స్పందించని ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-12-05T06:39:36+05:30 IST
పట్టు రీలర్ల సమ్మె పై ప్రభుత్వం స్పందించట్లేదు. ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో సమ్మె కొనసాగిస్తున్నారు. దీని ప్రభావం పట్టు రైతులపై పడింది. రీలర్ల సమ్మెతో జిల్లాలో పట్టుగూళ్ల మార్కెట్లు మూతపడ్డాయి. దీంతో పట్టుగూళ్లను విక్రయించేందుకు రీలర్లు నానాతంటాలు పడాల్సి వస్తోంది. కర్ణాటక మార్కెట్లకు తీసుకెళ్లటంతో అక్కడ ధర లు మరింత పడిపోతున్నాయి.

కొనసాగుతున్న రీలర్ల సమ్మె
కర్ణాటకలో మరింత
పడిపోయిన పట్టుగూళ్ల ధరలు
రైతుల్లో ఆందోళన
హిందూపురం, డిసెంబరు 4: పట్టు రీలర్ల సమ్మె పై ప్రభుత్వం స్పందించట్లేదు. ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో సమ్మె కొనసాగిస్తున్నారు. దీని ప్రభావం పట్టు రైతులపై పడింది. రీలర్ల సమ్మెతో జిల్లాలో పట్టుగూళ్ల మార్కెట్లు మూతపడ్డాయి. దీంతో పట్టుగూళ్లను విక్రయించేందుకు రీలర్లు నానాతంటాలు పడాల్సి వస్తోంది. కర్ణాటక మార్కెట్లకు తీసుకెళ్లటంతో అక్కడ ధర లు మరింత పడిపోతున్నాయి. వ్యాపారుల చేతిలో సైతం మోసపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గూళ్లను కర్ణాటకకు తీసుకెళ్లటానికి అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏడు నెలల ప్రోత్సాహకం ఇవ్వటంతోపాటు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పట్టు రీలర్లు గత నెల 26వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. రీలర్లు సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వం మెట్టు దిగిరాకపోవడం, రీలర్లు సమ్మె విరమించకపోవటంతో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.
కర్ణాటకలో తగ్గిన పట్టుగూళ్ల ధరలు
జిల్లాలో హిందూపురం, ధర్మవరం, కదిరి పట్టుగూళ్ల మార్కెట్లలో కొనుగోళ్ల బంద్‌తో రైతులు గూళ్లను కర్ణాటకకు తీసుకెళ్లి, విక్రయించాల్సి వస్తోంది. హిందూపురం మార్కెట్‌కు సగటున 5 నుంచి 8 టన్నుల వరకు గూళ్లను తీసుకొస్తున్నారు. రీలర్ల సమ్మెతో బైవోల్టీన్, సీబీ పట్టుగూళ్లను విక్రయించాలంటే కర్ణాటకలోని రాంనగర్, శిట్లఘట్ట, చిక్బళ్ళాపురం వెళ్లాల్సి వస్తోంది. తొమ్మిది రోజులుగా భారీగా గూళ్లను కర్ణాటక మార్కెట్‌కు తీసుకెళ్తుండటంతో అక్కడ ధరలు భారీగా తగ్గించినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. శిట్లఘట్టలో సీబీ రకం కిలో రూ.190 నుంచి 220లోపు పలకగా.. రాంనగర్లో బైవోల్టీన్ రకం కనిష్టంగా రూ.158, గరిష్టంగా రూ.400, సగటున రూ.310లోపే పలికినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. పైగా కిలోపై రూ.20 అదనపు రవాణా ఖర్చులుపోను గిట్టుబాటు కావట్లేదంటున్నారు. శుక్రవారం రోజే రాంనగర్‌కు 16, శిట్లఘట్టకు 20 టన్నులకుపైగా గూళ్లు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇందులో 10 టన్నులకుపైగా అనంత జిల్లా నుంచి వచ్చినవేనని చెబుతున్నారు. రీలర్ల సమ్మెకు ముందు హిందూపురం మార్కెట్లో బైవోల్టీన్ రకం గూళ్లు కిలో సగటున రూ.350 వరకు ధరలు పలికేవి. కర్ణాటక మార్కెట్లలో కిలోపై రూ.100 వరకు తగ్గించినట్లు రైతులు వాపోతున్నారు. పైగా బైవోల్టీన్ గూళ్లకు కిలోపై ప్రభుత్వం ఇచ్చే రూ.50 ప్రోత్సాహకం కోల్పోవాల్సి వస్తోందని చెబుతున్నారు.