పట్టా.. కుట్ర

ABN , First Publish Date - 2020-12-26T06:13:53+05:30 IST

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ భూమి అందుబాటులేని చోట.. భూమిని కొనుగోలు చేసైనా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఇది కొంతమంది అధికార పార్టీ నాయకులకు, రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇందుకు వారు నానా అడ్డదారులు తొక్కుతున్నారు. అనంతపురం రూరల్‌ మండలం చిన్నంపల్లి గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు తాను ఒకరికి రిజిస్టర్‌ చేయించిన భూమినే.. తిరిగి ప్రభుత్వానికి అమ్మకానికి పెట్టాడు.

పట్టా.. కుట్ర

ప్రజా సొమ్ము రూ. 3 కోట్లకు ఎసరు.!

కాజేసేందుకు అధికార పార్టీ నాయకుడి పన్నాగం.. !

ఇతరులకు విక్రయించిన భూమిని.. తిరిగి ప్రభుత్వానికి అమ్మకం

భాగస్వాములుగా మారి అన్నీ తామై వ్యవహరించిన రెవెన్యూ ఉద్యోగులు

వివరాలు ఆరా తీయకుండానే ఆ నాయకుడి ఖాతాలోకి పరిహారం 

ఆంధ్రజ్యోతిని ఆశ్రయించిన బాధితులు

ఉన్నతాధికారులే న్యాయం చేయాలని వేడుకోలు


అనంతపురంరూరల్‌, డిసెంబరు 25 : పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ భూమి అందుబాటులేని చోట..  భూమిని కొనుగోలు చేసైనా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఇది కొంతమంది అధికార పార్టీ నాయకులకు, రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇందుకు వారు నానా అడ్డదారులు తొక్కుతున్నారు. అనంతపురం రూరల్‌ మండలం చిన్నంపల్లి గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు తాను ఒకరికి రిజిస్టర్‌ చేయించిన భూమినే.. తిరిగి ప్రభుత్వానికి అమ్మకానికి పెట్టాడు.  పక్క గ్రామంలో ఓ గ్రామ రెవెన్యూ అధికారి, మరో గ్రామ రెవెన్యూ అధికారిని తనతో కలుపుకున్నాడు. దాదాపు రూ. 3 కోట్లు కాజేసేందుకు పన్నాగం పన్నాడు. ఇందులో గ్రామ రెవెన్యూ అధికారులు భాగస్వాములుగా మారి కథను ముందుకు సాగించారు. ఈ ప్రక్రియ మొత్తం చివరి అంకంలో ఉన్న తరుణంలో బయటకు పొక్కింది. దీంతో అసలైన భూమి హక్కుదారులు అవాక్కైయ్యారు. ఆ భూమి తమదేనంటూ వారు ఆంధ్రజ్యోతిని ఆశ్రయించారు. ఉన్నతాధికారులు సైతం పెద్ద మొత్తంలో ప్రభుత్వ సొమ్ము పెట్టి భూమి కొనుగోలు చేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.  


వివరాల్లోకి వెళ్లితే..

అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట గ్రామ సర్వేనెంబరు 164-2లో 15.39 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని 1929లో చిన్నారెడ్డి అనే వ్యక్తికి డీ.పట్టా మంజూరు చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి మాదిరెడ్డి నారాయణమ్మకు దాన్ని విక్రయించాడు. ఆ తరువాత 1941లో సంజీవరెడ్డి అనే వ్యక్తి ఆ మహిళ నుంచి కొనుగోలు చేశాడు. కొనుగోలు దారుడు 1951లో గంగులకుంట నారాయణరెడ్డి, మాదిరెడ్డి సుబ్బరాయుడులకు రిజిస్టర్‌ చేయించి ఇచ్చాడు. అనంతరం వారి ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న భూములను పెద్దల సమక్షంలో రెండు భాగాలు విభజించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ 15.39 ఎకరాల భూమి నారాయణరెడ్డికి వచ్చింది. ఈ వ్యక్తి కుమారుడు ఆ భూమిని నగరానికి చెందిన జిలాన్‌ అలీఖాన్‌కు 1984లో రిజిస్టర్‌ (రిజిస్టర్‌ డాక్యుమెంట్‌ నెంబరు 6070-1984) చేయించి ఇచ్చారు. అనంతరం జిలాన్‌ అలీ ఖాన్‌ 2014లో నగరంలోని మకాన్‌ దార్‌సాజిద్‌ అనే వ్యక్తికి దాన్ని రూ.31 లక్షలకు విక్రయించాడు. ఇంత వరకు బాగానే ఉన్నా జిలాన్‌ అలీఖాన్‌కు భూమిని విక్రయించిన నారాయణరెడ్డి కుమారుడు ఆ భూమి తమకు సంబంధించిందేనని ప్రభుత్వానికి అమ్మకానికి పెట్టాడు.


కలిసొచ్చిన రెవెన్యూ రికార్డులు..

జిలాన్‌ అలీఖాన్‌ భూమిని కొన్న తరువాత రెవెన్యూ రికార్డులలో ఆ భూమిని వారి పేరు మీదకు మార్చుకోక పోవడం అధికార పార్టీ నాయకుడికి కలిసొచ్చినట్లైంది. దీనికితోడు జిలాన్‌ అలీఖాన్‌తో శాశ్వత విక్రయం చేయించుకున్న మకాన్‌దార్‌సాజిత్‌ కూడా భూమిని తన పేరు మీదుగా రెవెన్యూ రికార్డులోకి ఎక్కించుకోలేదు. ఈ క్రమంలోనే జిలాన్‌ అలీఖాన్‌, కాన్‌దార్‌ సాజిత్‌ పలుమార్లు భూమిని తమ పేరుమీదుగా మార్చాలని రెవెన్యూ అధికారులను కోరినట్లు తెలిసింది. అయితే సదరు అధికారులు కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆ వ్యక్తులు 2017లో కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే భూమి వారి పేరు మీదకు మాత్రం మార్పుకాలేదు. ఇది అధికార పార్టీ నాయకుడికి బాగా కలిసివచ్చింది. ఇటివల పేదలకు ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ ఉన్నాతాధికారులు భూ అన్వేషణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆ అధికార పార్టీ నాయకుడు తన ఊరు పక్కనే ఉన్న కురుగుంట నివాసి, రెవెన్యూ గ్రామ అధికారిని సంప్రదించి పని కానిచ్చారు. దీనిలో మరో గ్రామ రెవెన్యూ అధికారి వారితో భాగస్వామిగా మారి అందుకు అనుగుణంగా రెవెన్యూ ఉన్నాతాధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 


రూ.20 లక్షలలో విక్రయం..

సదరు నాయకుడి నుంచి ఎకరా రూ. 20 లక్షలతో ఆ భూమిని కొనుగోలుకు గ్రామ రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి మండల రెవెన్యూ ఉన్నాతాధికారికి ప్రతిపాధించారు.  ఆయన ఆ ప్రతిపాదనలు తన ఉన్నత స్థాయి అధికారి పంపించారు. ఆయన కూడా రెవెన్యూ రికార్డుల పరంగా ఆ భూమి అధికార పార్టీ నాయకుడి పేరు మీదుగా ఉండటంతో పరిహారం సొమ్మును ఆ నాయకుడి ఖాతాలోకి జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం 15.39 ఎకరాలకు రూ. 3.10 కోట్ల అతని ఖాతాలోకి జమ అయినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకుంటాం

రూ. లక్షలతో ఆ భూమిని కొనుగోలు చేశాను. అం దుకు అనుగుణంగానే శాశ్వత విక్రయం చే సుకోవడం జరిగింది. అయి తే నారాయణరెడ్డి కుమారుడు, వీఆర్వోలు క లసి నన్ను నిలువునా ముంచారు. భూమిని నా పేరుమీదకు మార్చకుం డా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇప్పుడేమో దబాయిస్తున్నారు. ఈ విషయమై గ్రామ రెవెన్యూ ఉన్నాతాధికారులు మమ్మల్ని సంప్రదించారు. శివ శంకర్‌రెడ్డిని, మమ్మల్నీ కూర్చోపెట్టి సంది కుదుర్చుతామని, అయితే అందులో తమకూ వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయినా మేం ఆ భూమిని విక్రయించం. ఉన్నాతాధికారులే మాకు న్యాయం చేయాలి. లేకుంటే ఆ భూమిలోనే నాకుటుంబ సభ్యులతో కలసి ఆత్మహత్య చేసుకుంటా. 

- మకాన్‌దార్‌ సాజిద్‌ఎవరూ ఫిర్యాదు చేయలేదు 

ఆ భూమిపై మాకు ఎవరూ ఫి ర్యాదు చేయలేదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి ఎవ్వరి పేరుమీద ఉంటే వారికే పరిహారం  ఇస్తాం.  రెండు రోజుల కిందటే ఆ సొ మ్ము కూడా ఆ వ్యక్తి ఖాతాలోకి జమైంది. దీనిపైన ఎవరైనా ఫిర్యాదు చేసి ఉంటే మేము కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేవాళ్లం. 

- లక్ష్మీనారాయణరెడ్డి, తహసీల్దార్‌


Updated Date - 2020-12-26T06:13:53+05:30 IST