మూడేళ్లలో 17 నూతన వైద్య కళాశాలలు

ABN , First Publish Date - 2020-03-04T06:57:47+05:30 IST

రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో 17 నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు.

మూడేళ్లలో 17 నూతన వైద్య కళాశాలలు

 ప్రయోగాత్మకంగా బోధన చేయాలి

పరిశోధనలకు ప్రత్యేక పారితోషికం

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ   వైస్‌ చాన్స్‌లర్‌ శ్యాంప్రసాద్‌


అనంతపురం వైద్యం, మార్చి 3 : రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో 17 నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన అనంత వైద్య కళాశాలను సందర్శించారు. విద్యార్థులు, వైద్యాధికారులు, ప్రొఫెసర్లతో వేర్వేరుగా సమావేశమై సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. తొలుత వైద్య విద్యార్థులతో గంటపాటు ముఖాముఖి నిర్వహించారు. ఆ సమయంలో పలు ప్రశ్నలను వీసీ అడగగా... వైద్య విద్యార్థులు మౌనంగా ఉండిపోయారు. దీంతో వీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో వైద్య విద్యార్థులు చాలా వెనుకబడ్డారంటూ చురకలంటించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామస్వామినాయక్‌తో కలిసి అన్ని విభాగాల హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైస్‌చాన్స్‌లర్‌ మాట్లాడుతూ వైద్యరంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. వైద్య కళాశాలల్లో బోధన ప్రయోగాత్మకంగా సాగాలన్నారు. చదువుకుంటూ పాఠాలు చెబితే ప్రయోజనం ఉండదన్నారు. ప్రతి విద్యార్థి పరిశోధకుడిగా మారాలన్నారు. చదువుతో పాటు విద్యార్థుల్లో స్కిల్స్‌ అభివృద్ధి చేయాలని సూచించారు.


అనంత వైద్య విద్యార్థులు స్కిల్స్‌లో వెనుకబడి ఉన్నారని, దీనివల్ల భవిష్యత్తులో రాణించలేరన్నారు. ఒక్క సబ్జెక్టులో ఫెయిల్‌ అయినా ఆ విద్యార్థి భవిష్యత్తు నాశనమవుతుందని, ఇది గుర్తెరిగి ప్రతి ప్రొఫెసర్‌ విద్యార్థులకు పాఠాలు బోధించాలని హితబోధ చేశారు. వైద్య కళాశాలలో వైద్య విద్యార్థుల పరిశోధనలకు ప్రత్యేక పారితోషికం ఇస్తామన్నారు. అందుకే ఐదు విభాగాల నుంచి ప్రయోగాలు చేసి పంపించాలని, ఎంపికైన వాటికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు పారితోషికం మంజూరు చేస్తామన్నారు. అలాగే వైద్య విద్యార్థులకు భవిష్యత్తులో చదివే ఎండీ, ఎంఎస్‌, డీఎం, ఎంసీహెచ్‌ కోర్సులు ఎక్కడికక్కడ మంచిగా ఉంటాయో ముందుగానే తెలియజేయాలన్నారు. మెడికల్‌ డిస్టినరీ ప్రతి ప్రొఫెసర్స్‌ వద్ద ఉండాలని, అది ఎవరి వద్ద లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. బ్లడ్‌బ్యాంకు గురించి వైద్య విద్యార్థులకు బాగా అవగాహన పెంచాలన్నారు. అందరూ సమష్టిగా కలిసి పనిచేసినప్పుడే కళాశాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో వైస్‌ ప్రిన్సిపాళ్లు ఉషాదేవి, నవీన్‌కుమార్‌, జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ వెంకటేశ్వరరావు, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ జోజిరెడ్డి, మానసిక వ్యాధి విభాగాధిపతి డాక్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్‌, మత్తుమందు విభాగాధిపతి డాక్టర్‌ నవీన్‌కుమార్‌, ఫోరెన్సిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ సాయిసుధీర్‌, మైక్రో బయాలజీ విభాగాధిపతి డాక్టర్‌ స్వర్ణలత, మానవ అంతర్నిర్మాణ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ సంధ్య, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్‌ మల్లీశ్వరీ, గైనిక్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంధ్య, ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పరదేశీనాయుడు, వైద్యకళాశాల అన్ని విభాగాల ఆచార్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-04T06:57:47+05:30 IST