అనంత ఆస్పత్రిలో అలజడి
ABN , First Publish Date - 2020-04-05T10:31:58+05:30 IST
కరోనా అనుమానితుడిగా చేరిన వ్యక్తి..

కరోనా అనుమానితుడిగా చేరిన పురంవాసి మృతి
పాజిటివ్ వచ్చిందని ప్రచారం
అధికారులు మౌన ముద్ర
ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిలో టెన్షన్
ఇతర రోగులు భయంతో డిశ్చార్జ్
అనంతపురం(ఆంధ్రజ్యోతి): కరోనా అనుమానితుడిగా చేరిన వ్యక్తి మృతి చెందడంతో జిల్లా ఆస్పత్రిలో శనివారం అలజడి రేగింది. మృతుడికి పాజిటివ్ వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అధికారులు మాత్రం ఆ వ్యక్తి మృతిపై నోరు మెదపడం లేదు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆస్పత్రిలో కరోనా అనుమానితుడు మృతితో ఆందోళన మొదలైంది. మూడ్రోజుల పాటు ఆ వ్యక్తికి వైద్యసేవలు అందించిన వైద్యులు, సిబ్బంది టెన్షన్ పడుతున్నారు. కరోనా అనుమానితుడు మృతి చెందాడనే సమాచారంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు భయపడిపోతున్నారు. వివిధ వ్యాధులతో అడ్మిషన్‌లో ఉన్న పలువురు రోగులు డిశ్చార్జ్ చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు.
హిందూపురానికి చెందిన 55 సంవత్సరాల వయస్సు గల ఓ వ్యక్తి కరోనా అనుమానిత లక్షణాలతో మార్చి 31న జిల్లా ఆస్పత్రికి వచ్చారు. తొలి రెండ్రోజులు సాధారణ అనుమానితుడిగా ఆ వ్యక్తిని పరిగణించి వైద్యులు అలసత్వం వహించినట్టు తెలిసింది. ఏప్రిల్ 1వ తేదీన ఆ వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆ రోజు రాత్రి కరోనా ప్రత్యేక ఐసీయూ విభాగానికి తరలించారు. 2వ తేదీ మధ్యాహ్నం ఆ వ్యక్తికి శాంపిల్స్ తీసి వ్యాధి నిర్ధారణకు పంపించారు. శుక్రవారం రాత్రి ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయినా అధికారులు పాజిటివ్ కేసు వివరాలు వెల్లడించలేదని చర్చించుకుంటున్నారు.
శుక్రవారం రాత్రి ఆ వ్యక్తి పరిస్థితి విషమించింది. వైద్యులు సైతం దగ్గరకు వెళ్లి వైద్యసేవలు అందించడానికి వెనుకాడినట్లు సమాచారం. దీంతో శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన మరణించాడు. ఇది దావానలంలా వ్యాపించింది. అయితే ఆస్పత్రి వైద్యాధికారులు ఈ విషయంపై నోరు మెదపలేదు. కొందరు మాత్రం గుట్టుగా పాజిటివ్ విషయం వాస్తవమే... అయితే ఆ విషయం మేము చెప్పకూడదంటూ తప్పించుకున్నారు. చివరకు మీడియాకు కూడా కలెక్టర్‌గానీ, డీఎంహెచ్‌ఓ గానీ, సూపరింటెండెంట్‌గానీ ఆ వ్యక్తిమృతిపై వివరాలు వెల్లడించలేదు. పీపీఈ కిట్లు ధరించి ఆ శవాన్ని హిందూపురానికి తరలించారు.
చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందిలో టెన్షన్
కరోనా అనుమానితుడిగా ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి నాలుగు రోజుల పాటు వైద్యులు, సిబ్బంది చికిత్సలు అందించారు. దాదాపు 8 మంది ఈ చికిత్సలలో పాల్గొన్నారు. కరోనా అనుమానితుడు మరణించడంపై వారిలో ఆందోళన మొదలైంది. కరోనా అనుమానితుడు మరణించాడని తెలిసిన వెంటనే ఆస్పత్రి వైద్యాధికారులు అత్యవసర చికిత్సలు అందించిన వారి వివరాలను సేకరించారు. ఇందులో ఇద్దరు వైద్యులు, ఇద్దరు అనస్తీషియా టెక్నీషియన్‌లు, ముగ్గురు నర్సులు, ఒకరు ఎక్స్‌రే టెక్నీషియన్ ఉన్నారు. ఈ ఎనిమిది మందిని వెంటనే ఆస్పత్రి వైద్యాధి రులు పిలిపించి ఉదయమే ఆస్పత్రి ఆవరణలో ఉన్న సఖీ సెంటర్‌కు తరలించారు. వారందరికీ కరోనా శాంపిల్స్ తీస్తున్నట్లు తెలిపారు. అయితే ఆస్పత్రి వైద్యాధికారులు మళ్లీ ఏమి ఆలోచించారో తెలియదుగానీ టిఫెన్ పెట్టి 11 గంటలకల్లా మీకు ఏమీ లేదు. ఇళ్లకు వెళ్లండి.. మళ్లీ వచ్చి డ్యూటీలు చేసుకోండని సూచించి పంపించేశారని తెలిసింది.
దీంతో ఆ ఎనిమిది మంది ఒక్కసారిగా టెన్షన్ పడి అధికారుల తీరుపై పెదవి విరిచినట్లు సమాచారం. కనీసం మాకు పరీక్షలు చేయలేదు. మా ఆరోగ్య పరిస్థితి ఏంటీ ? ఇళ్లల్లో ఉన్న కుటుంబసభ్యులకు భరోసా ఎలా కల్పించాలి అంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారని తెలిసింది. పైగా ఆస్పత్రిలో ఆ ఎనిమిది మందిని చూస్తేనే ఇతర వైద్యులు, సిబ్బంది భయపడి దూరంగా వెళ్లిపోతున్నారని దీంతో చికిత్సలు అందించిన వారు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మూడు పాజిటివ్ కేసులుగా ప్రకటన
రాష్ట్ర నోడల్ అధికారి అనంత జిల్లాలో కరోనా పాజిటివ్‌కేసులు మూడుకు చేరాయని శనివారం ప్రకటించారు. డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్ మాట్లాడుతూ హిందూపురానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని స్పష్టం చేశారు. అదికూడా మక్కాకు వెళ్లివచ్చిన వారితో దగ్గరగా ఉండటం వల్లనే ఆ వృద్ధుడికి కరోనా సోకిందని తెలిపారు. ఇదిలా ఉండగా.... జిల్లాలో ఈ కేసుతో కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరాయి. మరోవైపు కరోనా తొలి మరణం కావడంతో జిల్లాలో తీవ్ర అలజడి మొదలైంది.