సొంతింటి ఆశలు గల్లంతేనా..? అర్ధాంతరంగా ఆగిన పీఎంఏవై ఇళ్ల నిర్మాణం..

ABN , First Publish Date - 2020-06-25T20:50:48+05:30 IST

అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్న సగటు నగరవాసి సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. వారి గూడు ఆశలు అడియాసలయ్యాయి. జిల్లాకేంద్రంలో నేటికీ సొంతిల్లు లేని పేదలెందరో ఉన్నారు. ఆరేళ్ల క్రితం

సొంతింటి ఆశలు గల్లంతేనా..? అర్ధాంతరంగా ఆగిన పీఎంఏవై ఇళ్ల నిర్మాణం..

ఏడాదైనా అతీగతీలేని వైనం..

ప్రభుత్వ నిర్ణయంతో నిలిచిపోయిన పనులు..

6 వేల మంది లబ్ధిదారుల్లో ఆందోళన..

ఇల్లూ కట్టలేదు.. డీడీలూ వెనక్కివ్వలేదు..

ఇళ్ల స్థలాల జాబితాలోనూ మొండిచేయి..

స్పష్టత ఇవ్వని పాలకులు, అధికారులు..


అనంతపురం (ఆంధ్రజ్యోతి): అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్న సగటు నగరవాసి సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. వారి గూడు ఆశలు అడియాసలయ్యాయి. జిల్లాకేంద్రంలో నేటికీ సొంతిల్లు లేని పేదలెందరో ఉన్నారు. ఆరేళ్ల క్రితం వేల మందికి ఆ సమస్య తీరేలా కనిపించింది. పాలకపక్షం మారటంతో వారందరి ఆశలు అడియాసలయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయం పేదలకు తీవ్ర ఆవేదన మిగిల్చిందనే విమర్శలు లేకపోలేదు. ప్రారంభమే కాని, 25 శాతం కూడా పూర్తికాని పనులన్నింటినీ నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించటంతో ఒక్కసారిగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. 2014లో పట్టణ పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇళ్లు నిర్మించి, ఇచ్చే పథకం ప్రారంభించాయి. 


స్థలం కూడా ప్రభుత్వమే ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది ఆ పథకం లక్ష్యం. ఆ మేరకు నగర పాలక సంస్థ పరిధిలో వేల సంఖ్యలో పేదలు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులను తేల్చి, తుది జాబితాను సిద్ధం చేశారు. ఇళ్ల నిర్మాణాలకు స్థలాన్ని అన్వేషించటానికి సమయం పట్టింది. ఎట్టకేలకు 2016లో స్థల సేకరణ చేశారు. ఆ మేరకు నగర శివారులోని పండమేరు వద్ద దాదాపు 66 ఎకరాలు స్థలం కూడా సిద్ధమైంది. అనుమతులు, ఇతరత్రా విషయాలతో ఆలస్యమై పనులు ప్రారంభం కావటానికి ఎక్కువ సమయం తీసుకుంది. ఆ తరువాత లబ్ధిదారులు డీడీలు కూడా చెల్లించారు. ఏపీ టిడ్‌కో ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మూడేళ్ల్లయినా ఇప్పటివరకు వాటిలో ఏ ఒక్కరూ చేరింది లేదు. మరో ఏడాదిలోనైనా సొంతింట్లో చేరతామనే ఆశ నెరవేరకుండా పోయింది. ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ చేయాలనే ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలిసింది. ఎట్టకేలకు ఇళ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోవటంతో లబ్ధిదారుల్లో నిరాశ మిగిలింది.


6 వేల మందిలో ఆందోళన

సొంతింటి కల నెరవేరక వేలాది మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్లయినా ఇల్లు పూర్తికాకపోవటానికి తోడు.. ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాణాలు ఆగిపోవటంతో వారి ఆవేదన రెట్టింపయింది. 430 చదరపు అడుగుల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌కు రూ.లక్షకుగాను ఇంటి నిర్మాణం పూర్తయ్యేలోపు రూ.25 వేల చొప్పున నాలుగు సార్లు  చెల్లించాలి. ఇందుకు బ్యాంకు రుణం రూ.3.65 లక్షలు. 365 చదరపు అడుగు ల్లో సింగిల్‌ బెడ్‌ రూమ్‌కు రూ.50 వేలకు రూ.12500 చొప్పున నాలుగుసార్లు చెల్లించాలి. దీనికి బ్యాంకు రుణం రూ.3.15 లక్షలు. 300 చదరపు అడుగుల్లో గది నిర్మాణానికి రూ.500 ఒకేసారి డీడీ చెల్లిస్తే సరిపోతుంది. దీనికి బ్యాంకు రుణం రూ.2.65 లక్షలు. ఇంటి నిర్మాణం ఫూర్తయి, అం దులో చేరిన తరువాత ప్రతినెలా కొంత మొత్తం చెల్లించాలి. ఈ విధానంలో తొలుత 4400 మంది వరకు డీడీలు చెల్లించారు. తరువాత మరికొంతమంది లబ్ధిదారులను జాబితాలో చేర్చారు. అలా మొత్తం 6 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందరూ డీడీలు కట్టారు. కొందరు రెండో విడత డీడీ కూడా చెల్లించారు. ఇప్పుడు వారిలో ఆందోళన అధికమవుతోంది. ఇళ్లు కట్టివ్వలేదు, డీడీలు వెనక్కివ్వలేదని వాపోతున్నారు.


స్పష్టత ఇవ్వలేరా?

ఇళ్ల నిర్మాణంపై స్పష్టత లేదు. మొదలెడతారో.. లేదో.. తెలీదు. ప్రారంభించకపోతే డీడీలు వెనక్కిస్తారా? అన్న దానికీ సమాధానమిచ్చేవారు లేరు. ఇలా అనేక సందేహాలు లబ్ధిదారులను పట్టిపీడిస్తున్నాయి. దీనిపై పాలకులు, అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతుండటం గమనార్హం. నిర్మాణాలు ఆగినప్పట్నుంచి ఇప్పటి వరకు డీడీలు ఎక్కడున్నాయో కూడా వారికి అర్థం కాని పరిస్థితి. నగర పాలక సంస్థ అధికారులు మాత్రం ఆ డీడీలు బ్యాంకుల వద్దే ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఇళ్ల స్థలాల ఎంపిక జాబితాలోనూ తమ పేర్లను తిరస్కరిస్తున్నట్లు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఎంఏవై కింద ఆధార్‌ అనుసంధానం చేసి ఉండటంతో ఇళ్ల స్థలాల విషయంలో వారి పేర్లు తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల సిఫార్సులు, అధికారుల అండదండలతో కొందరు రెండు జాబితాల్లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. ప్ర భుత్వం ఇప్పటికైనా స్పందించి, ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని పక్షంలో లబ్ధిదారుల సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2020-06-25T20:50:48+05:30 IST