ఇష్టారాజ్యంగా జరిమానాలు

ABN , First Publish Date - 2020-04-18T10:20:08+05:30 IST

నగరంలోని తపాలశాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం ద్విచక్ర వాహనాల్లో వేర్వేరుగా వెళ్తుండగా పీటీసీ

ఇష్టారాజ్యంగా జరిమానాలు

వాహనచోదకులకు తప్పని అవస్థలు

విమర్శలకు గురవుతున్న పోలీసుల తీరు


అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 17 : 

నగరంలోని తపాలశాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం ద్విచక్ర వాహనాల్లో వేర్వేరుగా వెళ్తుండగా పీటీసీ, కోర్టు రోడ్డులో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని ఆపి నిలదీశారు. వారు తమ వద్ద ఉన్న ఐడీ కార్డులతో పాటు వాహనానికి సంబంధించిన రికార్డులు, విధి నిర్వహణకు సంబంధించిన ఆధారాలు చూపించారు. కొంత సేపటికీ  అక్కడి నుంచి పంపించారు. అయితే కొంత దూరం వెళ్లిన తరువాత వారి సెల్‌ఫోన్‌లకు జరిమానాలు విధించినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు.... విధులు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకుండా జరిమానాలు విధించడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


- నగర శివారులోని నందమూరినగర్‌కు చెందిన ఓ విద్యార్థిని రామచంద్రనగర్‌లోని చర్చిస్కూల్‌లో చదువుతోంది. లాక్‌డౌన్‌తో స్కూల్‌కు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు అందించాల్సిన పౌష్టికాహార సరుకులను అందించేందుకు ఆ పాఠశాలకు చెందిన ఉద్యోగులు విద్యార్థిని తల్లిదండ్రులకు సరుకుల కోసం సమాచారం అందించారు. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు చర్చి స్కూల్‌కు ద్విచక్ర వాహనంపై వచ్చారు. తిరుగు ప్రయాణంలో టీటీడీ కల్యాణ మండపం సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు ద్విచక్ర వాహనాన్ని ఆపారు. సార్‌... మా అమ్మాయికి సంబంధించిన సరుకులను తీసుకునేందుకు వచ్చామని ఎంతచెప్పినా వినకుండా జరిమానా విధించారు. ఇలాంటి సంఘటనలు నిత్యం జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి. దీనిపై పోలీస్‌శాఖ విమర్శలు మూటగట్టుకుంటోంది. 


నగరంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొందరు పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల అతిక్రమణ పేరుతో బయట కనిపిస్తే చాలు వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానాలతో పాటు సీజ్‌ చేస్తున్నారు. దీంతో నిత్యావసర సరుకులు, అత్యవసర పనులతో బయటకు రావాలంటే జంకాల్సిన దుస్థితి ఏర్పడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రణ పేరుతో పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. అయితే అవసరం మేరకు బయటకు వచ్చిన వాహనచోదకులపై జరిమానాలు విధించడం పలు విమర్శలకు తావిస్తోంది. బాధితుల మాట వినకుండానే కొందరు పోలీసులు అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ కోసం బయటకు వస్తుండగా జరిమానా విధించడంతో వాగ్వాదాలు జరుగుతున్నాయి.


దీంతో లాక్‌డౌన్‌లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వాహనచోదకులు, కొన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పలు విమర్శలు చేస్తున్నారు. కనీసం వాహనచోదకులు చెప్పిన మాటలు వినకుండా ఫైన్‌లు వేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 1000 నుంచి రూ. 2000 వరకూ జరిమానాలు వేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయట పనులు లేక చేతుల్లో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో అవసరం మేరకు బయటకు వస్తే పోలీసులు ఇలా జరిమానాలు, కేసులు పెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ. 2 కోట్ల వరకూ వాహనాలపై జరిమానాలు విధించి, 700 వాహనాలను సీజ్‌ చేసినట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. అనంతపురం నగరంలోనే 15,580 వాహనాలపై రూ. 85,87,975లు జరిమానా విధించారు.

Updated Date - 2020-04-18T10:20:08+05:30 IST