కరోనా దెబ్బకు ఆఫీసులు బంద్‌

ABN , First Publish Date - 2020-08-11T11:01:24+05:30 IST

: కరోనా వైరస్‌ ప్రభావంతో అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

కరోనా దెబ్బకు ఆఫీసులు బంద్‌

 వైరస్‌ బారిన పడుతున్న ఉద్యోగులు

 బ్యాంకింగ్‌ రంగం విలవిల

 కంటైన్మెంట్‌ జోన్లలోని బ్యాంకులన్నీ బంద్‌

 పనివేళల కుదింపుతో కొన్నింటిలోనూ అరకొర సేవలు

 ఇబ్బంది పడుతున్న ఖాతాదారులు

 మిగతా ప్రభుత్వ ఆఫీసులదీ అదే దారి


 అనంతపురం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ ప్రభావంతో అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగం కుదేలైంది. ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో పనివేళలు కుదిస్తున్నారు. అరకొరగా పనులు జరుగుతుండటంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతున్న క్రమంలో కంటైన్మెంట్‌జోన్‌ల సంఖ్య విపరీతంగా పెరిగి పోతోంది. దీంతో కంటైన్మెంట్‌ జోన్‌లలో ఉన్న బ్యాంకులన్నీ పూర్తిస్థాయిలో బంద్‌ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు బ్యాంకుల్లో వివిధ రుణాలకు సంబంధించి డబ్బులు డిపాజిట్‌ చేయాలన్నా అత్యవసరాలకు బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకోవాలన్నా దిక్కు తోచని  స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.


రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంట కాలంలో అందులోనూ వర్షాలు బాగా పడిన నేపథ్యంలో కలుపు తీయించేందుకు అవసరమైన డబ్బుల కోసం నానా పాట్లు పడాల్సి వస్తోంది.  బంగారం పెట్టి డ బ్బులు తెచ్చుకోవాలనుకున్నా బ్యాంకులు బంద్‌ కావడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. అన్ని వర్గాలకు అన్ని ఇబ్బందులకు భరోసా నిచ్చే సంజీవని లాంటి బ్యాంకులు అత్యధికంగా బంద్‌ కావడం ప్రజలను ఇబ్బంది పెడుతోంది.  


మూతపడ్డ బ్యాంకులు.. స్తంభించిన లావాదేవీలు

జిల్లాలో ఎస్‌బీఐ, సిండికేట్‌, కెనరా, అంధ్రప్రగతి గ్రామీణ, యూనియన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇలా 33 బ్యాంకులున్నాయి. వీటి పరిధిలో 471 బ్రాంచులున్నాయి. ముఖ్యంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరిధిలో 150 బ్రాంచులుండగా దాదాపు 50కుపైగా బ్యాంకులు కరోనా ప్రభావంతో మూతపడినట్లు సమాచారం. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పరిధిలో 123 బ్రాంచులుండగా 30కి పైగా బ్రాంచులు మూతపడినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని పాతూరులో ఉన్న ఎస్‌బీఐ, సిండికేట్‌, గ్రామీణ, అర్బన్‌ బ్యాంకులు పూర్తిస్థాయిలో బంద్‌ కావడంతో అక్కడి వ్యాపారులు, ఖాతాదారులకు మనీ తిప్పలు తప్పడం లేదు.


హిందూపురం పరిధిలో బ్యాంకులు 2 గంటల వరకే పనిచేస్తున్నాయి. కళ్యాణదుర్గం ప్రాంతంలో యూనియన్‌, కెనరా, ఎస్‌బీఐ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాం కులు మూతపడ్డాయి. ఆయా బ్యాంకుల్లో పనిచేస్తున్న కొందరు మేనేజర్లు, సిబ్బందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో బయటపడటంతో బ్యాంకులను మూసి వేశారు. బ్యాంకు రుణాలు పొందాలన్నా, తీసుకున్న రుణా లు చెల్లించాలన్నా ఖాతాదారులకు కష్టాలు తప్పడం లేదు. గత నాలుగు నెలలుగా ఇదే దుస్థితి నెలకొనడం గమనార్హం. 


ఏటీఎంలలో నో క్యాష్‌

కరోనా ప్రభావంతో మూతపడిన ప్రాంతాల్లోని బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో నగదు పెట్టడం లేదు. దీంతో ఖాతాదారులు మరింత నిరుత్సాహానికి గురవు తున్నారు.  జిల్లాలో 33 బ్యాంకులకు సంబంధించి 480 ఏటీఎంలున్నాయి. ఇందులో ప్రధానంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 275 ఏటీఎంలుండగా అందులో 150 ఏటీఎంలలో క్యాష్‌ లభించడం లేదు. మిగతా బ్యాంకుల ఏటీఎంలలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. అనంతపురంలో అత్యధికంగా ఏటీఎంలున్నప్పటికీ 20 శాతం ఏటీఎంలలో మాత్రమే నగదు లభ్యమవుతోంది. 


ప్రభుత్వ కార్యాలయాలదీ అదే దారి....

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడుతుండటంతో జిల్లాలో కొన్ని కార్యాలయాలను బంద్‌ చేశారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీతో పాటు,   మండల పరిషత్‌ కార్యాలయం, వ్యవసాయ, ఉద్యాన, గృహనిర్మాణ, ఆర్టీసీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌ రావడంతో దాదాపుగా గత నెలలో 14 రోజుల పాటు కార్యాలయాలు బంద్‌ చేశారు. దీంతో ఆ రోజుల్లో ప్రజలకు అందాల్సిన సౌకర్యాలు అందలేదు.


కరోనా పాజిటివ్‌ బూచి చూపి అధికారులు ఉన్న ఫలంగా కార్యాలయాలు మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం జిల్లా అధికారుల వ్యవహారశైలితో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. ఇటీవల కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి భర్తకు కరోనా వచ్చిందంటూ ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం నుంచి బంద్‌ చేశారు. 10వ తేదీ కార్యాలయం ఓపెన్‌ చేస్తామని ప్రకటించినప్పటికీ... మరో ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చిందనే సాకుతో కార్యాలయాన్ని తెరవలేదు. తాజాగా ఏ ప్రకటనా విడుదల చేయకుండా ఉన్న ఫలంగా సోమవారం నుంచి బుధవారం వరకూ బంద్‌ చేశారు.


ఈ విషయం తెలియని పలు పాఠశాలల టీచర్లు, ప్రైవేట్‌ స్కూళ్ల కరస్పాండెంట్లు డీఈఓ ఆఫీస్‌కు వచ్చి ఇబ్బందులు పడ్డారు. ఇక సమగ్రశిక్ష కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో రెండుసార్లు బంద్‌ చేశారు. సోమవారం తిరిగి కార్యాలయం తలుపులు తెరిచినా పట్టుమని 10 మంది ఉద్యోగులు కూడా కనిపించలేదు.  


బ్యాంకు సేవలు లేక ఇబ్బందులు  : రాజశేఖర్‌ చౌదరి, ఖాతాదారుడు, కళ్యాణదుర్గం

బ్యాంకు అధికారులకు కరోనా సోకడంతో బ్యాంకులు మూతపడ్డాయి. లావాదేవీలు జరగక కష్టాలు పడుతు న్నాం. తీసుకున్న అప్పులు చెల్లించలేకపోతున్నాం. కొత్త రుణాలు పొందలేకపోతున్నాం. నాలుగు నెలలుగా బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయాయి. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. బ్యాంకులు తెరిచి తిరిగి ఆర్థిక లావాదేవీలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. 


అధికారుల తీరు బాగాలేదు : పుల్లారెడ్డి, ఏపీయూఎస్‌ఎంఏ జిల్లా అధ్యక్షుడు

డీఈఓ కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా వచ్చిందని బంద్‌ చేశారు. కనీసం ముందురోజు కూడా కార్యాలయం బంద్‌ చేస్తున్నట్లు ఎవరికీ సమాచారం లేదు. స్కూళ్ల రెన్యువల్‌, అనుమతులు ఇతర పనులపై జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు వస్తున్నారు. కార్యాలయం బంద్‌ చేయడంతో వ్యయప్రయాసాలకు ఓర్చి వచ్చిన వారు నిట్టూర్పుతో వెనక్కు వెళ్తున్నారు. కరోనా సమయంలో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడమే కష్టం. ఇక్కడికొచ్చిన తరువాత ఆఫీసు లేదంటే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలి. అధికారుల తీరు బాగాలేదు. 

Updated Date - 2020-08-11T11:01:24+05:30 IST