రాజకీయ స్వార్థంతోనే రిజర్వాయర్ పేరు మార్పు
ABN , First Publish Date - 2020-12-13T06:07:23+05:30 IST
టీడీపీ హయాంలో మంజూరు చేసిన నిధులతో శిలాఫలాకాలు ఏర్పాటు చేసి, ఎత్తిపోతల పథకం పేరు మార్చి, గొప్పలు చెప్పుకోవడం తగదని వైసీపీ పాలకులపై సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే
శిలాఫలకాలు వేసి, గొప్పలా..!
భూసేకరణ లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా సాధ్యం?
సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ధ్వజం
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు 12: టీడీపీ హయాంలో మంజూరు చేసిన నిధులతో శిలాఫలాకాలు ఏర్పాటు చేసి, ఎత్తిపోతల పథకం పేరు మార్చి, గొప్పలు చెప్పుకోవడం తగదని వైసీపీ పాలకులపై సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ హయాంలో రాప్తాడు నియోజకవర్గంలో పుట్టకనుమ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. ప్రస్తుత వైసీపీ పాలకులు ఆ రిజర్వాయర్‌ను రద్దు చేసి, ఆ నిధులతోనే మూడు రిజర్వాయర్ల నిర్మాణాలకు శిలాఫలకాలు, శంకుస్థాపన చేశారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్, మంత్రులు గొప్పలు చెప్పుకోవటం సరికాదన్నారు. భూసేకరణ చేయకండా, నిధు లు, నీటి నిల్వపై ప్రణాళికలు లేకుండా హడావుడిగా శిలాఫలకాలు వేసి, రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చిందో మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హంద్రీనీవా కాలవ కింద మిగులు జలాలను కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు పంపిణీ చేశారన్నారు. ప్రస్తుతం ప్రారంభిస్తున్న మూడు రిజర్వాయర్లకు 7 టీఎంసీల నీరు అదనంగా కావాలనీ, దానిని ఎక్కడి నుంచి తెస్తారో సీఎం జగన్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డే సమాధానం చెప్పాలన్నారు. కమ్యూనిస్టు నాయకులు ముత్యాలప్ప, పరిటాల శ్రీరాములు, కదిరి రవూఫ్, వీకే ఆదినారాయణరెడ్డి చేపట్టిన పోరాటాలతోనే పేరూరు ప్రాజెక్ట్ నిర్మించారన్నారు. నేడు రాజకీయ ప్రయోజనాల కోసం పరిటాల రవీంద్ర పేరు తీసివేసి, వైఎస్సార్ అని పెట్టడం మంచిదికాదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్, నారాయణస్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గసభ్యుడు లింగమయ్య, నగర సహాయ కార్యదర్శి రమణ పాల్గొన్నారు.