రెన్యువల్‌ కష్టాలు

ABN , First Publish Date - 2020-05-08T07:51:39+05:30 IST

కరువు రైతుకు రెన్యువల్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రతి ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్లల్లో భూమి విస్తీర్ణం, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా కొత్త పంట రుణాల మంజూరు, రెన్యువల్‌ చేస్తున్నారు.

రెన్యువల్‌ కష్టాలు

రుణ లక్ష్యాలు నిర్దేశించకపోయినా మంజూరు 

బ్యాంకుల వద్ద అన్నదాతల పాట్లు 

మహిళలు, వృద్ధులకు తప్పని ఇక్కట్లు 

గ్రామాల వారిగా షెడ్యూల్‌ ప్రకటించని వైనం 

ఒకేసారి ఎక్కువ మంది రావడంతో ఇబ్బందులు 

కరోనా నేపథ్యంలో రోజుకు 30 మందికి మాత్రమే... 


అనంతపురం వ్యవసాయం, మే 7 : కరువు రైతుకు రెన్యువల్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రతి ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్లల్లో భూమి విస్తీర్ణం, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా కొత్త పంట రుణాల మంజూరు, రెన్యువల్‌ చేస్తున్నారు. ఈ సారి ఖరీఫ్‌ సీజన్‌ రెన్యువల్‌ ఎట్టకేలకు ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఏప్రిల్‌ మొదటి వారం నుంచే ప్రక్రియ మొదలయ్యేది. ఈ ఏడాది కరోనా ప్రభావంతో బ్యాంక్‌లు అరకొరగా పనిచేశాయి. గత ఏడాది పంట రుణం మంజూరు చేసిన తేదీలోపు రెన్యువల్‌ చేయించుకోవాలి. లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్‌ నెలలో రెన్యువల్‌ చేసుకోవాల్సిన రైతులు మే నెలాఖరులోగా చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ పరిస్థితుల్లో ఈ నెలారంభం నుంచి పంట రుణాల రెన్యువల్‌ కోసం రైతులు బ్యాంక్‌ల వద్ద క్యూకడుతున్నారు. బ్యాంకర్ల ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడంతో పంట రుణాల రెన్యువల్‌ కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


 471 బ్యాంకు శాఖల్లో సేవలు

జిల్లావ్యాప్తంగా 32 ప్రధాన బ్యాంకులు ఉండగా, వాటి పరిధిలో 471 బ్రాంచ్‌ కార్యాలయాలున్నాయి. అందులో అర్బన్‌ ప్రాంతాల్లో 159 బ్రాంచ్‌లు, మండల స్థాయిలో (సెమీ అర్బన్‌) 134 బ్రాంచ్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో 179 బ్రాంచ్‌లు నడుస్తున్నాయి. పంట రుణాల్లో 90 శాతం వరకు రూరల్‌, సెమీ అర్బన్‌ బ్రాంచ్‌ల ద్వారా అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ పరిధిలో 119 బ్రాంచ్‌లుండగా, 19 బ్రాంచ్‌లు అర్బన్‌లో ఉన్నాయి. మిగిలివన్నీ రూరల్‌లో నడుస్తున్నాయి. ఎస్‌బీఐ పరిధిలో 82 బ్రాంచ్‌లుండగా, అర్బన్‌ పరిధిలో 32 ఉన్నాయి. మిగిలినవన్నీ రూరల్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఏపీజీబీ, ఎస్‌బీఐల ద్వారా ఎక్కువ శాతం పంట రుణాలు మంజూరు చేస్తున్నారు. ఆ తర్వాత సిండికేట్‌, కెనరా, ఆంధ్రాబ్యాంక్‌, డీసీసీబీ, కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంకుల్లో పంట రుణాలు మంజూరు చేస్తున్నారు. 


టార్గెట్లు ఇవ్వకపోయినా రుణాల మంజూరు 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా టార్గెట్లు ఇవ్వకపోయినా పంట రుణాల మంజూరు ప్రక్రియను బ్యాంకర్లు మొదలుపెట్టారు. గతేడాది ఖరీఫ్‌, రబీ సీజన్లకు రూ.7733 కోట్ల పంట రుణాల మంజూరు లక్ష్యం విధించగా, 5.68 లక్షల మంది రైతులకు రూ.8014 కోట్లు మంజూరు చేశారు. ఇందులో ఖరీఫ్‌ సీజన్‌లో రూ.6943 కోట్లు, రబీలో రూ.1071 కోట్లు పంట రుణాలు మంజూరు చేశారు.  ఈసారి కరోనా ప్రభావంతో ఇప్పటిదాకా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించలేకపోయారు. మరో ఐదు రోజుల్లో రాష్ట్రస్థాయిలో సమావేశం జరపనున్నట్లు సమాచారం. ఆ తర్వాత జిల్లాలో పంట రుణాల మంజూరు ప్రణాళికలు విడుదల చేయనున్నట్లు బ్యాంకర్లు పేర్కొంటున్నారు. పంట రుణాల టార్గెట్‌  ఇవ్వకపోయినా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఖరారుతో ఆ మేరకు పంట రుణాలు రెన్యువల్‌ చేసి కొత్త రుణాలు మంజూరు చేస్తున్నారు. 


బ్యాంకుల వద్ద రైతుల అగచాట్లు 

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బ్యాంకులు రోజుకు 30 మందికి రెన్యువల్‌ చేస్తున్నారు. ముందస్తుగా షెడ్యూల్‌ ప్రకటించిన బ్యాంకుల వద్దకు ఆయా గ్రామాల రైతులు తెల్లవారుజామునే క్యూ కడుతున్నారు. కొందరు రైతులు క్యూలైన్‌లో గంటల తరబడి నిల్చోలేక చేతిసంచి, పట్టాదారు పుస్తకాలు, చెప్పులను వంతులకు గుర్తుగా ఉంచుతున్నారు. అయితే ముందుగా క్యూలైన్‌లో ఉన్న వారిలో 30 మందికే టోకన్లు ఇస్తున్నారు. దీంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుతిరిగి వెళుతున్నారు. మరోవైపు షెడ్యూల్‌ ప్రకటించని బ్యాంకుల వద్ద పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఒకే రోజు పలు గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు రావడంతో ఆయా బ్యాంక్‌ల వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు పడరాని పాట్లుపడుతున్నారు. మహిళా రైతులు, వృద్ధు పరిస్థితి మరీ దయనీయంగా మారింది.  


ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం 

జిల్లాలోని బ్యాంకుల్లో నెలకొన్న లోపాలను గుర్తించి, పరిష్కరించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. కరోనా నేపథ్యంలో మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆ దిశగా ఆలోచించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పంట రుణాల రెన్యువల్‌లో రైతుల ఇబ్బందులు గుర్తించి పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది. కలెక్టర్‌ జోక్యం చేసుకుంటే తప్పా రైతులకు ఇబ్బందులు తప్పే పరిస్థితి లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


వడ్డీమాత్రం కట్టించుకుంటే బాగుంటుంది - మల్లికార్జున, రైతు, కళేకుర్తి 

ఖరీఫ్‌ సీజన్‌లో రైతన్నలకు సరియైున పంటలు పండని పరిస్థితి ఉండగా మరో వైపు కరోనా వైరస్‌ ప్రబలి నెలన్నర రోజులుగా ఎలాంటి ఆదాయం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి సమయంలో బ్యాంకులు సైతం గోరుచుట్టపై రోకలిపోటు అన్నట్లుగా కేవలం వడ్డీ కట్టించుకునే పరిస్థితి ఉన్నా కూడా తీసుకున్న రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ రెండు కట్టాలని కరాఖండిగా చెబుతుండటంతో బయటి వ్యక్తులతో రూ. 3 మేర వడ్డీ చెల్లించి సొమ్మును మళ్లీ అప్పుగా తెస్తూ బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

Updated Date - 2020-05-08T07:51:39+05:30 IST