ముంచుతున్న అలసత్వం

ABN , First Publish Date - 2020-04-24T10:09:55+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. నెల రోజుల్లోనే 42 పాజిటివ్‌ కేసులు

ముంచుతున్న అలసత్వం

ప్రజల్లో కొరవడుతున్న అప్రమత్తత

కరోనా విస్తరిస్తున్నా కానరాని మార్పు 

హిందూపురం చుట్టూ పాజిటివ్‌ కేసులు 

అనంతలో కనిపించని భౌతికదూరం

మాస్క్‌లు లేకుండా జనసంచారం

రోడ్లపై పెరుగుతున్న వాహనాల సంఖ్య

గాంధీ బజారులో జనజాతరే


అనంతపురం, ఏప్రిల్‌23(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా  వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. నెల రోజుల్లోనే 42 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే వైరస్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అయి తే ప్రజలు మాత్రం అప్రమత్తంగా వ్యవహరించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లం ఘిస్తున్నారు. ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వస్తున్నారు. కనీసం మాస్క్‌లు ధరించడం లేదు. బయటికి వచ్చినా భౌతిక దూరాన్ని పాటించడం లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై  పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా, వాహనా లను సీజ్‌ చేసి జరిమానాలు విధిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు.  కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తికి కారకులవుతున్నారన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. అందులో అనంతపురం, హిందూపురం ప్రభు త్వాస్పత్రుల బాధ్యులు అగ్రభాగాన ఉన్నారన్న ఆరోపణ లు ఉన్నాయి. ఆ పర్యవసానమే జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడానికి ప్రధాన కారణమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం, అధికారులు కరోనా బాధితులకు వైద్యం అందించే వైద్యులు, సిబ్బందికి రక్షణ పరికరాలు అందించకపోవడంతో చివరికి ఆ వర్గాలే కరో నా బారిన పడాల్సి వచ్చింది. తొలుత చేసిన తప్పిదాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. తాజాగా గురువారం నగ రంలోని 6వ రోడ్డుకు చెందిన ఒకరికి(వైద్యశాఖ)కి  కరోనా లక్షణాలు బయటపడటమే ఇందుకు నిదర్శనం. 


హిందూపురాన్ని చుట్టుముట్టిన పాజిటివ్‌ కేసులు

 హిందూపురాన్ని కరోనా చుట్టుముట్టింది. జిల్లాలో నమోదైన 42 కేసుల్లో 25  ఆ పట్టణంలోనే నమోద య్యాయి. ప్రస్తుతం హిందూపురం మున్సిపాలిటీ అంతా రెడ్‌జోన్‌ పరిధిలో ఉంది. రోజుమారితే ఎవరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అవుతుందోనన్న అభద్రతాభావం అక్క డి ప్రజలను వెంటాడుతోంది.  హాట్‌స్పాట్‌గా గుర్తించిన హిందూపురం మున్సిపాలిటీలోని ప్రజలకు ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించడంతోనే అక్కడ కరోనా కట్టడికి బీజం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెస్టిం గ్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పుకుంటున్నా పరీక్షలు నిర్వహించడంలో జాప్యం ఎందుకు జరుగుతుం దో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇప్పటికే ఆ ప్రాంతంలో మరిన్ని పాజిటివ్‌ కేసులు ఉన్నాయన్న ప్రచారం జరుగు తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసే దిశగా అధికా రులు చర్యలు తీసుకోవడం లేదు.    


అనంతలో చాపకింద నీరులా..

జిల్లా కేంద్రంలోనూ చాపకింద నీరులా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వేది కగా జిల్లా కేంద్రంలో పాజిటివ్‌ కేసుల పరంపర ప్రారం భమైంది. ముందుగా వైద్యులు, నర్సులకు కరోనా సోకింది. ఆ తరువాత హిందూపురం ప్రాంతాలకు చెందిన పాజి టివ్‌ కేసుల వ్యక్తులకు వైద్యసేవలందించినందుకు మరి కొందరు కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలు నిర్వ హించే ల్యాబ్‌లో పనిచేసే వైద్యులకు సైతం మహమ్మారి సోకింది. జిల్లా కేంద్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం వైద్య రంగానికి చెందినవారే ఉండటం గమనార్హం.   ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రభుత్వ సర్వజనా స్పత్రిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  


లాక్‌డౌన్‌ అమలులో ఉల్లంఘనలు

జిల్లాలో లాక్‌డౌన్‌ అమలు ప్రారంభమై నెల గడిచింది. అయినా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు సంపూర్ణంగా అమలు కావడం లేదు. ప్రతి రోజూ రోడ్లపైకి జనం వ స్తూనే ఉన్నారు. తొలినాళ్లలో మోటారు బైకులే రోడ్లమీద తిరిగేవి. ప్రస్తుతం కార్లు సైతం రోడ్లపైన పరుగులు పెడుతున్నాయి. జనసంచారం పెరుగుతోంది. మాంసం మార్కెట్‌లు, కూరగాయల కొట్లు, నిత్యావసర దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడా భౌతిక దూరం పాటించడం లేదు. దీనికి తోడు ఆయా దుకాణాల దగ్గరకు వచ్చిన సందర్భాల్లో అత్యధికులు మాస్క్‌లు ధరించడం లేదు. ప్రజలే కాదు ప్రజాప్రతినిధులు సైతం లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. గురువారం అనంతపురంలోని ప్రధాన రోడ్లపై వందలాది బైకులు రాక పోకలు సాగాయి.


గాంధీ రోడ్డులో జనసంచారాన్ని చూస్తే కరోనా వైరస్‌ కట్టడి సాధ్యమా అన్న అభిప్రాయం ఎవ రికైనా కలుగక మానదు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే అనే నిబంధనలు ఉన్నా ఆ తరువాత కూ డా యథేచ్ఛగా జనం తిరుగుతున్నారు. జిల్లాలోని హిం దూపురం మినహా తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ధర్మవరం, కదిరి మున్సిపాలిటీలతో పాటు చివరికి మండల కేంద్రాల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. ఆయా మున్సిపాలిటీలు, మండలకేంద్రాల్లోనూ కొన్ని మా ర్కెట్‌లు, దుకాణాల వద్ద భౌతిక దూరాన్ని పాటించడం లేదు. అనంతపురం, హిందూపురం రెడ్‌జోన్‌లలో మాత్రం మూడ్రోజులుగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడంతో నిబంధనలు అమలవుతున్నాయి.  పోలీసులు వచ్చిన సందర్భాల్లో మాత్రమే ప్రజలు సందులు, గొందుల్లో తప్పించుకుని వెళ్లిపోతున్నారు. వారు అలా వెళ్లగానే తిరిగి మామూలుగానే వ్యవహరిస్తున్నారు. 

Updated Date - 2020-04-24T10:09:55+05:30 IST