లేక లబ్ధిదారులు నిరాశతో వెనుతిరుగుతున్నారు.


అర్హులందరికి బియ్యం కార్డుల పంపిణీ ..శివశంకర్‌రెడ్డి, డీఎ్‌సఓ 

జిల్లాలోని అర్హులందరికి కొత్త బియ్యం కార్డులు పంపిణీ చేస్తాం. తొలి రోజు ట్రైల్‌ రన్‌ కింద కొన్ని కార్డులు పంపిణీ చేశాం. దశల వారిగా మిగిలిన కార్డులు పంపిస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. జిల్లాకు కార్డులు రాగానే గ్రామ సచివాలయాలకు పంపించి, నేరుగా లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2020-02-16T09:38:46+05:30 IST