కేంద్రం తీరుపై నేటి నుంచి నిరసనలు
ABN , First Publish Date - 2020-09-18T11:01:24+05:30 IST
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై శుక్రవారం నుంచి నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా ఉ త్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్ పేర్కొన్నారు.

సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్
అనంతపురం టౌన్, సెప్టెంబరు 17: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై శుక్రవారం నుంచి నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా ఉ త్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్ పేర్కొన్నారు. గురువారం స్థానిక గణేనాయక్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మూడు ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చిందన్నారు. బ్లాక్ మార్కెట్దారులకు దోచిపెట్టేలా, కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా అవి ఉన్నాయన్నారు.
దేశంలో 62 శాతం మందికి ఆధారమైన వ్యవసాయ రంగంలో తెచ్చే చట్టాలపై పార్లమెంటులో చర్చకు అవకాశం లేకుండా కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కరోనాను బూచిగా చూపి దొడ్డిదారిలో చట్టాలు తీసుకొచ్చి, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించి వేస్తోందని దుయ్యబట్టారు. ఈ విధానాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు ఈనెల 21వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు.
అందులో భాగంగా తొలిరోజు శుక్రవారం రైతులకు పంట నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపడతామన్నారు. సమావేశంలో సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.